ఇదే నా ఎకనామిక్స్ ఇదే నా పాలిటిక్స్ – జగన్

By KTV Telugu On 17 March, 2023
image

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తన అజెండాను రాష్ట్ర ప్రజలకు మరోసారి చాటి చెప్పారు. అదే సమయంలో విపక్షాలకు ఇవ్వాల్సిన సంకేతాలు కూడా చాలా బలంగా పంపారు. 2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యమని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి తన నడక తన ప్రయాణం రెండూ కూడా పేదలు అట్టడుగు వర్గాలతోనే అని అన్నారు. పేదల సంక్షేమం కోసం తాను పోరాడేది మాత్రం పెత్తందార్లతో అన్నారు. పైకి రాజకీయ పార్టీల పేర్లు చెప్పకపోయినా ప్రధాన ప్రతిపక్షం టిడిపితో పాటు జనసేనకు కూడా జగన్ మోహన్ రెడ్డి సంకేతాలు పంపేశారు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.5 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామని చెప్పిన ముఖ్యమంత్రి ఇందులో గ్రాఫిక్స్ లేవు మాయాజాలాలు లేవు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా తెలుగుదేశం పార్టీపై పెద్ద సెటైరే వేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాజధాని అమరావతిని ఏళ్ల తరబడి గ్రాఫిక్స్ లోనే చూపించారు. గ్రాఫికల్ డిజైన్ నమూనాను చూపించే ప్రపంచం అసూయతో రగిలిపోయే రాజధాని కట్టేస్తున్నాం అని నమ్మించారు. అయితే అయిదేళ్ల కాలంలో ఆయన రాజధాని నిర్మించకపోవడమే కాదు ఒక్కటంటే ఒక్క పక్కా భవనం కూడా నిర్మించలేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. నిర్మించిన కొన్ని భవనాలూ కూడా తాత్కాలిక భవనాలే. ఈ విషయాన్ని టిడిపి ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించుకుంది కూడా.
తమ పాలనలో ఇటువంటి గ్రాఫిక్స్ కథలు ఉండవని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుణ్ని జగన్ వెక్కిరించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

తనకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో వ్యవసాయమూ అంతే ముఖ్యమన్నారు. ఇలా అనడానికీ కారణాలున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్నారు. వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరించి పరిశ్రమగా మార్చాలన్నారు చంద్రబాబు. వ్యవసాయాన్ని పండగ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇపుడు దాన్నే ప్రస్తావిస్తూ తాను పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యతనిస్తానో వ్యవసాయానికీ అంతే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకున్నారు. తనకు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత ముఖ్యమో చిరు వ్యాపారస్థులు కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించారు జగన్. ఇది కూడా బాబును దెప్పిపొడవడానికే. చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఐటీ జపమే చేసేవారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి ఐటీ రంగం ఎంత అవసరమో గ్రామీణ ఆర్దిక వ్యవస్థ ఊపందుకోడానికి చిరు వ్యాపారులూ అంతే కీలకమన్నది ఆర్ధిక వేత్తలు చెప్పే సూత్రం. దాన్నే జగన్ మోహన్ రెడ్డి అంది పుచ్చుకునే ప్రయత్నం చేయడం ద్వారా తాను నిరుపేద చిరు వ్యాపారులకూ అండగా ఉంటానన్న భరోసా అందించారు. అదే విధంగా తనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో నెల నెలా పింఛన్లు తీసుకునే అవ్వాతాతలు కూడా అంతే ముఖ్యమన్నారు జగన్ మోహన్ రెడ్డి.

నా యుద్ధం పెత్తం దార్లతోనే అని మరోసారి ఉద్ఘాటించారు జగన్. ఈ మధ్య కాలంలో ఈ పద ప్రయోగం చాలా సార్లు చేస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 31లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే చాలా చోట్ల ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేసేలా టిడిపి నేతలు వారి బినామీల ద్వారా కోర్టుల్లో కేసులు వేయించారు. దాంతో న్యాయస్థానాలు వాటిపై స్టేలు విధించాయి. ఆ స్టేలను క్లియర్ చేయించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పంపిణీ చేసిన చోట ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం కాస్త ఆలస్యం అయ్యింది. పేదలకు మంచి చేద్దామని ప్రభుత్వం భావిస్తే పెత్తందార్ల పక్షం వహించే చంద్రబాబు నాయుడు ఆ మంచి పనికి అడ్డుపడ్డారని జగన్ మోహన్ రెడ్డి గతంలోనూ నిప్పులు చెరిగారు. ఇపుడు మరో సారి దీన్ని గుర్తు చేయడం ద్వారా మీ పేదల పక్షాన నేను నిలబడితే మీకు వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ కో నిలబడి మీకు మంచి జరక్కుండా అడ్డుపడుతున్నారు కాబట్టే వారితోనేను యుద్దం చేయబోతున్నాను అని జగన్ మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు.

ఇవే కాదు రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు నగదును నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తూ వస్తోంది. లంచాలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు నగదు అందుతోంది. ఈ పథకాలను పప్పు బెల్లాల పంచిపెట్టడంతో పోల్చిన చంద్రబాబు నాయుడు ఇలాంటి పథకాలతోనే రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారంటూ ప్రచారం చేశారు. ఈ పథకాలను ఆపకపోతే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని కూడా హెచ్చరించారు. అయితే రోజులు గడిచే కొద్ది తన వ్యాఖ్యల పట్ల పేదల్లో వ్యతిరేకత పెరుగుతోందని గమనించారో ఏమో కానీ చంద్రబాబు నాయుడితో పాటు టిడిపి నేతలు వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి అధికారంలోకి వస్తే ఈ పథకాలను ఆపేస్తుందని పాలక పక్షం ప్రచారం చేస్తోందని కానీ తాము ఈ పథకాలను కొనసాగించితీరతామని భరోసా ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే ఏ పథకాలైతే ఏపీని దివాళా తీయిస్తాయని అన్నారో అవే పథకాలు తామూ కొనసాగిస్తామని చెప్పడం మొదలు పెట్టారు.

వీటిని దృష్టిలో పెట్టుకునే అసెంబ్లీ ద్వారా జగన్ మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తాను నాలుగేళ్లుగా ఏం చేశారో మరోసారి ఏకరవు పెట్టారు. వాటిని మళ్లీ ప్రజల దృష్టికి తెచ్చారు. తద్వారా గతంలో విపక్షాలు చేసిన వ్యాఖ్యలూ ప్రజలకు గుర్తుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. అదే సమయంలో పాలకపక్షం మనకి ఇన్ని చేసింది కదా అన్న భావనా వస్తుంది. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి భావనలు ప్రజల్లో తరచుగా వచ్చేలా చేయడం చాలా అవసరమన్నది జగన్ మోహన్ రెడ్డి వ్యూహంగా చెబుతున్నారు. మొత్తానికి హుందాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూనే విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ప్రజల దృష్టికి ప్రభుత్వ పథకాలను తీసుకు వస్తూ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ పండితులు అంటున్నారు.