రాహుల్ గాంధీకి జాతక చక్రం వేయించాలి

By KTV Telugu On 18 March, 2023
image

అదృష్టమో దురదృష్టమో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండిపోయింది. అదృష్టమో దురదృష్టమో కానీ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగలేకపోయారు. అదృష్టమో దురదృష్టమో కానీ కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో కునారిల్లుతోంది. ఇపుడేం చేయాలి కాంగ్రెస్ పార్టీ జాతకం ఎలా ఉందో తేల్చడానికి ఎవరైనా జ్యోతిష్కుని తో జాతక చక్రం వేయించాలి. లేకపోతే అదృష్టం రాజకీయ ప్రత్యర్ధులకు దురదృష్టం కాంగ్రెస్ పార్టీకి శాస్వతంగా మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ జ్యోతిష్కులు.

మనం అనుకుంటాం కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. కొన్ని అయితే వద్దన్నా ఆగవు. ఇపుడిలాంటి సమస్యే కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని పట్టి పీడించుకుని నమిలి తినేస్తోంది. ఎన్ని బాధలనీ పడతాడు పాపం రాహుల్ ఏ మాట అన్నా పెడార్ధాలు తీసేస్తున్నారు. ఇండియాలో అంతా ఇంతే అని లండన్ వెళ్లి అక్కడ మాట్లాడినా ఊరుకోవట్లేదు. రాజకీయాలు మరీ ఇంత కర్కశంగా ఉంటాయని రాహుల్ అనుకోనే లేదు పాపం. మొన్నా మధ్య ఇంగ్లాండ్ వెళ్లిన రాహుల్ గాంధీ ఏమన్నారని మా దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని బాధ పడ్డారు. నెహ్రూ వారసుడికి ఆ మాత్రం మాట అనే స్వేచ్ఛ కూడా లేదా ఆయన అక్కడే ఉండి ఇంకా ఏమనాలనుకున్నారో కానీ ఇక్కడ బిజెపి నేతలు ఒక్కసారిగా రాహుల్ పై విరుచుకు పడిపోయారు. పరాయి దేశం వెళ్లి మన దేశం పరువు తీసేస్తారా ఏమనుకుంటున్నారసలు రాహుల్ గాంధీ అని మంత్రులు మండి పడ్డారు. అర్జంట్ గా రిటర్న్ ఫ్లైట్ లో ఇండియా వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అని కూడా అన్నారు.

ఈ మాటలే రాహుల్ గాంధీని చాలా బాధించాయి. ఇలా మాటలు ఎందుకు పడాల్సి వచ్చిందని ఆయన ఆలోచించారు. బాగా ఆలోచించగా ఆలోచించగా తాను ప్రతిపక్ష నేతగా ఏదో ఒక వ్యాఖ్య చేయడం వల్లనే కదా అధికారంలో ఉన్న బిజెపి నేతలు ఇలా మీద పడుతున్నారు అని అనిపించింది. అసలు ప్రతిపక్ష నేతగా ఎందుకు ఉండాల్సి వచ్చిందా అని ఆలోచించారు. ఆలోచించగా ఆలోచించగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్లనే కదా ప్రతిపక్ష నేతగా ఉండాల్సి వచ్చింది అనుకున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టే కదా తాను ఎంపీగా ఉండాల్సి వచ్చింది అని తెలుసుకున్నారు. మొత్తం వ్యవస్థలపై చికాకు వచ్చింది. సరిగ్గా ఆ చికాకులో ఉన్నప్పుడే మీడియా ముందుకు రావల్సి వచ్చింది. ఏదో మాట్లాడదాం అనుకున్న రాహుల్ గాంధీ కి తాను ఎంపీ కాకపోయి ఉంటే ప్రశాంతంగా ఉండేవాడిని కదా అని లోలోన అనుకుందామనుకున్నారు. అది కాస్తా మనసులో ఆగలేదు. పైకి తన్నుకొచ్చింది అది నోట్లోంచి బయటకు వచ్చేసింది. దురదృష్ట వశాత్తూ నేను ఎంపీ అయ్యాను అని రాహుల్ గాంధీ అనేశారు.

దాంతో మీడియా వాళ్లు అవాక్కవుదామని అనుకుంటోన్నంతలోనే బిజెపి వాళ్లు రాహుల్ అన్న ఆ వ్యాఖ్యను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. మీడియా వాళ్లు ప్రశ్న వేయకుండానే రాహుల్ గాంధీని కాపాడుకోవాలని జైరాంరమేష్ రాహుల్ చెవి గట్టిగా పట్టుకుని అయ్యా మీరు తప్పులో కాలేశారు అని చెప్పారు. రాహుల్ తెలివైన వారు కాబట్టి బిజెపి వాళ్ల దురదృష్టం కొద్దీ నేను ఎంపీగా ఉన్నానని తన తప్పును కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అది అప్పటికే యావద్దేశం మూడు రౌండ్లు చుట్టి వచ్చేసిందిన రాహుల్ గాంధీకి తెలీదు. ఇంగ్లాండ్ లో వ్యాఖ్యలతోనే తన ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యిందని బాధపడుతోంటే ఇపుడింకోటా అని రాహుల్ తల బాదుకుంటున్నారు. రాహుల్ చెప్పినట్లు దురదృష్టం కొద్దీ ఆయన మీడియా ముందుకు వచ్చారు. దురదృష్టం కొద్దీ మనసులో ఉన్న మాటను కంట్రోల్ చేసుకోలేక పైకి అనేవారు. రాహుల్ దురదృష్టం కొద్దీ దాన్ని మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో బిజెపి మంత్రులు క్యాచ్ పట్టేశారు. అంతే ఇక దురదృష్టం తప్ప ఏమీ మిగల్లేదు. ఈ వ్యవస్థలు మారితేనే కానీ అదృష్టం తనని వచ్చి వరించదని రాహుల్ మనసులో అనుకుంటున్నారు.