సిలికాన్‌వ్యాలీ బ్యాంక్‌ పతనం.. స్టార్టప్‌లకు షాక్‌

By KTV Telugu On 17 March, 2023
image

ఆర్థికసంక్షోభం అమెరికాని వణికిస్తోంది. అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్ వ్యాలీ దివాలా తీసింది. దాంతో పాటు సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా మూతపడింది. అమెరికాలోని దిగ్గజ బ్యాంకుల షట్‌డౌన్‌తో ఆర్థిక మాంద్యం తప్పదన్న ఆందోళన మొదలైంది. సిలికాన్ వ్యాలీ మాతృ సంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్. టెక్ ఆధారంగా పని చేసే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌కు ఇది నిధులు అందిస్తుంటుంది. శాంతాక్లారా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం బ్యాంకింగ్‌ రంగ లొసుగులను ఎత్తిచూపుతోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎక్కువగా టెక్నాలజీ సంస్థలకు రుణాలిస్తుంటుంది. అమెరికాలో గత ఏడాది స్టాక్ మార్కెట్‌లోని లిస్టెడ్ కంపెనీలలో దాదాపు సగం టెక్నాలజీ హెల్త్‌కేర్ స్టార్టప్‌లకు ఎస్వీబీనే రుణాలిచ్చింది. అయితే ఈమధ్య వడ్డీ రేట్లు బాగా పెరగడంతో స్టార్టప్‌లకు ప్రైవేటు రంగం నుంచి నిధులు పోగుచేసుకోవడం కష్టమైంది. చాలామంది ఖాతాదారులు డబ్బు డ్రా చేసుకోవటంతో బ్యాంకు చిక్కుల్లో పడింది.

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనంతో న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా సంక్షోభంలో పడింది. క్రిప్టోకరెన్సీ డిపాజిట్లు బ్యాంకు పతనానికి కారణమయ్యాయి. అమెరికాలో వరుసగా రెండు బ్యాంకుల మూత ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలో టెక్నాలజీ స్టార్టప్‌లకు కొండంత అండగా ఉన్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ) ఇంత వేగంగా కుప్పకూలుతుందని ఎవరూ ఊహించలేదు. పతనావస్థలో ఉన్న అదానీని ఇప్పటికీ నమ్ముతున్న ఇన్వెస్టర్లు సిలికాన్‌ వ్యాలీని మాత్రం విశ్వసించలేదు. డిపాజిటర్లకు ఆస్తులమ్మి చెల్లింపులు చేయబోతోంది ఎస్వీబీ. కానీ గరిష్టంగా ఇచ్చేది మాత్రం లక్షా యాభైవేల డాలర్లే. మన కరెన్సీలో ఇన్సూరెన్స్‌ కింద 5 లక్షల రూపాయలదాకా డిపాజిటర్లకి దక్కుతుందన్నమాట.

మన దేశంలో ఏదన్నా బ్యాంకు దివాళా తీసినా డిపాజిటర్లకి దక్కేది ఇంతే. ఇదివరకు ఈ మొత్తం లక్షదాకే ఉండేది. మోడీ ప్రభుత్వమే దాన్ని రూ.5లక్షలకు పెంచింది. అమెరికాలో అతి పెద్ద బ్యాంకే కుప్పకూలిపోవటంతో మన బ్యాంకుల డొల్లతనం తెలిసినవారు మరింత ఆందోళన పడుతున్నారు. అమెరికాలో అన్నీ రూల్స్‌ ప్రకారం జరుగుతాయనుకోవడం భ్రమ. ఎందుకంటే అక్కడి చట్టసభల్లో జరిగేంత లాబీయింగ్‌ మరెక్కడా కనిపించదు. మేనేజ్‌ చేస్తే ఎన్ని లొసుగులున్నా మంచి క్రెడిట్ రేటింగ్ వచ్చేస్తుంది. ప్రపంచానికి నీతులు చెప్పే ముందు అమెరికా తమ గురివింద గింజల్లాంటి సంస్థల సంగతి చూసుకుంటే మంచిది. అంతర్జాతీయ స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు పేరొందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ మూతతో మన దేశంలోని స్టార్టప్‌ ఇండస్ట్రీ కూడా షాక్‌ తింది. భార‌త్‌లోని 200 స్టార్టప్‌లతోపాటు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లు ఎస్వీబీలో పెట్టుబ‌డులు పెట్టాయి. ఎస్వీబీ ప‌త‌నంతో భార‌త్‌లో క‌నీసం 21 స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో కంపెనీల డబ్బును బాండ్‌ మార్కెట్‌లో పెట్టాయి బ్యాంకులు.. ప్రైవేట్‌ బాండ్‌ మార్కెట్‌ కుప్పకూలడంతో నష్టాల్లోకి జారిపోయినట్లు బ్యాంకులు చెబుతున్నాయి. దీంతో డిపాజిట్లు చేసినవాళ్లంతా డబ్బులు డ్రా చేసేందుకు క్యూ కట్టారు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ అమెరికన్లు బ్యాంకుల్లో డబ్బును ఒక్కసారిగా బయటకు తీసేశారు. దీంతో బ్యాంకింగ్‌ వ్యవవస్థ కుప్పకూలింది. ఇండియాపై సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం అంతగా ప్రభావం చూపదని అనుకుంటున్నా.. భారత స్టార్టప్‌ కంపెనీలు అమెరికా కంపెనీలపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.