పట్టభద్రులు పుట్టి ముంచడంతో వైసీపీకి దిక్కుతోచటం లేదు టీచర్లను తమ వైపు తిప్పుకోవడం కష్టమని అటుగా దృష్టి పెడితే పట్టభద్రుల నియోజకవర్గంలో వైసీపీకి చుక్కెదురైంది. మూడు చోట్ల పరాజయం పాలై తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది. విశాఖ రాజధాని అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చినా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం అధికార పార్టీకి పెద్ద షాకే అవుతుంది. చివరకు పశ్చిమ రాయలసీమలోనూ పరాజయం తప్పలేదు. ఈ బాధ నుంచి కోలుకునే లోపే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి. ఆ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక టీమ్ జగన్ ఇప్పుడు తలపట్టుకుంటున్నట్లు సమాచారం.
23న ఏడు ఎమ్మెల్యో కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఛాన్స్ తీసుకుంటే ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు అంచనా వేసుకుని పంచుమర్తి అనురాధను రంగంలోకి దించారు. ఆమె బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ. ప్రస్తుత లెక్కల ప్రకారం వైసీపీ ఆరు చోట్ల సునాయాసంగా గెలిచిపోతుంది. ఏడో అభ్యర్థి గెలవాలంటే 22 తొలి ప్రాధాన్య ఓట్లు రావాలి. అక్కడ వైసీపీ టీడీపీకి టగ్ ఆఫ్ వార్ అయ్యే ప్రమాదం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున 151 మంది గెలిచారు. టీడీపీకి లెక్కప్రకారం 23 మంది ఎమ్మెల్యేలున్నారు. జనసేన తరపున ఒకరు గెలిచారు. తర్వాతి పరిణామాల్లో టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, కరణం బలరాం కృష్ణమూర్తి, మద్దాల గిరి సహా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు మొగ్గుచూపారు. ఏకైక జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీకే జై కొట్టారు. ఈ లెక్కలు చూసుకునే ఏడో అభ్యర్థిని రంగంలోకి దింపిన వైసీపీ ఇప్పుడు తలపట్టుకు కూర్చుంది.
టీడీపీకి ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలున్నట్లు లెక్క. నెల్లూరు వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సారి టీడీపీకి ఓటేసేందుకు సిద్ధమైతే ప్రధాన ప్రతిపక్షం బలం 21కి పెరుగుతుంది. అనురాధ గెలవాలంటే ఇంకో ఓటు వస్తే సరిపోతుంది. వైసీపీలో ఉన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ ఎదురుచూడటం వల్లే అభ్యర్థిని నిలబెట్టారని అంటున్నారు. గత ఆరు నెలలుగా వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. జగన్ విధానాలతో జనం తమను ఛీ కొడుతున్నారన్న భయం వారిలో పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు పక్క చూపులు చూస్తున్నారు. చిన్న అవకాశం ఇస్తే పరిగెత్తుకుంటూ వచ్చి టీడీపీలో చేరిపోయేందుకు కనీసం రెండు డజన్ల మంది వేచి చూస్తున్నారు. అలాంటి వారిలో కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేందుకు సిద్ధమవుతున్నారు. రహస్యంగా ఓటేయ్యమంటే ఓటేస్తామని బహిరంగంగా చూపించి ఓటెయ్యమన్నా వేస్తామని వర్తమానాలు పంపుతున్నారు. ఓటేసిన వెంటనే వచ్చి టీడీపీలో చేరేందుకు కూడా వాళ్లు సిద్ధమవుతున్నారు.
కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటే ఇప్పుడు అనురాధకు ఓటేస్తామని చెబుతున్నారట. అయితే టీడీపీ వైపుకు రావాలనుకుంటున్న వారికి నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని తెలియడంతో వారి సాయం తీసుకునేందుకు చంద్రబాబు వెనుకాడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో తమ నాయకులు వ్యతిరేకించే వీలుందని కూడా భావిస్తున్నారు. అయినా ఆ ఒక్క ఓటుకు ఇబ్బందేమీ లేదన్నది టీడీపీ ధీమా. ఇప్పటికే పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ 23న జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను పరువు సమస్యగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకుండా చూసుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఏమి కావాలన్నా ఇస్తానంటున్నారు. ఆనం, కోటంరెడ్డి ఎలా ఓట్లు వేయరు కాబట్టి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయినా ఇప్పుడు వైసీపీలో ఉన్న రహస్య స్నేహితుల మీదే టీడీపీ ఆశలు పెట్టుకుంది.