ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు మారిపోతాయా

By KTV Telugu On 20 March, 2023
image

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ఏపీలో అయితే పాలక వైసీపీకి ఎదురు గాలి వీస్తోందని వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని టిడిపి సంబరాలు చేసుకుంటోంది. ఇక తెలంగాణాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి కూడా అదే అంటోంది. బి.ఆర్.ఎస్. పట్ల ఉన్న వ్యతిరేకతకు తమ విజయమే తార్కాణమని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే గెలుపని బిజెపి అంటోంది. అయితే కేవలం పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ముడి పెట్టనే లేమంటున్నారు రాజకీయ పండితులు. ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల స్థానాలకు సంబంధించి మూడింటికి ఎన్నికలు జరిగాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. వీటిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు. ఆయన శాసన మండలిలో అడుగు పెట్టడానికి అర్హత సాధించారు. అలాగే తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ ఇద్దరి విజయంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. 2019  అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం అనంతరం ఆ  పార్టీ సాధించిన అతి పెద్ద ఎన్నికల విజయాలు ఈ రెండే కావడం అందుకు కారణం. విజయాలకు మొహం వాచిపోయి పార్టీశ్రేణుల్లో నైరాశ్యం నిండిపోయి ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ విజయాలు ఆక్సిజన్ ను అందించాయని చెప్పక తప్పదు. అదే సమయంలో పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకే ఇది అని రాజకీయ పండితులు అంటున్నారు.

ఈ విజయాలతో సంబరాలు చేసుకుంటోన్న టిడిపి నేతలు ఇక వైసీపీ పని అయిపోయిందహో అని ఎగిరి గంతేస్తున్నారు. ఇవే ఫలితాలు 2024లోనూ రిపీట్ అవుతాయని అపుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపిలో జోరు కనిపిస్తే అందుకు భిన్నంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతల్లో నిరుత్సాహం నిస్పృహ కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు జరిగింది ఎక్కడ తేడా జరిగింది లోపాలేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారు పాలక పక్ష నేతలు. గత ప్లీనరీ సమావేశాల నుండి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త స్లోగన్ అందుకున్నారు. వైనాట్ 175 అన్నదే ఆ నినాదం. వచ్చే ఎన్నికల్లో 175కి175 స్థానాలు ఎందుకు గెలవలేం కచ్చితంగా గెలిచి తీరతాం అని ధీమా వ్యక్తం చేశారు. అప్పటినుంచీ ప్రతీ వేదికపైనా అదే చెబుతూ వస్తున్నారు. ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ స్వరంలో మార్పు వస్తుందేమో అంటున్నారు రాజకీయ పండితులు. 175కి 175 స్థానాలు గెలవాలనుకునే వారు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎందుకు ఓడిపోయారో తేడా ఎక్కడ జరిగిందో వాళ్లే సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి రావడం పాలక పక్షాన్ని ఆత్మరక్షణలో పడేయడం ఖాయమని వారంటున్నారు. పార్టీకి తిరుగులేని బలం ఉన్న రాయలసీమలోనూ కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకున్న విశాఖ ఉన్న ఉత్తరాంధ్రలోనూ పరాజయం పాలు కావడం వారికి కాస్త బాధగానే ఉంది. మంత్రులు మౌనంగా ఉండిపోయారు. కాకపోతే తప్పులు తెలుసుకుని దిద్దుబాటు చేసుకోడానికి ఇదో మంచి అవకాశమే అని వారు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోడానికి కూడా ఓ అవకాశం దక్కిందని వారు అనుకుంటున్నారు.

అయితే లోపల్లోపల మాత్రం మనస్తాపంతోనే ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనించిన రాజకీయ పరిశీలకులు మాత్రం ఈ ఫలితాలను చూసి పాలక పక్షం గుండెలు బాదుకోవలసిన అవసరం లేదని అంటున్నారు. వాళ్లు చెప్పేదేంటంటే పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎవరు ఓట్లేస్తారు గ్రాడ్యుయేషన్ ఆ పైన చదువులు చదివిన వారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్లుంటారు. ఎక్కడా ఉద్యోగం చేయకుండా సొంత వ్యాపారాలు చేసుకునేవాళ్లూ ఉంటారు. వీళ్లు కాకుండా నిరుద్యోగులు కూడా ఉంటారు. వీరిలో మెజారిటీ  ఓటర్లు కచ్చితంగా మధ్య తరగతి ఆ పై తరగతికి చెందిన వారే ఉంటారు. ఈ వర్గాల వాళ్లు  వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉంటే ఉండచ్చు.  నిజానికి ఇదేమీ కొత్త కూడా కాదంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లోనూ ఈ వర్గాల వారు వైసీపీకి వ్యతిరేకంగా టిడిపికి అనుకూలంగానే ఓటు వేసి ఉంటారని వారు అంచనా వేస్తున్నారు. పైగా ఈ వర్గాల వారికి సంక్షేమ పథకాలంటే పూర్తి వ్యతిరేకత ఉంటుంది. నిరుపేదలకు సంక్షేమ పథకాల పేరట ప్రజాధనాన్ని అప్పనంగా దారపోస్తున్నారని మధ్యతరగతి ఆపై తరగతి వారు ఆరోపిస్తూ ఉంటారు. అంచేత ఈ వర్గాల ఓట్లు మొదట్నుంచీ కూడా వైసీపీకి పడేవి కావు అవే ఇప్పుడూ పడలేదు. గత ఎన్నికల్లో ఈ వర్గాల వారు వైసీపికి వేసిన ఓట్లతో వీటిని పోలిస్తే గత నాలుగేళ్లుగా అమలు చేస్తోన్న విద్యాపథకాల కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి రెండు శాతం ఎక్కువగానే పడి ఉండచ్చంటున్నారు మేథావులు.

2024 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వర్గాలు సహజంగానే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా టిడిపికి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి సంక్షేమ పథకాలనుండి ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులే పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారు. వారు కచ్చితంగా పాలక పక్షం వైపే మొగ్గు చూపే అవకాశాలుంటాయని రాజకీయ పండితులు అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించలేమన్న సంగతి చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునంటున్నారు విశ్లేషకులు. కాకపోతే ఈ విజయాలు టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి బాగా పనికొస్తాయి. వాళ్లల్లో స్ఫూర్తినింపడానికి కచ్చితంగా దోహదపడతాయి తమపై తమకి విశ్వాసం కలగడానికీ ఇవి సహకరిస్తాయి. అంతే కానీ ఇవే ఫలితాలను మనసులో పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే మాత్రం అసెంబ్లీలో భిన్నమైన ఫలితాలు వస్తాయని వారు అంటున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఈ పరాజయాలు ఒక విధంగా అవసరం.

ఇది వారికి  సీజన్ మారేటపుడు విధిగా తీసుకునే మిరియాల కషాయం వంటింది. కాస్త ఘాటుగా ఉన్నా ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఫలితాలే ఇవి అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్. ఇక అప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా ఏకపక్షంగా గెలుస్తూనే వస్తోంది వైసీపీ. పంచాయతీ ఎన్నికల్లో  పాలక పక్షం బలపర్చిన అభ్యర్ధులే గెలిచారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తిరుగేలేకపోయింది. ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే  అఖండ విజయమే సాధించింది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్. ఇవి కాక వివిధ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం ముందు విపక్షాలు నిలబడలేకపోయాయి. ఆ ప్రభంజనం ఎంత బలంగా వీస్తోందంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోనూ మొదటి సారిగా టిడిపి ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇన్ని వరుస విజయాలతో వైసీపీ దూకుడు మీద ఉంది. అంతకన్నా చిత్రమైన సంగతి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎక్కడా కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు. విపక్షాలు అసలు పోటీయే ఇవ్వలేకపోయాయి. దీంతో విజయం అంటే ఇంత తేలికా అన్న భావన పార్టీ శ్రేణుల్లో నరనరాన జీర్ణించుకుపోయిందేమో కూడా.

అదే జరిగితే అది చాలా ప్రమాదకరమైన సంకేతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే తేలిగ్గా గెలిచేస్తామని వారు ధీమాలో ఉంటే తల బొప్పికట్టే ప్రమాదం ఉంటుంది. అలా జరక్కుండా ఈ ఫలితాలు పాలక పక్షాన్ని ఒక విధంగా కాపాడాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తెలంగాణాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని బిజెపి గెలుచుకుంది. పట్టభద్రుల నియోజకవర్గాలతో పోలిస్తే ఉపాధ్యాయుల స్థానానికి జరిగే ఎన్నికల్లో ఓటర్లు చాలా పరిమితం. చాలా తక్కువ సంఖ్యలోనే ఓటర్లు ఉంటారు. అంచేత ఈ విజయాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొలమానంగా తీసుకునే పరిస్థితే ఉండదు. ఆ విషయం బిజెపికి తెలీక కాదు అయినా సరే ప్రజలకు ఒక సంకేతం పంపడానికి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఈ విజయాన్ని ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అన్నట్లు కమలనాథులు హడావిడి చేసేస్తున్నారు. ఉపాధ్యాయుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండడానికి కారణాలేమున్నాయో తెలంగాణాలో అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్. గమనించాలిపుడు. లోటు పాట్లు ఉంటే వాటిని ఎన్నికల లోపు సరిదిద్దుకోవాలి. అంతే తప్ప పెద్దగా ప్రాధాన్యం లేని ఈ ఎన్నికల ఫలితాలను చూసి దిగాలు పడాల్సిన అవసరమే లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.