బీజేపీని నడిపించేది RSS – ఈ బంధం ఎప్పుడు ఎలా ప్రారంభమైందో తెలుసా

By KTV Telugu On 18 March, 2023
image

జనసంఘ్ నుంచి బీజేపీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు మాత్రమే అవుతోంది. ఆరెస్సెస్ లేదనిదే బీజేపీ లేదంటారు. ఆరెస్సెస్ ఇప్పటి సంస్థ కాదు. స్వాతంత్య్రం రాక ముందు నుంచీ ఉంది. మరి బీజేపీ ఆరెస్సెస్ ఎప్పటి నుంచి సిద్ధాంతకర్తగా మారింది బీజేపీని నడిపించేది ఆరెస్సెస్ అని ఎందుకంటారు బీజేపీ విజయాల్లో ఆరెస్సెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఎందుకు చెబుుతూంటారో ఇప్పుడు తెలుసుకుందాం..!

బీజేపీ సభ్యులందరూ ఆరెస్సెస్ వారే కానీ ఆరెస్సెస్ సభ్యులు అందరూ బీజేపీ వారు కాదు అని రాజకీయవర్గాలు జోక్ చేస్తూంటాయి. అంటే బీజేపీలో చేరితే ఆరెస్సెస్‌లో చేరినట్లే. కానీ ఆరెస్సెస్‌లో చేరితే బీజేపీలే చేరినట్లు కాదు. ఆ లింక్‌ ను అటు బీజేపీ ఇటు ఆరెస్సెస్ చక్కగా మెయిన్ టెయిన్ చేస్తున్నాయి. బీజేపీలో ఎలాంటి పదవి చేపట్టాలన్నా ఆరెస్సెస్ నాయకత్వం ఆశీస్సులు ఉండాలి. అంతగా బీజేపీతో కలిసిపోయింది ఆరెస్సెస్ కానీ అది అంతర్గతంగానే బహిరంగంగా బీజేపీతో తమకు ఎలాంటి సంబందం లేదని ఆరెస్సెస్ చెబుతూ ఉంటుంది. ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌కు సంక్షిప్త రూపమైన ఈ పేరు దాదాపు వందేండ్లుగా దేశ ప్రజలకు సుపరిచితం. ఖాకీ నిక్కర్‌, చేతిలో కర్ర, రోజూ శాఖ, కాషాయ ధ్వజం, ప్రత్యేక గీతం తదితర అనేక ప్రత్యేకతలతో ఏర్పాటైన ఆరెస్సెస్‌ అంటే హిందువుల్లోని ఒక వర్గానికి ప్రత్యేక అభిమానం. స్వయం సేవకులు హిందూ మతం కోసం పాటుపడతారని దేశభక్తితో మెలగుతారని సేవాభావంతో వ్యవహరిస్తారని నీతి నిజాయితీ కలిగి ఉంటారని ఇక వారి క్రమశిక్షణ అంకితభావం తటస్థులను ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది.

ఆరెస్సెస్‌ ఎంతగా ఆకర్షణ కలిగించేదో అంతగా వివాదాల్లోనూ ఉండేది. మొట్టమొదటిసారిగా అది ఎదుర్కొన్న పెద్ద సవాలు మహాత్మా గాంధీ హత్య. గాడ్సే ఆరెస్సెస్ సభ్యుడు ఆరెస్సెస్ నేతల ప్రసంగాలు మతోన్మాద గరళంతో నిండి ఉన్నాయనీ దాని పర్యవసానంగా అమూల్యమైన మహాత్ముడి జీవితం బలైందని అంటూ ఆరెస్సెస్‌ను నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నిషేధించారు. దీంతో పటేల్‌ను ఆరెస్సెస్‌ అధినేత గోల్వాల్కర్‌ కలసి నిషేధం ఎత్తివేతకు చాలా ప్రయత్నాలు చేశారు. భారత్‌ను లౌకికరాజ్యంగా అంగీకరిస్తామని జాతీ య పతాకాన్ని ఆమోదిస్తామని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ఆరెస్సెస్‌ అప్పు డు హామీ ఇచ్చింది. దీంతో రహస్య విధానాలు లేకుండా ప్రజాస్వామిక సాంస్కృతిక సంస్థగా పనిచేయడానికి ఆరెస్సెస్‌ను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలా సెకండ్‌ లైఫ్‌ పొందిన ఆరెస్సెస్‌ అనేక అనుబంధ విభాగాలను ఏర్పాటుచేసుకొని కార్యక్రమాలు మొదలుపెట్టింది.

ఆరెస్సెస్‌ ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళలేదు వీహెచ్‌పీ భారతీయ కిసాన్‌ సంఘ్‌ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ వంటి దాదాపు 20 అనుబంధ సంఘాల ద్వారా దేశమంతా విస్తరించింది. రాజకీయంగా కూడా బలం ఉండాలని తమపై నిషేధం ఇతర అంశాల తర్వాత అరెస్సెస్ అగ్రనాయకత్వం ఓ అంచనాకు వచ్చింది. హిందూత్వ అంశాలపై దూకుడుగా ఉండే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన జనసంఘ్‌కు ఆరెస్సెస్ అనుబంధం పెరిగింది. జన సంఘ్‌ 1970 దశకంలో జనతా పార్టీలో విలీనమైంది. జనతా పార్టీలో ఉంటూ ఆరెస్సెస్‌తో సంబంధాలు కలిగి ఉండకూడదనే ఒత్తిడి వచ్చినప్పుడు జనసంఘ్‌ సభ్యులు బయటకువచ్చి బీజేపీగా ఏర్పడ్డారు. అప్పట్నుంచి పైకి బీజేపీ లోపల ఆరెస్సెస్ అన్నట్లుగా బంధం పెన వేసుకుపోయింది. ఆరెస్సెస్‌ ఏ అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేసినా అది దాని సిద్ధాంతాలను తుచ తప్పకుండా పాటించాల్సిందే. ఆరెస్సెస్‌ తాను ఏర్పాటుచేసిన ఇతర అనుబంధ సంఘాల్లో నాయకులను తయారు చేసి వారిని బీజేపీలోకి పంపుతుంది.

బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ. ఈ విభాగాన్ని నేరుగా నియంత్రించేది ఆరెస్సెస్. బీజేపీకి నేరుగా సంబంధం ఉండదు. ఇలాంటి సంఘాల ద్వారా బీజేపీకి సుశిక్షితులైన నాయకులు అందివచ్చేవారు ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రి మంత్రుల దాకా ఎవరూ ఆరెస్సెస్‌ మాటను దాటే సాహసం చేసేవారు కాదు. ఒక రాజకీయపార్టీగా బీజేపీ నేతల ధీమా అంతా ఆరెస్సెస్‌ మీదే. అద్వానీ రథయాత్ర విజయవంతమైందన్నా కరసేవ సాగిందన్నా బీజేపీ విస్తరించిందన్నా ఎన్నికల్లో గెలిచిందన్నా ఆరెస్సెస్‌ చలువే. బీజేపీ నాయకులు ఏ పదవులు చేపట్టినా ఆరెస్సెస్‌కు విధేయంగా ఉంటారు ఆరెస్సెస్‌ గీసిన గీత దాటరు. బీజేపీ ఆంతరంగిక వైరుధ్యాలను కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వారే సమన్వయం చేస్తారు. నాయకుల మధ్య విభేదాలకు పరిష్కారం ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం అయిన నాగ్‌పూర్‌లో లభించేది. ఇలా ఒకప్పుడు ఆరెస్సెస్‌, బీజేపీ అంటే తల్లీబిడ్డల పేగుబంధం అనుకోవచ్చు.

బీజేపీ ఓ రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అన్న తర్వాత విజయమే లక్ష్యంగా పోరాటం చేస్తారు. రెండు సీట్లు నుంచి తిరుగులేని స్థానంలోకి వచ్చారు. ఇలా రావడానికి ఆరెస్సెస్ క్రేత్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఎక్కడ వీక్ గా ఉంటే అక్కడ ఆరెస్సెస్ కార్యకలాపాలను పెంచుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్‌నే. అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఆరెస్సెస్ చాలా ఏళ్లుగా పాగా వేసింది. టీ తోట కార్మికుల్లో మంచి ప్రాబల్యం సంపాదించుకుంది. అందుకే విజయాలు లభించాయి. బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఆర్ఎస్ఎస్ విస్తరణ. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుస్తోందంటే దశాబ్దాల ఆర్ఎస్ఎస్ కృషి ఉంది. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ఆర్ఎస్ఎస్‌నే కారణం. ఈ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దాదాపు 80లక్షల మంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖల్లో సభ్యులుగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు కోసం నాలుగున్నర లక్షల పల్లెలకు స్వయంసేవకులు వెళ్తారు. అక్కడ ఎన్నికల కోసం పనిచేస్తారు. ఈ పల్లెల్లో అనేక కుటుంబాలతో పరిచయాలు పెంచుకుంటారు ఈ కుటుంబాలతో స్వయంసేవకులు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండి బీజేపీ కి అనుకూలంగా ప్రచారం చేస్తారు. చడీచప్పుడు లేకుండా బీజేపీకి అనుకూలంగా జరిగే ఈ ప్రచార ఉద్యమంలో దాదాపు పది లక్షల మంది ఆరెస్సెస్ వాలంటీర్లు దేశంలోని అన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అందుకే ఆరెస్సెస్ లేని బీజేపీకి విజయాలు దక్కని చెబుతారు.

వాజ్ పేయి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆరెస్సెస్, బీజేపీ మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ప్రధాని మోడీ సాక్షాత్తూ ఆరెస్సెస్ ప్రచారక్ గా పనిచేసిన నాయకుడు. పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న అమిత్ షా గతంలో విద్యార్థి సంఘమైన ఏబీవీపీలో పనిచేశారు. వీరిద్దరికీ ఆరెస్సెస్ ఇంపార్టెన్స్ ఏంటో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరెస్సెస్ ఐడియాలజీకి అనుగుణంగానే ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆరెస్సెస్ నాయకత్వం కూడా ఈ విషయాన్ని కాదనడం లేదు. ఆరెస్సెస్ తరపున బీజేపీలో వ్యవహారాల్ని చక్క బెట్టడానికి కొంత మంది నేతల్ని పంపుతూ ఉంటారు. ఇటీవల రామ్ మాధవ్, మురళీధర్ రావు లాంటి వాళ్లు అలాగే బీజేపీకి వెళ్లారు. ఇప్పుడు బీఎల్ సంతోష్ బీజేపీకి అరెస్సెస్ తరపున అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న బీఎల్ సంతోష్ ఆరెస్సెస్ సీనియర్ లీడర్. 1993 నుంచి ఫుల్ టైమ్ వర్కర్ గా పనిచేస్తున్నారు. గతంలో బీజేపీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) గా కర్ణాటకలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేశారన్న పేరు తెచ్చుకున్నారు.

బీజేపీ జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) పదవిలో దక్షిణాది రాష్ట్రాల ఇన్ చార్జ్ గా కొనసాగారు. సౌత్ లో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో ఘటికుడిగా ఆయనకు పేరుంది. వ్యూహకర్తగా పార్టీ ఇన్నర్ సర్కిల్స్ లో ఆయన పేరు తెచ్చుకున్నారు. చెప్పాల్సింది నిర్మొహమాటంగా ముక్కుసూటిగా చెప్పే మనిషి. ఎన్నికల్లో లాభాల కోసం ఆరెస్సెస్ ఐడియాలజీ విషయంలో రాజీపడే మనస్తత్వం కాదు. ఎవర్నైనా విమర్శించడానికి వెనుకాడని కరడుగట్టిన ఆరెస్సెస్ వాది. సంతోష్ లో మరో ప్లస్ పాయింట్ ఉంది. ఐదు భాషల్లో మాట్లాడగలడు దీంతో బీజేపీ ప్రెసిడెంట్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టులో పార్టీ ఆయనను నియమించింది. కానీ ప్రెసిడెంట్ కన్నా ఆయనకే ఎక్కువ పవర్ ఉంటుంది దానికి కారణం ఆరెస్సెస్. బీజేపీ ఆరెస్సెస్ మధ్య సంబంధాలు ఎప్పట్లాగే ఉన్నాయా. మోదీ వచ్చాక పరిస్థితులు మారాయని జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత.