ఎన్నో ఆశలు పెట్టుకున్న లోకేష్ పాదయాత్ర

By KTV Telugu On 18 March, 2023
image

ఎన్నో అంచనాలు పెట్టుకున్న నారా లోకేష్ పాదయాత్ర అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో టిడిపి నేతల్లో కలవరం పెరుగుతోంది. లోకేష్ యాత్ర విజయవంతం కాకపోవడానికి జిల్లాల్లో పార్టీ నేతలు మనస్ఫూర్తిగా సహకరించకపోవడమే కారణమని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నారట. యాత్రకు జనాన్ని తరలించాలన్న మౌలిక అంశాన్ని కూడా నేతలెవరూ పట్టించుకోకపోవడంపై ఆయన మండి పడుతున్నారని సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సరిగ్గా పట్టించుకోవడం లేదని భావిస్తోన్న చంద్రబాబు నాయుడు తానే స్వయంగా రోజూ పార్టీ నేతలకు ఫోన్లు చేసి మానిటర్ చేస్తున్నారని భోగట్టా.

2024 ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేయడంలో భాగంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27న ఆర్భాటంగా పాదయాత్ర మొదలు పెట్టారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుండే యాత్ర ఆరంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి కీలక నేతలంతా తరలి వచ్చారు. చంద్రబాబు నాయుడి సొంత జిల్లా కావడంతో యాత్ర ఆరంభం అదుర్స్ అనిపించింది.

అంతే ఇక ఆ తర్వాత నుండి యాత్ర రోజు రోజుకీ వెల వెల బోవడం మొదలైంది. యాత్రకు అనుకున్న స్థాయిలో జనం రావడం లేదు. నిజానికి యాత్రకు స్థానిక నేతలు జనాన్ని తరలించాలని ముందస్తుగానే నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏ నియోజకవర్గంలో యాత్ర జరుగుతూ ఉంటే ఆ నియోజకవర్గం స్థాయి నేతలదే జనాన్ని తరలించే బాధ్యత. అయితే ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో సాయంత్రం వరకు జనం లేకపోవడంతో యాత్ర ప్రారంభించనే లేదు లోకేష్. రోజంతా క్యారవాన్ కే పరిమితం అయ్యారు. పార్టీ నేతలు ఉద్దేశ పూర్వకంగానే సబోటేజ్ చేస్తున్నారని మండిపడ్డ లోకేష్ యాత్రకు నేతలెవరూ జనాన్ని తీసుకురావడం లేదని అందుకే ఈ రోజు యాత్ర మొదలు పెట్టనే లేదని తండ్రికి ఫోన్ చేసి ఫిర్యాదుచేశారు. దాంతో చంద్రబాబుకు బాగా మండుకొచ్చింది. జిల్లా నేతలతో పాటు ఏపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుణ్ని కూడా ఫోనులోనే కడిగి పారేశారట చంద్రబాబు.

చంద్రబాబు మరీ డోసు పెంచడంతో ఠారెత్తిపోయిన అచ్చెంనాయుడు జిల్లా నేతలకు ఫోను చేసి లోకేష్ యాత్రకు జనాన్ని తరలించకపోతే ఎలాగ అని ఆరా తీశారట. చంద్రబాబు నాయుడు బాగా ఫీల్ అవుతున్నారని కూడా అచ్చెంనాయుడు చెప్పేటప్పటికి లేదు సార్ రేపట్నుంచి చూసుకోండి జనం అదిరిపోతారు యాత్ర సూపర్ హిట్ అవుతుంది అని గంగాధర నెల్లూరు నేత భరోసా ఇచ్చారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల పాటు ఓ మోస్తరు జనం వచ్చారట ఆ తర్వాత మళ్లీ కథ మామూలే. ఇప్పటికే 45 రోజుల యాత్ర ముగిసింది. ఇన్ని రోజులైపోయిందా యాత్ర మొదలై అని జనం ఆశ్చర్యపోయే పరిస్థితి ఎందుకంటే లోకేష్ యాత్రను టిడిపికి అనుకూలంగా ఉండే మీడియాలోనూ చూపించడం లేదు. జనం లేకపోవడంతో యాత్రను చూపిస్తే యాత్ర ఫ్లాప్ షో అని ప్రచారం జరుగుతుందన్న భయానికి లోకేష్ యాత్రను పక్కన పెట్టేశారు.

అచ్చెంనాయుడు సీరియస్ గా ప్రయత్నించడం లేదని భావిస్తోన్న చంద్రబాబు నాయుడు తానే రోజూ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూ లోకేష్ యాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కావల్సిందేనని చెప్పుకొస్తున్నారట. లోకేష్ యాత్ర విజయవంతానికి పాటు పడ్డ నేతలకు భవిష్యత్ లో పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కూడా చెబుతున్నారట. పైకి హడావిడి చేస్తూ యాత్రకు దూరంగా ఉంటోన్న నేతల వివరాలనూ చంద్రబాబు నోట్ చేస్తున్నారని సమాచారం. అత్యుత్సాహం చూపే నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో చెక్ చెప్పాలని చంద్రబాబు కసిగా ఉన్నారని అంటున్నారు.

లోకేష్ పాదయాత్ర మరీ ఇంత వెల వెల బోతుందని చంద్రబాబు నాయుడు అస్సలు ఊహించలేదు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడి యాత్ర కూడా సూపర్ హిట్ అయ్యింది. అదే స్థాయిలో లోకేష్ యాత్ర హిట్ చేయాలని పాపం చంద్రబాబు నాయుడు శక్తి యుక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ నేతలను సమాయత్తం చేసి ముందుకు కదుపుతున్నారు. అయినా లాభం లేకపోవడం చంద్రబాబును అసహనంలోకి నెట్టేస్తోంది. తన యాత్ర అంతలా కాకపోయినా అందులో సగం స్థాయిలో నడిచినా ఫర్వాలేదని ఆయన అనుకుంటున్నారు కానీ అది కూడా సాధ్యం కాకపోయే సరికి ఆయన కలత చెందుతోన్నట్లు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితమే టిడిపిలో చేరిన మాజీ కాంగ్రెస్ మంత్రి బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు కూడా చంద్రబాబే ఫోన్ చేసి వీలైనంత ఎక్కువ మంది జనాన్ని తరలించి లోకేష్ యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారట. అయితే కన్నా లక్ష్మీనారాయణ తన కారులో వెళ్లి యాత్రలో లోకేష్ తో పాటు కొంత దూరం నడిచి మమ అనిపించేశారట. ఆ వెంటనే తన కారెక్కి వెళ్లిపోయారట. కన్నా లక్ష్మీనారాయణ ఎంతమందిని తరలించారని ఆరా తీసిన చంద్రబాబు నాయుడికి అసలు విషయం తెలిసి కారాలూ మిరియాలూ నూరారట. కన్నాకు ఫోన్ చేసి ఇలా చేస్తే ఎలా కన్నా అని క్లాస్ కూడా పీకారని సమాచారం. ఇక ఆ తర్వాత నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తోన్న చంద్రబాబు నాయుడు ఎవరు వెళ్లినా ఒక్క కారులో వెళ్లద్దని కనీసం పది కార్లలో వెళ్లాలని వందమందికి తగ్గకుండా మనుషులను వెంటబెట్టుకుని హడావిడి చేయాలని ఆదేశించారట.

నారా లోకేష్ పాదయాత్ర సూపర హిట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్రను చంద్రబాబే తాత్కాలికంగా ఆపించారని టిడిపిలో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెడితే రాష్ట్రంలోని ప్రజలతో పాటు మీడియా దృష్టి కూడా పవన్ పైనే ఉంటుందని అపుడు లోకేష్ యాత్ర అనాథ అయిపోతుందని చంద్రబాబు భయపడ్డారు. అందుకే లోకేష్ యాత్ర జనంలో రిజిస్టర్ అయ్యే వరకు వారాహి యాత్ర ఆపాల్సిందిగా పవన్ ను కోరారట. టిడిపితో పొత్తుకు సిద్ధమైన పవన్ కూడా చంద్రబాబు నాయుడు అంతటి నేత అడిగే సరికి కాదనలేకపోయారని అంటున్నారు. లేదంటే వారాహి యాత్ర కూడా జనవరిలోనే మొదలు కావలసి ఉంది. ఆ నెలలోనే అటు తెలంగాణాలోనూ ఇటు ఏపీలోనూ కూడా వారాహివాహనానికి పూజలు చేయించి యాత్రకు రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. పవన్ యాత్ర కోసం జనసైనికులు కూడా ఉత్సాహంతో పాటు ఆసక్తిగా ఎదురు చూశారు.

పవన్ ఎంతకీ యాత్ర మొదలు పెట్టకపోయేసరికి ఏమైందా అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇదే ప్రశ్నను జనసేనలో నంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ ను జనసైనికులు ప్రశ్నించగా అసలు విషయం బయట పడిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాతనే వారాహి యాత్ర మొదలవుతుందని భావిస్తున్నారు. మొత్తం 400 రోజుల పాటు యాత్ర చేయాలని లోకేష్ తలపెట్టారు. ఈ ప్రస్థానంలో 4000 కిలోమీటర్లు యాత్ర సాగాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పటికి 46 రోజుల యాత్ర ముగిసింది. అంటే ఇంకా ఏడాది పాటు లోకేష్ యాత్ర సాగాల్సి ఉంది. మరి అన్ని రోజులు అనుకున్న విధంగానే యాత్ర చేస్తారా లేక అనుకున్న స్పందన లేదు కాబట్టి ఏదో ఒక కారణం చూపి యాత్రను అర్ధంతరంగా ఆపేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ లోకేష్ యాత్ర అలా హఠాత్తుగా ఆపేస్తే ఆ మర్నాటి నుండే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉంటాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు.