కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వాదన వీగిపోయింది. సీబీఐ కుట్రపూరితంగా విచారణ చేస్తోందని వాంగ్మూలాలు మార్చేస్తోందని అవినాష్ చేసిన ఆరోపణలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో వైఎస్ వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డికి మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి ఎవరినైనా విచారణకు పిలవొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. సీబీఐపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని హైకోర్టు తీర్పునివ్వడం అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు. వివేకా హత్యకేసులో అరెస్ట్ చేయకుండా తాము నిరోధించలేమని హైకోర్టు చెప్పటంతో వైసీపీ ఎంపీ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే.
హైకోర్టు తీర్పుతో వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో వేగం పెరగబోతోంది. అవసరమనుకున్నప్పుడు సీబీఐ పిటిషనర్‌ని విచారణకు పిలవచ్చని హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పిటిషనర్‌ని విచారించేటప్పుడు ఆయనకు కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలంటూనే ఎంక్వయిరీ ప్రక్రియలో జోక్యం చేసుకోవటానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది. వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డిని కీలక అనుమానితుడిగా చూస్తోంది సీబీఐ. ఎంపీతో పాటు ఆయన తండ్రి కూడా నిందితుడని వారిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ చెబుతోంది. కేసులో అరెస్ట్ కాకుండా అవినాష్‌రెడ్డి దర్యాప్తు సంస్థపైనే ఆరోపణలుచేస్తున్నారని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది.
అవినాష్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి తరపున కూడా న్యాయవాదులు వాదన వినిపించారు. వివేకా పీఏ ఫోన్ చేయడానికి ముందే హత్య విషయం అవినాష్‌కు తెలుసని రెండు నిమిషాల వ్యవధిలోనే ఆయన స్పాట్‌కి వచ్చారని సునీతా లాయర్లు వాదించారు. వివేకాది సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతోపాటు ఘటనా స్థలంలో ఆధారాలను అవినాష్‌రెడ్డే చెరిపేశారని తెలిపారు. సునీతారెడ్డితో సీబీఐ కుమ్మక్కైందంటూ అవినాష్‌రెడ్డి లాయర్ వాదించారు. తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఇక చట్టపరమైన రక్షణకు సుప్రీం గడప తొక్కబోతున్నారు అవినాష్‌రెడ్డి. అక్కడ కూడా ప్రతికూల తీర్పు వస్తే ఆయన్ని దేవుడు కూడా కాపాడలేరేమో.