కండలు చూసుకుని మురిసిపోతే సరిపోదు అది వాపో బలుపో కూడా తెలుసుకోవాలి. ఏపీలో అద్భుతాలు చేయబోతున్నామని అధికారంలోకి రాబోతున్నామని బీజేపీ నేతలు డప్పాలు కొట్టుకుంటున్నా అంత సీన్లేదని తెలిసిపోతోంది. అన్నం ఉడికిందో లేదో చూట్టానికి మొత్తం గిన్నెని బోర్లించాల్సిన పన్లేదు రెండు మెతుకులు చాలు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక నుంచి మొదలుపెట్టి పరాభవాలు ఎదుర్కుంటూ వచ్చిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికలతో తన భవిష్యత్తేంటో తెలిసిపోయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లకు మించలేదు బీజేపీ బలం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి పోలైన ఓట్లకంటే నోటా ఓట్లే ఎక్కువ. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లనిఓట్లకంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఆ జాతీయపార్టీకి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు మొన్నటిదాకా బీజేపీది. పోయినసారి టీడీపీ మద్దతుతో గెలిచిన మాధవ్ మళ్లీ అభ్యర్థిగా పోటీచేశారు. కాకపోతే ఈసారి పొత్తులేదు జనసేన కూడా మనస్ఫూర్తిగా మద్దతివ్వలేదు. మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి ఐదుశాతం ఓట్లు కూడా పడలేదు.
తూర్పు రాయలసీమలో మరీ దారుణం. చెల్లని ఓట్లు పదిహేడు వేలదాకా ఉంటే అందులో సగం కూడా రాలేదు బీజేపీ అభ్యర్థికి. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోనూ చెల్లని ఓట్లతో పోల్చుకుంటే బీజేపీ అందులో సగమైనా సాధించలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీకి ఎంతో చేశానని చెప్పుకుంది. కానీ ఓటర్లు కమలం పార్టీని దారుణంగా తిరస్కరించారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలాంటి నిర్ణయాలతో ఏపీలో బీజేపీని ప్రజలు లెక్కలోకి కూడా తీసుకోలేదు.
టీడీపీతో పొత్తు ఎప్పుడో చెడింది జనసేనతోనూ బీజేపీ సఖ్యంగా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సాయం తీసుకునుంటే గౌరవప్రదమైన ఓట్లు వచ్చుండేవి. మొత్తం ఓట్లను వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్ పంచేసుకుంటే చివరి వరసలో బీజేపీ నిలిచింది. బీజేపీకి మరో మింగుడుపడని విషయం ఏమిటంటే జనసేన శ్రేణులు కూడా టీడీపీ అభ్యర్థులకు మద్దతివ్వడం. బీజేపీతో అవసరమైతే పొత్తు తెంచేసుకుంటానన్న అధినేత మాటల్ని జనసైనికులు శిరసావహించినట్లే కనిపిస్తోంది. ఈ ఫలితాలతో టీడీపీవైపే జనసేన మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. చివరికి ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఏక్ నిరంజన్‌లా మిగిలిపోతుందేమో