ఏపీ అసెంబ్లీలో వీరంగం వైసీపీకే న‌ష్టం

By KTV Telugu On 22 March, 2023
image

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ప్ర‌జాప్ర‌తినిధులు హ‌ద్దు దాటుతున్నారు. హుందాగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎప్పుడో మ‌ర్చిపోయారు. విమ‌ర్శ‌ల్లో ఆరోప‌ణ‌ల్లో కుటుంబాల‌ను కూడా లాగే స్థాయికి దిగ‌జారిపోయారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి స్పీక‌ర్ సాక్షిగా దాడికి కూడా తెగ‌బ‌డ్డారు. టీడీపీ స‌భ్యులు దూకుడు ప్ర‌ద‌ర్శించి ఉండొచ్చు పోడియందాకా వెళ్లుండొచ్చు వాళ్ల‌ను మంద‌లించొచ్చు అవ‌స‌ర‌మైతే స‌స్పెండ్ చేసి స‌భ‌నుంచి గెంటేయొచ్చు. అధికార‌ప‌క్ష‌స‌భ్యులే మార్ష‌ల్స్‌లా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌ర‌మైతే లేదు. టీడీపీ స‌భ్యులే దాడి చేశార‌ని అధికార‌పార్టీ చెప్పినా అదెవ‌రూ న‌మ్మ‌రు. ఎందుకంటే టీడీపీకి అసెంబ్లీలో ఉన్న బ‌లం కేవ‌లం 19. వందమందికి పైగా అధికార‌పార్టీ స‌భ్యులున్నారు.

సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబుకి సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు ఈసారి టికెట్ ఇస్తారా లేదా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో ఆయ‌న అసెంబ్లీలో అత్యుత్సాహం చూప‌డం అధినాయ‌క‌త్వం మెప్పుకోస‌మే అనుకోవాలి. ఆయ‌న ద‌ళిత ఎమ్మెల్యే ఆయ‌న దాడిచేసింది కూడా ద‌ళిత ఎమ్మెల్యేపైనే టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల‌వీరాంజ‌నేయ‌స్వామిపై దాడిచేశారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌ల‌కు కాపు ఎమ్మెల్యేలు మైకుల ముందుకు వ‌చ్చిన‌ట్లు ద‌ళిత ఎమ్మెల్యేపై దాడికి ద‌ళిత ఎమ్మెల్యే అన్న‌మాట‌ ఇదెక్క‌డి రాజ‌కీయ వ్యూహం.

త‌న‌పైనే దాడిచేశార‌ని వైసీపీ ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు త‌ర్వాత ఓ బ్యాండేజితో క‌నిపించారు. అబ‌ద్ధ‌మైనా అతికిన‌ట్లు ఉండాలి. గుప్పెడు మంది వ‌చ్చి గుంపుమీద దాడిచేసే అవకాశం ఎక్క‌డుంటుంది ఈ ప‌రిణామాల‌తో న‌ష్ట‌పోయేది వైసీపీనే. ఒక‌వేళ టీడీపీ విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటినా వారి నిర‌స‌న ఎంత‌దాకా వెళ్లినా అధికార‌ప‌క్షం సంయ‌మ‌నం పాటించాలి. చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎవ‌రెలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో ప్ర‌జ‌లే చూసుకునేవారు కానీ ద‌ళిత ఎమ్మెల్యేల మ‌ధ్య గొడ‌వ‌ చూసిన‌వాళ్ల‌కు రోత పుడుతోంది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో వైసీపీ అహ‌స‌నంగా ఉంద‌న్న సంకేతం ప్ర‌జ‌ల్లోకెళ్తోంది.

కేవ‌లం ద‌ళిత ఎమ్మెల్యేల మ‌ధ్య గొడ‌వ‌తోనే ఆగ‌లేదు అసెంబ్లీ ర‌చ్చ‌. నాలుగుద‌శాబ్ధాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి మీదికి మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ దూసుకెళ్లారు. చుట్టూ మార్ష‌ల్స్ లేక‌పోతే పెద్దాయ‌న కూడా చేదు అనుభ‌వాన్ని చ‌విచూడాల్సి వ‌చ్చేదేమో. సుధాక‌ర్‌ బాబుకే క్రెడిట్ ద‌క్కుతుందేమోన‌న్న ఆందోళ‌న‌తోనేమో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కూడా టీడీపీ ఎమ్మెల్యే డోలాను ఓ దెబ్బేసే ప్ర‌య‌త్నం చేశారు. త‌న వాగ్ధాటితో అంద‌రి నోళ్లు మూయించే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వాయిదా వేయ‌కుండానే త‌న ఛాంబ‌ర్‌లోకి వెళ్లిపోవ‌డం చ‌ట్ట‌స‌భ‌లో మ‌రో అవాంఛ‌నీయ ప‌రిణామం. త‌ర్వాత సీట్లోకొచ్చి 11మంది టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మార్ష‌ల్స్‌తో బ‌ల‌వంతంగా బ‌య‌టికి పంపించారు. టీడీపీ స‌భ్యులు స్పీక‌ర్‌పై దాడిచేశార‌న్న‌ది వైసీపీ ప్ర‌త్యారోప‌ణ‌ కానీ మందిబ‌లం వైసీపీ వైపే ఉన్న‌ప్పుడు ఈ వాద‌న నిల‌వ‌దు క‌దా.