రాహుల్ వ్యాఖ్యలే ఇప్పుడు దేశ సమస్యనా.. దారి తప్పుతున్న బీజేపీ

By KTV Telugu On 17 March, 2023
image

కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బాధ్యతాయుతంగా ఉంటే ఏం చేయాలి. దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి దేశ సంపదను దోచుకుంటున్న వారిని కట్టడి చేయాలి దేశాభివృద్ధికి ప్రయత్నించాలి అలా చేస్తున్నామని చట్టసభల ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాలు అధికార పార్టీ వ్యూహాన్ని చూస్తే బీజేపీ ఎందుకిలా చేస్తోంది అని ఎవరికైనా అనుమానం వస్తోంది. రాహుల్ గాంధీ పేరుతో బీజేపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన లండన్‌లో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతోంది. అసలు తాను అదానీ గురించే చెప్పాను కానీ దేశం గురించి మాట్లాడలేదని రాహుల్ అంటున్నారు. తన వాదన వినిపించడానికి పార్లమెంట్‌లో అవకాశం ఇవ్వాలంటున్నారు అయితే దీనికి బీజేపీ నేతలు అంగీకరించడం లేదు. క్షమాపణ చెప్పాలని సభను జరపనివ్వడానికి కూడా అంగీకరించడం లేదు. రాహుల్ క్షమాపణ చెప్పకపోతే దేశం మొత్తం ప్రచార ఉద్యమం నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించేశారు. అసలు దేశానికి ఉన్న సమస్య రాహుల్ గాంధీ క్షమాపణేనా నిజమైన ప్రజా సమస్యలు బీజేపీకి పట్టవా అధికార పార్టీ ప్రజల్ని ఎలా అంచనా వేస్తోంది.

లండన్‌లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడడానికి ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. భారత్‌లో ప్రతిచోట గొంతులను అణచివేస్తున్నారని బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడమే దీనికి ఉదాహరణ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకున్న బీజేపీ ఆర్ఎస్ఎస్‌లతో విపక్షాలు పోరాడతున్నాయని రాహుల్ వివరించారు. మోదీ అదానీ కలిసి ప్రజల సంపదను హరింపచేశారని విమమర్శించారు.

రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారో లేదో అలా బీజేపీ నేతలు భారత్ ను కించ పరిచారని ఉద్యమం ప్రారంభించారు. రాహుల్ గాంధీ విదేశాలలో భారత్ గురించి చెడుగా మాట్లాడుతూ పరువు తీస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ క్షమామపణ చెప్పాలంటున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం తాను దేశాన్ని కించ పరిచినట్లుగా ఒక్క మాట చూపించాలని సవాల్ చేస్తున్నారు. దేశం లో ఉన్న పరిస్థితుల గురించే తాను చెప్పానని అందులో తప్పులుంటే చెప్పాలని అంటున్నారు. బీబీసీపై నియంత్రణ మీడియాపై దాడులు విపక్షాలపై దాడులు ఇలా ఏ అంశమైనా రాహుల్ చెప్పింది కరెక్టెనని అందులో తప్పులేమున్నాయని దేశాన్ని కించ పరిచే విషయాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ రివర్స్‌లో మోదీ విదేశాల్లో చేసే స్పీచ్‌ల ను ప్రస్తావిస్తోంది. నరేంద్ర మోదీ విదేశీ వేదికలపై చేసిన ప్రసంగాలల్లో దేశాన్ని కించపరిచే అంశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతూంటారు. తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి ముందు 60 ఏళ్లలో భారత్‌లో అవినీతి విపరీతంగా ఉండేదని ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ విదేశాలలో మాట్లాడతారు. తన గొప్పను చెప్పుకోవడానికి దేశాన్ని కించ పరుస్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు దీని పై అనేక ప్రసంగాలు క్లిప్పులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడిన వారిని భారత్‌ను అవమానించింది ప్రధాని మోదీనేనని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.

రాహుల్ గాంధీ ఏమీ దేశాన్ని కించపర్చకపోయినా అలా ఓ ఉద్వేగాన్ని సృష్టించడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం అంటూ ఓ పడికట్టు పదంతో ప్రజల్ని ఉద్వేగంలో ముంచి తమ పని తాము చేసుకెళ్లిపోవడం బీజేపీకి అలవాటయిపోయింది. ఇప్పుడు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేయలేక పెరిగిపోయిన ధరలతో ప్రజలు తంటాలు పడుతున్నారు. పన్నుల భారం కారణంగా మధ్యతరగతి జీవులు నిరుపేదలుగా మారుతున్నారు. నిరుద్యోగం పెరిగిపోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో జాతి సంపదతో అదానీ వంటి వారు చేస్తున్న వ్యవహారాలపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇలాంటి సమస్యలపై చర్చ జరగకుండా కేంద్రం రాహుల్ గాంధీ ఏదో అన్నారని అది దేశానికి నష్టం చేస్తుందన్నట్లుగా ప్రచారోద్యమం ప్రారంభించడం ప్రజల్ని కించపర్చడమే. అయితే ఈ ప్రజల్ని భావోద్వేగంలో ముంచే మాయ తమ దగ్గర ఉందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే రాహుల్ గాంధీ కామెంట్లను పట్టుకుని అంతకు మించిన సమస్య లేదన్నట్లుగా చెలరేగిపోతున్నారు.

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే అతి ఏదైనా అనర్థదాయకమే. రాజకీయాల కోసం జాతీయత వాడుకోవడం కూడా అంతే. వాడుకున్నంత కాలం బాగానే ఉంటుంది కానీ ప్రతీ దానికి అదే అంశం చూపించి రాజకీయం చేస్తే మొదటికే మోసం వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా బీజేపీ చూసుకోవాల్సి ఉంది. రాహుల్ ఏమన్నారో అందులో మంచి ఉందో చెడు ఉందో ప్రజలకు వదిలేసి అధికార పార్టీగా దేశం కోసం ప్రజల కోసం పని చేయడం ప్రారంభించారు. అప్పుడే ధర్మాన్ని నెరవేర్చినట్లు అవుతుంది.