కవిత కేసు ఏదో జరుగుతోంది

By KTV Telugu On 21 March, 2023
image

రాజధాని మద్యం కుంభకోణంలో కవిత పేరు వచ్చినప్పటి నుంచి ఆమె అరెస్టు తప్పదన్న చర్చ కొనసాగుతూనే ఉంది. ఆమెను సీరియస్ గా విచారణకు పిలిచిన తర్వాత ఇకేముంది తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమని కూడా వార్తలు వచ్చాయి. సోమవారమే కీలక రోజని ఈడీ ఆమెను వదిలిపెట్టదనుకుని బీఆర్ఎస్ శ్రేణులు మీడియా మొత్తం ఢిల్లీలోనే మోహరించాయి. సాయంత్ర ఆరు తర్వాత ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తారని ఎదురుచూసిన వాళ్లు కొంత టెన్షన్ పడిన మాట వాస్తవం. ఆమెను అరెస్టు చేస్తున్నారన్న వార్త కూడా దావానలంలా వ్యాపించింది. గంట తర్వాత తొమ్మిది గంటల పది నిమిషాల ప్రాంతంలో మొహానికి నవ్వు పులుముకుని కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. విక్టరీ సింబల్ చూపిస్తూ కారెక్కి ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ఢిల్లీ నివాసంలో గుమ్మడికాయ హారతి ఇచ్చి ఆమెకు స్వాగతం పలికారు. హమ్మయ్యా అరెస్టు చేయలేదని ఊపిరి పీల్చుకున్న వాళ్లకు అంతలోనే మరో షాకు తగిలింది. ఆమెను మంగళవారం మళ్లీ విచారణకు రమ్మన్నారని వెల్లడైంది. అంతలోనే కొందరు అభిమానులు భావోద్వేగానికి లోనై ఆమెకు పాదాభివందనం చేయడం వేరే విషయమనుకోండి.

కవిత కేసులో చాలా వార్తలే వస్తున్నాయి. అందులో ఏది నిజమే ఏదీ వదంతో కూడా చెప్పలేం. ఎందుకంటే ఈడీ రోజువారీ అధికారికంగా ప్రకటనలు చేయదు. సీబీఐ తరహాలో పెద్దగా లీకులు కూడా ఇవ్వదు. సోమవారం అరెస్టు చేయరన్న సంగతి మాత్రం నర్మగర్భంగానే ఈడీ బయటకు వదిలింది. అందుకే బీఆర్ఎస్ వర్గాలు కాస్త సంతోషంగానే ఉన్నాయి. అలాగని మంగళవారం అరెస్టు చేయబోవడం లేదని కూడా చెప్పడం కష్టమట. అందుకే కేసీఆర్ ఒక ఆత్మీయ ప్రకటన చేశారని చెబుతున్నారు.ఏవరేమీ చేసినా భయపడేది లేదని కేసీఆర్ అన్నారనుకోండి. కవితను అడిగిన ప్రశ్నల్లో కూడా కొత్తదనం కనిపించలేదు. సామాన్య ప్రజలు సైతం ఊహించిన ప్రశ్నలే ఆమెను అడిగారు. దర్యాప్తు అధికారి జోగీందర్‌ ఒక మహిళా అధికారితో పాటు మొత్తం ముగ్గురు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. పదిన్నర గంటల విచారణ అని చెబుతున్నప్పటికీ సగం సమయం కూడా ప్రశ్నించి ఉండకపోవచ్చని చెబుతున్నారు. మిగతా సమయం విశ్రాంతికి నోట్స్ తయారు చేయడానికి సరిపోయిందని అంటున్నారు. కవితతో సంతకం పెట్టించుకునే ముందు ఆమె అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ స్టేట్ మెంట్ లో కొన్ని మార్పులు చేశారు.

తొలుత కవితను 20 ప్రశ్నలు అడిగారని వార్తలు వచ్చాయి. తర్వాత అవి ప్రశ్నలు మాత్రమేనని తేలింది. కాకపోతే ప్రతి ప్రశ్నలో కొన్ని అనుబంధ ప్రశ్నలు ఉన్నాయని చెబుతున్నారు. దానితో ప్రతీ ప్రశ్నకు 15 నుంచి 20 నిమిషాలు తీసుకున్నారని తెలిసంది. అరుణ్ రామచంద్ర పిళ్లైతో ముఖాముఖి కూర్చోబెట్టి కవితను ప్రశ్నించాలని ఈడీ భావించినప్పటికీ అందుకు ఆయన అంగీకరించలేదు. దానితో అధికారులు వ్యూహం మార్చి కొత్త ప్రశ్నలు జోడించి కవితను మాత్రమే ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ ఢిల్లీలో ఒబెరాయ్‌ హోటల్‌ సమావేశాలకు సంబంధించిన పత్రాలను ఆమెకు చూపించి ప్రశ్నించారని సమాచారం. అలాగే అరుణ్‌ రామచంద్ర పిళ్లై సౌత్‌ గ్రూప్‌ తరఫున కవిత తరఫున జరిపిన సంభాషణలనూ వారు ఆమెకు వినిపించి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. కవిత బ్యాంక్ స్టేట్ మెంట్లో ఉన్న అనుమానాస్పద లావాదేవీలకు ఎక్కువ సేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. కవిత నుంచి స్వాధీన పరుచుకున్న మొబైల్ ఫోన్ ఆమె ధ్వంసం చేసిన ఫోన్లలో ఉన్న డేటా కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మనీశ్ సిసోడియా విజయ్ నాయర్ వ్యవహారాలపై ఈడీ అధికారులు ఎక్కువ సేపు మాట్లాడారు. అభిషేక్‌ బోయినపల్లి బుచ్చిబాబు తదితరులతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.

కవితను అరెస్టు చేస్తారా చేయరా అన్న ప్రశ్నలు ఆమెను అరెస్టు చేయకపోవచ్చన్న అనుమానాలకు చాలా కారణాలే ఉన్నాయి. విచారణలో కవిత దూకుడుగా ఉండటం కూడా ఒక కోణమని చెప్పాలి. తనను రాజకీయం కారణాలతో ప్రశ్నిస్తున్నారా అని ఈడీ అధికారులను కవిత నిలదీయడంతో ఆమె నీళ్లు నమిలారు. సుప్రీం కోర్టు కేసు తేలేంత వరకు ఎందుకు ఆగలేకపోయారని ఎదురురెదురుగా కూర్చోబెట్టి ఎందుకు ప్రశ్నించడం లేదని కవిత ఎదురు ప్రశ్నలు వేశారట. తనను నిందితురాలిగా ప్రశ్నిస్తున్నారా అంటే కేవలం అనుమానితురాలిగానే ప్రశ్నిస్తున్నామని చెప్పడంతో కవితలో కాన్ఫిడెన్స్ పెరిగిందని అంటున్నారు. తాను వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులో ఎక్కడలేకపోయినా తన పిటిషన్ సత్వర విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించకపోవడం వల్లే ఈడీ కార్యాలయానికి వచ్చానని కవిత చెప్పుకున్నారు. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ గతంలో లేఖ రాసినట్లు కవిత గుర్తుచేశారు. 24న సుప్రీ కోర్టు విచారణ ఉన్నందున అంతవరకు ఆగడంలో తప్పేమిటని కవిత ప్రశ్నించినా ఈడీ అధికారులు సమాధానమివ్వలేదు. అలాగే సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ కూడా దాఖలుచేసింది. తమ వాదనలు వినేవరకూ కవిత పిటిషన్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరింది. దానిపై అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు రావాల్సి ఉంది.

కవిత రెండు సార్లు విచారణను పరిశీలిస్తే ఈడీ తీరులో సీరియస్ నెస్ లేదని కొందరు న్యాయవాదులు అంటున్నారు. ఏదో చేయాలని చేస్తున్నారని కేంద్రం ఒత్తిడితో రొటీన్ గా జరిగిపోతోందని కూడా చెబుతున్నారు. కేంద్రం అసలు టార్గెట్ కవిత కాదని మనీశ్ సిసోడియాతో పాటు కేజ్రీవాల్ ను ఫిక్స్ చేయడమే వారి లక్ష్యమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కవిత నుంచి ఏదైనా సమాచారం వస్తే దాని ఆధారంగా ఆప్ నేతలకు మరింతగా ఉచ్చు బిగించే అవకాశం ఉంటుందని కేంద్రం ఎదురుచూస్తోందట. కవితను అరెస్టు చేసినప్పటికీ కూడా ఆమెపై బలమైన అభియోగాలు ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు. అదంతా పొలిటికల్ గేమ్ లో భాగమని ఆ సంగతి తెలిసే బీఆర్ఎస్ శ్రేణులు పెద్దగా టెన్షన్ పడటం లేదని చెబుతున్నారు. కవిత భుజంపై గన్ పెట్టి కేజ్రీవాల్ ను కాల్చాలన్న ప్రయత్నంలో నిజమెంతో తెలియాలంటే మాత్రం కేసు విచారణ ఒక కొలిక్కి రావాలి. అప్పటి వరకు ఏది నిజమో మనకు తెలియదు.