కాంగ్రెస్ పార్టీ లో ఎన్ని గ్రూప్‌లు ఉన్నా వారందరిని ప్రోత్సహించి అందరికి అవకాశాలు ఇస్తుంది ఆ పార్టీ హైకమాండ్. ఎందుకంటే ఒక్క నేత ఎదిగితే ఏమవుతుందో ఆ పార్టీ పెద్దలకు బాగా తెలుసు. శరద్ పవార్ మమతా బెనర్జీ వంటి వారు చేసినవి గుర్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రోత్సహించి అదే పరిస్థితి తెచ్చుకున్నారు. అప్పట్లో వైఎస్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే వైఎస్‌ఆర్‌లా పరిస్థితి మారిపోయింది. దీంతో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మెజార్టీగా పార్టీ నాయకులు వైఎస్‌ఆర్ తనయుడు వైసీపీ నేత జగన్ వైపు వెళ్లిపోవడంతో అక్కడ పార్టీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి రాకుండా పార్టీకి మేలు జరిగేలా రేవంత్ తో పాటు భట్టి యాత్రలకు హైకమాండ్ ప్రోత్సాహం ఇస్తోంది.
ఒక వ్యక్తితో యాత్ర చేయడం వల్ల పార్టీకి కాకుండా ఆయనకే మైలేజ్ వస్తుందని అందుకు మరో సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రేవంత్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా సీఎల్పీ నేత భట్టిని అధిష్టానమే రంగంలోకి దింపిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు చేస్తున్న యాత్రలతో వస్తున్న మైలేజీ పార్టీ ఖాతాలో పడే విధంగా అధిష్టానం జగ్రత్త పడుతోందన్న చర్చ జరుగుతోంది. హాత్ సే హాతో జోడో అభియాన్ యాత్రలో భాగంగా యాత్ర ఫర్ చేంజ్ పేరుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గత నెల నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరో వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పీపుల్స్ మార్చ్ పేరుతో అదిబాలాబాద్ జిల్లా భోథ్ నియోజకవర్గం పిప్పిరిలో గురువారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి అదిలాబాద్ టూ హైదరాబాద్ చేపట్టిన పాదయాత్రను మాత్రం మూడు రోజుల వ్యవధిలోనే నిలిపివేశారు. ఆయన చేయలేరన్న కారణంగానే ఆపేసినట్లుగా తెలుస్తోంది.
భవిష్యత్తులోనూ ఎవరు యాత్రలు చేసినా వారు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరగడానికి కాకుండా పార్టీకే మైలేజ్ వచ్చే విధంగా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకు ఈ ఇద్దరు నాయకుల యాత్రలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పలు సూచనలు చేస్తూ ముందుండి నడిపిస్తున్నారు. అవసరమైతే పార్టీ సీనియర్లు కూడా తమ తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ఎవరికి వారుగా యాత్రలు చేయాలని కూడా మాణిక్‌రావు ఠాక్రే సూచించారు. దీంతో కొందరు నాయకులు అక్కడక్కడా అడపాదడపా యాత్రలు కొనసాగిస్తున్నారు. రేవంత్‌రెడ్డి యాత్రకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దామోదర రాజనరసింహ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మరి కొందరు సీనియర్లు దూరంగానే ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కూడా దాదాపు 40అసెంబ్లి నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్ వరంగల్ నల్లగొండ రంగారెడ్డి మహబూబ్‌నగర్ ఖమ్మం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. అందుకు పార్టీ శ్రేణులందరు హాజరై పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులందరికి అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో భట్టి యాత్రకు ఏఐసీసీ నాయకులు ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు హాజరుకావడంతో పాటు సభలు విజయవంతమయ్యేలా చూస్తున్నారు.
హైకమాండ్ కూడా ఇతర నేతల్ని ప్రోత్సహిస్తూండటంతో రేవంత్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి తానే సీఎం అభ్యర్థినని పాదయాత్రలో మీడియా ప్రతినిధులతో పరోక్షంగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తానే సీఎం అభ్యర్థి అన్న విషయలంలో క్లారిటీగా ఉన్నానని చెబుతున్నారు. తాను పొలిటికల్ ఎంట్రీ నుంచి క్లారిటీగా ఉన్నానని అందుకే ఎమ్మెల్యే అయ్యాను అప్పుడు క్లారిటీగా ఉన్నాను ఆ తర్వాత ఎంపీ అయ్యాను. టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాను ఇప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉన్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. అంటే సీఎం అవుతాననే దానిపైన తాను క్లారిగా ఉన్నాను అనే దాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అని తననే కేంద్రంగా చేసుకుని అడుగుతున్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత రాజకీయంలో హైకమాండ్ పాత్ర కూడా కీలకంగా మారింది. ఒకే నాయకుడ్ని ప్రోత్సహించడం కన్నా మరికొంత మందిని పోటీగా బలోపేతం చేయడం ద్వారా వారితో పని చేయించుకోవడం పార్టీని బలోపేతం చేసుకోవడం అనే రెండు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.