తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరాలన్నా వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ కావాలన్నా ఇపుడు అంతా చినబాబేనట. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుణ్ని కలిసే ప్రతీ నేతనూ కూడా పోయి చినబాబును కలవండి అని పంపిస్తున్నారని టాక్ వినపడుతోంది. దాంతో నేతలు కూడా చంద్రబాబుకు ఓ దండం పెట్టి ఆ తర్వాత లోకేష్ బాబు యాత్ర చేస్తోన్న చోటకు వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. లోకేష్ తన రాజకీయ వారసుడని పార్టీ శ్రేణులకు సీనియర్ నేతలకు కూడా స్పష్టమైన సంకేతం ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు ఈ వ్యూహాన్ని అమలు చేసుకుపోతున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి చూసి మురిసిపోదామని చంద్రబాబు నాయుడు ఒక తండ్రిగా ఆశపడుతున్నారు. ముందుగా పార్టీలో ప్రతీ ఒక్కరికీ తన తర్వాత లోకేషే అందరికీ బాస్ అన్న భావన పాదుకొల్పడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్టీలో తనని కలవడానికి వచ్చిన వారిని ఆ తర్వాత పోయి లోకేష్ ని ఓ సారి కలవండి అని చెబుతున్నారట చంద్రబాబు. ఎంతో సీనియారిటీ ఉన్న నేతలు లోకేష్ కు ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వకపోవచ్చునన్న అనుమానంతోనే చంద్రబాబు నాయుడు కొత్త సంస్కృతికి తెరతీశారని అంటున్నారు.
మాజీ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఓ రోజున చంద్రబాబు నాయుడు కన్నాకు ఫోన్ చేసి లోకేష్ యువగళం యాత్రకు మద్దతుగా ఓ సారి అక్కడికెళ్లి యాత్రలో పాల్గొని రండి అని ఆదేశించారట. చంద్రబాబు మాటను తీసేయలేక కన్నా లక్ష్మీనారాయణ చిత్తూరు జిల్లాలో లోకేష్ యాత్ర చేసే చోటకు వెళ్లారు. కాసేపు లోకేష్ తో కలిసి నడిచారు దాంతో తన పని అయిపోయిందని కారెక్కి వెళ్లిపోయారు. నిజానికి తన కొడుకు వయసున్న లోకేష్ యాత్రలో తనను పాల్గొనమని అడగడం కన్నాకు నచ్చకపోయినా వచ్చే ఎన్నికల్లో తనకు కావల్సిన సీటు దక్కాలంటే చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండక తప్పదు. చంద్రబాబును మెప్పించాలంటే లోకేష్ ను ఒప్పించక తప్పదు. అందుకే కన్నా లోకేష్ యాత్రకు వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారు. కన్నా తర్వాత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాథాకృష్ణ కూడా అంతే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుండి పోటీ చేయాలని అనుకుంటోన్న రాథాకృష్ణ చంద్రబాబును కలిసి తన మనసులో మాట చెప్పారట. దానికి చంద్రబాబు అలాగే చేద్దాం కానీ ఓ సారి లోకేష్ ను కలిసి అతని తో కూడా చెప్పి రారాదూ అని సలహా ఇచ్చినట్లు చేశారట. బాబు మనోగతం అర్ధం కాగానే వంగవీటి అమాంతం కారెక్కి లోకేష్ యాత్రాస్థలిని చేరుకున్నారు.
అక్కడ క్యారవాన్ లో లోకేష్ తో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి పోటీ చేద్దామనుకుంటున్నాను అని లోకేష్ తో అన్నారట రాథా. దానికి లోకేష్ నిర్మొహమాటంగా విజయవాడ ఈస్ట్ ఖాళీ లేదన్నా ఇంకెక్కడి నుంచి అయినా పోటీ చేస్తే చెప్పండి అన్నారట. దాంతో షాక్ తిన్న వంగవీటి ఓ నవ్వు నవ్వేసి మళ్లీ కలుద్దాం అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఇద్దరు కాపు నేతల బాటలోనే తాజాగా మరో సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అడుగులు వేశారు. విశాఖ జిల్లా నుండి ప్రతీ ఎన్నికలోనూ పార్టీలూ నియోజకవర్గాలూ మారుస్తూ గెలుస్తూ వస్తోన్న గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ నాయకత్వం ఏ కార్యక్రమానికి పిలుపు నిచ్చినా గంటా పట్టించుకోలేదు. చివరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించినపుడు కూడా గంటా శ్రీనివాసరావు తన ఇంటికే పరిమితం అయ్యారు బాబును ఖాతరు చేయలేదు. అధికార వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరాలని గంటా అనుకున్నా ఆ పార్టీ నుండి సానుకూల స్పందనలు రాకపోవడంతో ఈ మధ్యనే మనసు మార్చుకుని తాను టిడిపిలోనే ఉంటానని ఏ పార్టీలోకి మారడం లేదని గంటా ఓపెన్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబును కూడా పట్టించుకోని గంటా శ్రీనివాసరావు ఇపుడు అనూహ్యంగా అందరికీ షాకిస్తూ లోకేష్ పాదయాత్రలో పాల్గొని వచ్చారు.
ఉత్తరాంధ్ర లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంలో చంద్రబాబు నాయుడి నాయకత్వం అద్భుతమని లోకేష్ ఎదుట మెచ్చుకున్నారట గంటా. వచ్చే ఎన్నికల్లో విశాఖలో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని గతంలో జరిగింది మర్చిపోయి తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని లోకేష్ ను అడిగారట గంటా శ్రీనివాసరావు. దానికి లోకేష్ ఎలా స్పందించారో తెలీదు కానీ గంటాను అయితే టిడిపి నాయకత్వం నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రత్యేకించి చంద్రబాబును అవమానించిన నేతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా అని లోకేష్ కూడా పార్టీ నేతలతో అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల ఏడాది కాబట్టి ఎవరినీ కూడా దూరం చేసుకోకూడదన్న చంద్రబాబు సలహాకు కట్టుబడే గంటాతో మర్యాదగా మాట్లాడినట్లు నటించారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఈ ముగ్గురు దిగ్గజ కాపు నేతలూ కూడా లోకేష్ తో కలిసి అడుగులు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలే టిడిపిలోని ఇతర సీనియర్లతో పాటు పార్టీలో చేరాలనుకునేవారికి ఎలా నడుచుకోవాలో చెప్పే సంకేతాలుగా ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు.
చంద్రబాబు నాయుడు విషయంలోనూ టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఇలానే చెప్పేవారు.
1983 ఎన్నికల్లో ఎన్టీయార్ ను ఓడిస్తానని శపథం చేసిన చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో ఓడారు. ఆతర్వాత ఎన్టీయార్ ను కలిసి కాళ్లావేళ్లా పడి టిడిపిలో చేరారు. అనతి కాలంలోనే ఎన్టీయార్ కు సన్నిహితుడు అయిపోయారు. ఎంతగా అంటే నాటి ప్రభుత్వంలో ఎవరు ఏపనిమీద తనని కలవడానికి వచ్చినా ఎన్టీయార్ వారు చెప్పేదంతా విని బాబును కలవండి అని అనేవారట. అంతే ఇక నేతలంతా కూడా ఎన్టీయార్ ను నందీశ్వరుడిగా భావించి చంద్రబాబును శివుడిగా చూడ్డం మొదలు పెట్టారు. చూస్తూ ఉండగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ నంబర్ టూ అయిపోయారు. చంద్రబాబు కన్నా ముందునుంచీ పార్టీలో ఉన్న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓవర్ టేక్ చేసిన చంద్రబాబు ఏకంగా ఎన్టీయార్ కు టెంకి జెల్ల కొట్టేసి ముఖ్యమంత్రి అయిపోయారు కూడా. తన కుమారుడు లోకేష్ కు అన్ని తెలివి తేటలు మాయలు లేవని చంద్రబాబుకు తెలుసు. అందుకే తాను ఉండగానే లోకేష్ కు పార్టీ నేతల దృష్టిలో బలమైన ఇమేజీ హోదా కల్పించాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని అంటున్నారు.
లోకేష్ ఎలివేషన్ తో పార్టీలోని కొందరు సీనియర్లకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లుగా ఉందంటున్నారు. ప్రత్యేకించి పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఇపుడు చాలా అభద్రతా భావంతో ఉంటున్నారట. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అచ్చెంనాయుడు ఓ టిడిపి చోటా నాయకుడితో మాట్లాడుతూ పార్టీ లేదు బొక్కా లేదు అనేశారు. లోకేష్ సారధ్యంలో పార్టీకి భవిష్యత్ లేదని కూడా అన్నారు. అవి బహిర్గతం కావడంతో పార్టీలో రచ్చరచ్చే అయ్యింది. అప్పట్లో అచ్చెంనాయుణ్ని కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉండడంతో అంతా మౌనంగానే భరిస్తూ ఉండిపోయారు. వచ్చే ఎన్నికల్లో అచ్చెంనాయుడికి తగిన గుణపాఠం చెప్పాలన్న కసితోనే చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఉన్నారట. లోకేష్ ఎదుగుదలను అడ్డుకోవడం కోసమే పార్టీలో కొందరు సీనియర్లు యువగళం పాదయాత్రకు ఉద్దేశ పూర్వకంగా సహకరించడం లేదన్న టాక్ నడుస్తోంది టిడిపిలో. ఇదంతా చంద్రబాబు నాయుడి దృష్టికి కూడా వెళ్లిందంటున్నారు. ఇపుడలాంటి సీనియర్లందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టే వ్యూహ రచనలో చంద్రబాబు బిజీగా ఉన్నారట. అంతిమంగా ఇది పార్టీని ఎక్కడికి తీసుకుపోతుందో చూడాలంటున్నారు సీనియర్లు.