తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెడుతోంది. అబ్బే ఏమీ జరగలేదంటూనే జరిగిన జరగాల్సిన పరీక్షల్ని రద్దుచేస్తోంది ప్రభుత్వం. లక్షలమంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంలేదు. కేటీఆర్ నియోజకవర్గంలో ఓ విద్యార్థి ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాలామంది విద్యార్థులు భావోద్వేగంతో ఉన్నారు. భవిష్యత్తుపై ఆందోళన పడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చిన్నస్థాయి ఉద్యోగులు అలవోకంగా పేపర్లు లీక్ చేశారంటే ఎవరికీ నమ్మబుద్ధి కావటంలేదు. పెద్దస్థాయిలో సహాయసహకారాలు లేకుండా పేపర్ల లీకేజీ సాధ్యమా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇదే సమయంలో కేటీఆర్ టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ హస్తం ఉందన్నది రేవంత్ ఆరోపణ. కేటీఆర్ పీఏ తిరుపతి స్వగ్రామమైన మల్యాల మండలంలో గ్రూప్ వన్ పరీక్షలో వందమందికి వందేసి మార్కులు రావడం లీకేజీ ప్రభావమేనంటున్నారు రేవంత్. లీకేజీకి రోజుకో కారణం చెబుతోంది ప్రభుత్వం. మొదట హనీట్రాప్ అనీ తర్వాత సిస్టమ్ హ్యాకింగ్ జరిగిందనీ చెప్పింది. కేటీఆర్ మరో అడుగు ముందుకేసి ఇందులో కుట్రకోణం ఉందంటున్నారు. లీకేజీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరిలో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అనేది కేటీఆర్ విచిత్ర వాదన. మరోపార్టీ వ్యక్తి ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోకి జొరబడి కీలకమైన పత్రాలు చేజిక్కించుకునేంత బలహీనంగా వ్యవస్థ ఉంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదా ఈ పాయింట్‌నే ప్రశ్నిస్తూ కేటీఆర్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ లీకేజీలు సాధారణమైపోయాయి. 2015లో సింగరేణి ఉద్యోగాల పేపర్ లీక్ అయింది. ఆ విషయంలో కవితపైనా ఆరోపణలొచ్చాయి. 2016లో ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ కావటంతో అభ్యర్థులు మూడుసార్లు పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప పాలన పట్టటం లేదన్న దుమారం రేగుతోంది. స్వయానా తనపైనే రేవంత్ గురిపెట్టినా కేటీఆర్ దీటుగా స్పందించలేదు. నిరూపిస్తే రాజీనామా చేస్తాననొచ్చు రాజకీయాలనుంచి తప్పుకుంటాననొచ్చు అయినా కేటీఆర్ నోరెత్తలేదంటే ఆయనకే అనుమానాలు ఉండుండాలి. ఎలా ప్రతిస్పందించినా ఆధారాలతోనో కొత్త ఆరోపణలతోనో విరుచుకుపడతారన్న భయంతో కాబోలు తన సహజవైఖరికి భిన్నంగా కేటీఆర్ మౌనం వహించడం తప్పును అంగీకరించడమే అవుతుంది.