ఖమ్మం బీఆర్ఎస్ లో లుకలుకలు

By KTV Telugu On 20 March, 2023
image

ఖమ్మం జిల్లా రాజకీయాలు టాప్ గేర్ మీదున్నాయి. పార్టీల మధ్య సంఘర్షణ ఒక వంతయితే పార్టీల్లో అంతర్గత కుమ్ములాట మరో వంతుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం గుమ్మంలో పాగా వేసేందుకే చేసే రాజకీయాలు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి.

బీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత పార్టీపై తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఖమ్మం రాజకీయాలు తెలంగాణలో ఫోకస్ గా మారాయి. ఖమ్మం నేతలు డైరెక్టుగా శ్రీనివాసరెడ్డిని ఏమీ అనలేక తాము ఏమీ చేయలేక మథనపడుతున్నారు. గత ఎన్నికలే ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్క స్థానం మాత్రమే గెలిచామన్న ఆందోళన అదే ప్రశ్నపై అధిష్టానం నిలదీస్తే ఏం చేయాలో తెలియని ఆవేదన వారిలో నెలకొంది. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే పార్టీని బలోపేతం చేశారన్న వాస్తవం వారిని ఇబ్బంది పెడుతోంది. సొంత ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటున్న పొంగులేటి జనాన్ని పోగేసుకుని పెద్ద స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. పైగా పొంగులేటి సొంతంగా అభ్యర్థులను ప్రకటించడం కేడర్ ను తనవైపు తిప్పుకోవడం లాంటి చర్యల ద్వారా బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతానికి కూల్ గా జరిగిపోతున్నా ఎన్నికల నాటికి పొంగులేటి తమను సవాలు చేసే అవకాశం ఉంది. అలాగని ఏకు మేకై కూర్చునే లోపే దెబ్బకొట్టే అవకాశం కూడా కనిపించడం లేదని స్థానిక నేతలు వాపోతున్నారు.

బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరపున నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఖమ్మం లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు జిల్లా నేతలపై విరుచుకుపడుతున్నారు. నేరుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరును ప్రస్తావించకపోయినా ఆయన తనను దూరం పెడుతున్నారనేట్లుగా కామెంట్ చేస్తున్నారు. తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని అంటూ అందుకు కారణమేంటని ఆయన ప్రశ్నించారు. తనకు జిల్లా నేతలకు మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. పార్టీ కార్యక్రమాలకు గానీ అభివృద్ధి కార్యక్రమాలకు గానీ తనను ఎందుకు పిలవడం లేదని ఆయన నిలదీశారు. అందరం కలిసి పనిచేస్తూ కేసీఆర్ ను మూడో సారి సీఎం చేద్దామని నామా పిలుపునిచ్చారు. నామా తాజా వ్యాఖ్యలు ఖమ్మం పార్టీలో అంతర్గత విభేదాలకు దర్పణం పట్టిందనే చెప్పాలి. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ ఏకపక్ష ధోరణిలో పోతున్నారని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. అదే మాట ఇప్పుడు నామా పరోక్షంగా చెప్పారని అంటున్నారు. పొంగులేటికి అజయ్ కుమార్ కు మద్య విభేదాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అజయ్ కుమార్ అనాలోచిత నిర్ణయాలు కూడా ఖమ్మం ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

టీడీపీ నుంచి వచ్చిన నేతలకు మొదటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్న నేతలకు పొసగడం లేదు అక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల పంచాయతీ ఖాయమన్న వార్తల నడుమ ఇరు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అందులో కొందరు పొంగులేటి వెంట నడిచేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర అంగబలం అర్థబలానికి కొదువ లేదని చెబుతున్నారు. పొంగులేటి పక్కన ఉంటే ఇబ్బంది లేకుండా గడిచిపోతుందని వాళ్లు అనుకుంటున్నారు. దానితో ఇప్పుడు ఖమ్మం బీఆర్ఎస్లో అసమ్మతి రాజకీయాలు కొనసాగుతున్నారు.

వామపక్షాలతో స్నేహం కూడా ఇప్పుడు ఖమ్మం బీఆర్ఎస్ లో ఇబ్బందులకు కారణమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వామపక్షలు మద్దతిచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్య బంధం బలపడింది.ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. దీనితో ఈ సారి వామపక్షాలు తమకు 15 స్థానాలు కేటాయించాలని కేసీఆర్ ముందు ప్రతిపాదన పెట్టాయి. అందులో నాలుగైదు స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్మూనిస్టు కోటగా ఉండేది. ఇప్పుడు కూాడా ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు ఓట్ల శాతం ఎక్కువగానే ఉంది. వామపక్షాలు ఎక్కువ సీట్లు అడిగాయని తెలియడంతో ఖమ్మం బీఆర్ఎస్ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. తమకు సీటు ఖాయమంటూ ఇప్పటికే పనిచేసుకుపోతున్న బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. కేసీఆర్ కూడా వారిలో అసంతృప్తిని పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనితో సర్దుకుపోవడం కష్టంగా ఉందని ఖమ్మం బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కవితపై కేసు సహా అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ అధిష్టానానికి ఖమ్మంపై దృష్టిపెట్టే అవకాశం దొరకడం లేదు.