అన్ని సమస్యలకు కాలమే సమాధానం చెబుతుందని గతంలో పెద్దలు అంటుండేవారు. ఇప్పుడలాంటి సామెతలకు యువతరం మరిచిపోయినా రాజకీయ నాయకులు మాత్రం అవసరం వచ్చినప్పుడు దాన్ని గుర్తుచేసకుని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. తమ అవసరానికి తగ్గట్టుగా నాన్చుతూ జాప్యం చేస్తూ పరిష్కారం కోసం వేచి చూస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు డిలేయింగ్ టాక్టీస్ అమలు చేస్తున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కవిత పేరు బయటకు వచ్చిన తర్వాత ఏడెనిమిది నెలలకు ఆమెను మొదటి సారి ఈడీ ఢిల్లీలో విచారణకు పిలిచింది. ముందుగా సీబీఐ హైదరాబాద్ వచ్చి ఆమెను ఒక సారి ప్రశ్నించింది. రెండో సారి ఢిల్లీ రావాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ ఇంతవరకు వరకు పిలవలేదు. ఇప్పుడు ఈడీ ఒకసారి రోజంతా ప్రశ్నించిన తర్వాత 16న రెండో సారి విచారణకు రావాలని పిలిస్తే ఆఖరి నిమిషంలో కవిత గైర్హాజయ్యారు. 20న రావాలని మరోసారి సమన్లు పంపినా ఆమె హాజరవుతారని నమ్మకం లేదు. కోర్టు ద్వారా టైమ్ అడగడం లేదా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించడం లాంటివి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
కవిత ఆమె సలహాదారులు ఇప్పుడు కొత్త రూట్లు వెదుకుతున్నారు. సాధ్యమైనంత వరకు విచారణకు హాజరు కాకుండా ఉండటమే వారు పాటిస్తున్న వ్యూహం. విచారణకు హాజరైతే నిందితులను అనుమానితులను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు దర్యాప్తు సంస్థల అధికారులు అడిగే ప్రశ్నలు తమకు ఇబ్బందిగా పరిణమించే వీలుంటుంది. వాళ్లు సమాధానాలు రాబట్టేందుకు వత్తిడి పెడతారని కవితకు అర్థమైపోయింది. అందుకే ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని కవిత ఇప్పటికే ఆరోపించారు. కవిత ఇప్పుడు మహిళలు, విచారణలంటూ కొత్త చర్చకు తెరతీశారు. మహిళలను విచారణకు పిలవకూడదని అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ఈ – మెయిల్ లేదా ప్రశ్నావళిని పంపడం ద్వారా విచారించాలని ఆమె అంటున్నారు. బహుశా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ విషయం చెప్పిన మొదటి మహిళ కూడా కవితే కావచ్చు. మహిళా రిజర్వేషన్ పై ఉద్యమిస్తున్న కవిత ఇప్పుడు కేసుల విషయంలోనూ అలాంటి మాటే మాట్లాడుతున్నారు. దర్యాప్తు సంస్థలు మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. కల్వకుంట్ల వారి అమ్మాయి సడన్ గా రూటు మార్చడం వెనుక ఆమె తండ్రి కేసీఆర్ తో పాటు ట్రబుల్ షూటర్ హరీష్ రావు మంత్రాంగం ఉందని విశ్వసిస్తున్నారు. మొదటిసారి ఢిల్లీకి విచారణకు పిలిచినప్పుడే ఆమెను అరెస్టు చేస్తారని భావించారు. అయితే ఢిల్లీలో బీఆర్ఎస్ శ్రేణులను మోహరించడం ద్వారా ఆ రోజు కొంత ఉద్రిక్తత సృష్టించి ఆ పని జరగకుండా ఆపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండో సారి ఆమె విచారణకే హాజరు కాలేదు. ఆరోగ్యం బాగోలేదని చెబుతూనే లా పాయింట్లు తీస్తూ ఆరు పేజీల లేఖ పంపారు.
ఆమె నిర్దిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని సాగదీయడమే కవిత ధ్యేయం. ఏదోక రోజున దర్యాప్తు సంస్థలు వచ్చి ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లాల్సిన అనివార్యతలోకి వారిని నెట్టాలన్నది కవిత ఆలోచన కావచ్చు. కేసీఆర్ హరీష్ కూడా అదే సలహా ఇచ్చి ఉండొచ్చు. ఆమె లీగల్ టీమ్ కూడా అదే మాట చెప్పి ఉండొచ్చు. జాప్యమనేది ఢిల్లీ స్థాయిలో చర్చకు మీడియా నిరంతర వార్తలకు అవకాశం ఇస్తుంది. దానితో పాటుగా బలవంతంగా అరెస్టు చేస్తే కవితకు బీఆర్ఎస్ కు ఇద్దరికీ సింపథీ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. దర్యాప్తు సంస్థలను మోదీ అమిత్ షా శాసిస్తున్నారని బీజేపీ చెప్పినట్లుగా సీబీఐ ఈడీ నడుచుకుంటున్నాయని క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ప్రచారం చేసే వీలు కలుగుతుంది. అప్పుడు అవినీతి సొమ్ము బొక్కి బినామీలతో వ్యాపారం చేయించారన్న బీజేపీ ఆరోపణలు పక్కకు వెళ్లిపోయి కవిత అనే మహిళపై కక్షసాధిస్తున్నారన్న టాక్ ముందు వరుసలోకి వచ్చేస్తుంది. అప్పుడు అసలు సంగతి కంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ – మోదీ వర్సెస్ కేసీఆర్ అనే రాజకీయ చర్చ ఊపందకుుంటోంది. ఈ జాప్యం గేమ్ కొంతమేర సక్సెస్ అయినా ఈ లోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. తటస్థంగా ఉన్న ఓటర్లలో సింపథీ పెరిగిపోయి బీఆర్ఎస్ కు ఓటేసే అవకాశాలు మెరుగు పడతాయి. కవిత జైలుకు వెళ్లినా వెళ్లకపోయినా బీఆర్ఎస్ కు విజయావకాశాలు పెరిగే ఛాన్సు ఉంటుంది. తర్వాతి కాలంలో జాతీయ రాజకీయాలు మలుపు తిరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అప్పుడు మోదీ వర్సెస్ కవిత అని కూడా ప్రచారం చేస్తారేమో ఎవరికి తెలుసు. ఏ పుట్టలో ఏ పాము ఉందో.