పంజాబ్ రాజుకుంటోంది మళ్లీ ఖలిస్తాన్ నినాదం మార్మోగుతోంది. అశాంతి రాజేసే అగ్నికణాలు రాలి పడుతున్నాయి. ఉన్మాదాన్ని ప్రబోధించే విద్వేష ప్రవచనాలు ఊపందుకుంటున్నాయి. సిక్కులకు ప్రత్యేక రాజ్యం కావాలన్న డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది. ఈ మొత్తం అశాంతికి స్క్రీన్ ప్లే రచన దర్శకత్వం అమృత పాల్ సింగ్. ప్రస్తుతం ఇతగాడి గురించే పోలీసులు వేటాడుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి సైన్యాన్ని ఏమార్చి నేపాల్ మీదుగా కెనడా పారిపోడానికి అమృత్ పాల్ ప్రయత్నిస్తోన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు నెలల క్రితం వరకు కూడా అమృత్ పాల్ సింగ్ అంటే పంజాబ్ లో కూడా ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ స్వల్ప వ్యవధిలోనే అమృత్ పాల్ సింగ్ పంజాబ్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదిగిపోయాడు. చాలా మంది కుర్రకారుకు అతడో హీరో. ఉన్మాదం ఉరకలెత్తించే ప్రసంగాలతో యువత మనసులను విద్వేషాగ్నులతో నింపేస్తూ వచ్చాడు కాబట్టే ఇపుడు అమృత్ పాల్ సింగ్ అమాంతం పాపులర్ అయిపోయాడు. మూడు పదుల వయసు కూడా లేని అమృత్ పాల్ సింగ్ హఠాత్తుగా వార్తల్లోకి ఎందుకు ఎంటరయ్యాడు. అతనే ఇపుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎలా మారాడు 60 రోజుల లోపే పంజాబ్ పాలకులకు పోలీసులకు నిద్రలేకుండా ఎలా చేయగలిగాడు అసలు అమృత్ పాల్ సింగ్ ఇంతకాలం ఎక్కడున్నాడు ఏం చేశాడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే అమృత్ జీవితాన్ని ఒక్కసారి రివైండ్ చేయాలి.
పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాకు చెందిన జల్లూ పూర్ ఖేరా అమృత్ పాల్ స్వగ్రామం. అమృత్ పాల్ సింగ్ కుటుంబానికి దుబాయ్ లో ట్రావెల్ ఏజన్సీ ఉంది. ఆ బిజినెస్ చూసుకోడానికి అమృత్ పాల్ సింగ్ 2012 నుండి దుబాయ్ లోనే ఉంటున్నాడు. ఏడాది క్రితం ఢిల్లీలో రైతుల చట్టానికి నిరసనగా రైతులు సుదీర్ఘ ఉద్యమం నిర్వహించినపుడు అమృత్ పాల్ సింగ్ అమాంతం దుబాయ్ నుండి భారత్ వచ్చాడు. నేరుగా ఢిల్లీ వెళ్లి రైతుల ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేశాడు. తాను దుబాయ్ లో ఉన్నప్పటినుంచీ కూడా దీప్ సిద్ధూ తో పనిచేశానని వారిస్ పంజాబ్ దే స్థాపనలోనూ తన పాత్ర ఉందని చెప్పుకున్న అమృత్ పాల్ సింగ్ ఆగమేఘాల మీద దీప్ సిద్ధూకు వారసుడు అమృత్ పాల్ సింగేనని ఓ లేఖను సృష్టించాడు. అయితే దీప్ సిద్ధూ కుటుంబ సభ్యులు మాత్రం అమృత్ పాల్ సింగ్ హోదాకు చట్టబద్ధత లేదని చెబుతున్నారు. అమృత్ పాల్ సింగ్ ఫోన్ నంబర్ ను దీప్ సిద్ధూ రోజుల తరబడి బ్లాక్ చేశాడు కూడా అని బంధువులు చెబుతున్నారు. అయితే అమృత్ పాల్ మాత్రం చిన్న ఆర్మీని తయారు చేసుకుని చాల వేగంగా పావులు కదిపి వారిస్ పంజాబ్ దేని సొంతం చేసుకున్నాడు. ఇక అప్పట్నుంచీ చాలా పాపులర్ అయిపోయాడు.
అమృత్ పాల్ సింగ్ తన సోదరుడు స్థాపించిన వారిస్ పంజాబ్ దే ప్రతిష్ఠను మంటగలుపుతున్నాడని తన సోదరుడు దీప్ సిద్ధూ పేరును దుర్వినియోగం చేస్తున్నాడని దీప్ సిద్ధూ సోదరుడు మన్ దీప్ ఆరోపిస్తున్నాడు. దీప్ సిద్ధూ ఏమో ఏ సమస్య అయినా చర్చలతోనే పరిష్కారం కావాలని సూచిస్తే దానికి పూర్తి భిన్నంగా అమృత్ పాల్ సింగ్ యువత ఆయుధాలు ధరించాల్సిందేనని రెచ్చగొడుతున్నాడని మన్ దీప్ అంటున్నాడు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. అంటే సిక్కులకు ప్రత్యేక దేశం ఉండాలన్నది ఈ ఉద్యమం లక్ష్యం. ఇందుకోసం ఎందాకైనా పోరాడాల్సిందేనని యువతకు పిలుపు నిస్తున్నాడు అమృత్ పాల్. గత నెల జరిగిన ఓ ఘటనే అమృత్ పాల్ ను అమాంతం రాత్రికి రాత్రే పాపులర్ చేసేసింది. అమృత్ పాల్ కు కొంతమంది సాయుధులతో కూడినా ఆర్మీ ఉంది. గత నెలలో అమృత్ పాల్ అనుచరులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు దానిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అమృత్ పాల్ సింగ్ అనుచరులలో ఒకరైన లవ్ ప్రీత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అంతే కొద్ది సేపట్లోనే ఈ అరెస్టుకు నిరసనగా ఖలిస్తాన్ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తల్వార్లు తుపాకులతో అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో వారు సిక్కుల పవిత్ర గ్రంధాలను తమతో తెచ్చుకుని వాటిని రక్షణ కవచంలా వాడుకున్నారు. ఆ గ్రంధాల జోలికి వెళ్తే సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయన్న కారణంతో పోలీసులు దుండగులపై ఎదురు దాడి చేయలేకపోయారు. ఉద్యమకారుల దాడుల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు లవ్ ప్రీత్ సింగ్ ను విడుదల కూడా చేశారు.
ఈ ఘటనతో అమృత్ పాల్ సింగ్ యువత దృష్టిలో పెద్ద హీరో అయిపోయాడు ఫాలోవర్స్ పెరిగిపోయారు. పరిస్థితులు చేతులు దాటకుండా పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. యువతలో ఉద్వేగాలు నింపేలా ప్రసంగాలు చేయడంలో అమృత పాల్ దిట్ట. ఆ ప్రసంగాలే ఆయన ఉద్యమాన్ని రోజు రోజు కీ పెద్దది చేశాయి. దీంతో పోలీసులు అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయడానికి రంగంలోకి బృందాలను దింపారు. అమృత్ పాల్ సింగ్ సన్నిహిత అనుచరులు అనుకున్న వారిని 78 మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా అమృత పాల్ సింగ్ కోసం వేట ముమ్మరం చేశారు. నేపాల్ మీదుగా అమృత్ పాల్ కెనడా పారిపోయే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం అందడంలో నేపాల్ సరిహద్దుల్లో భారత ఆర్మీ ప్రతీ ఒక్కరినీ జల్లెడ పడుతోంది. అమృత్ పాల్ సింగ్ దగ్గరి బంధువులు కూడా పోలీసులకు లొంగిపోయారు. అమృత పాల్ సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో ఉంచారని అతన్ని బూటకపు ఎన్ కౌంటర్ లో హతమార్చే ప్రమాదం కూడా ఉందని అమృత పాల్ సింగ్ తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.
అయితే అమృత పాల్ ను ఇంత వరకు అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చారు.
అమృత్ పాల్ సింగ్. ఇపుడు పంజాబ్ లో ఎక్కడ చూసినా ఇతగాడిపైనే చర్చ యూత్ లో ఇతనే ఓ ఐకాన్ అయిపోయాడు.
భారత్ రావడానికి ముందు దుబయ్ లో ఉన్నప్పుడు ట్రావెల్ ఏజన్సీలో ట్రక్ డ్రైవర్ గా వ్యవహరించాడు. ఆ సమయంలోనే పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఖలిస్తాన్ నాయకుడు లక్బీర్ సింగ్ సోదరుడు జశ్వంత్ తో పాటు ఉగ్రవాది పరమ్ జిత్ సింగ్ పమ్మాతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే పాకిస్థానీ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ. పెద్దలు అమృత్ పాల్ సింగ్ మనసులో విష బీజాలు నాటారు. ఉగ్ర శిక్షణ నిచ్చి భారత్ పై ఉసిగొల్పారు. ఖలిస్తానీ ఉద్యమానికి పాక్ అండ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయుధాలతో పాటు నిధులూ సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఓ సొంత సైన్యం నిర్మించుకుని పాపులర్ కావచ్చునని ఎరవేశారు. ఇవన్నీ అమృత్ పాల్ సింగ్ మెదడుపై బానే పని చేశాయి. అక్కడే అతను మెంటల్ బ్యాలెన్స్ తప్పాడు. ఉగ్ర వాదం పై మొగ్గు చూపాడు. హింసావాదమే సరియైనదనుకున్నాడు. అదే యువత చేతుల్లో ఆయుధం కావాలనుకున్నాడు.
భారత్ లో అడుగు పెట్టగానే ఆనంద్ పూర్ ఖల్సా ఫోర్స్ పేరిట సొంత ఆర్మీని స్థాపించుకున్నాడు. అప్పుడే దీప్ సిద్ధూ మరణించడంతో అది అమృత్ కు కలిసొచ్చింది. క్షణాల మీద వారిస్ పంజాబ్ దేను సొంతం చేసుకున్నాడు. సిక్ ఫర్ జస్టిస్ సంస్థతోనూ సంబంధాలు పెట్టుకున్నాడు. పాకిస్థాన్ నుండి పంజాబ్ కు వచ్చే డ్రోన్ల ద్వారానే అమృత్ పాల్ కు పాక్ ఆర్మీ ఆయుధాలతో పాటు నిధులూ పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో అమృత్ పాల్ పై కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. 80లలో ఖలిస్తాన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన బింద్రన్ వాలనే మక్కీకి మక్కీ కాపీ కొట్టేశాడు అమృత్ పాల్ సింగ్. తలపాగా గడ్డాలతో పాటు డ్రెస్ కూడా అచ్చం బింద్రన్ వాలేను తలపించేలా తయారు చేయించుకున్నాడు. నిజానికి బింద్రన్ వాలే సంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టాడు. సిక్కు మత ఆచార వ్యవహారాలను నిష్ఠగా ఆచరించేవాడు. అయితే అమృత్ పాల్ రెండు నెలల క్రితం వరకు మత వ్యవహారాల్లో ఇంత సంప్రదాయ బద్ధంగా ఏమీ లేడు ఇప్పటికిప్పుడు ఉద్యమం కోసం బింద్రన్ వాలేలా కనిపించడానికే అమృత్ పాల్ కసరత్తులు చేస్తున్నాడు.
బింద్రన్ వాలే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. అప్పట్లో యువత బింద్రన్ వాలను ఫాలో అయ్యింది. బింద్రన్ పిలుపునిస్తే చాలు యువత కట్టకట్టుకుని వాలిపోయేది. అయితే ఖలిస్తాన్ ఉద్యమం ముసుగులో వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టి హింసావాదానికి దారి తీస్తున్నారన్న ఆరోపణతో బింద్రన్ వాలేపై కేసులు నమోదు చేశారు. 1984 జూన్ లో ఖలిస్తాన్ తీవ్రవాదులు అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో దాగి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లోనే బింద్రన్ వాలే కన్నుమూశాడు. బింద్రన్ వాలేను మెజారిటీ సిక్కులు అమరవీరుడిగా ప్రకటించారు. బింద్రన్ వాలే 37 ఏళ్ల వయసులో చనిపోయాడు. బింద్రన్ వాలే చనిపోయిన 9ఏళ్ల తర్వాత అమృత్ పాల్ సింగ్ పుట్టాడు. ఇపుడు అమృత్ పాల్ సింగ్ కు 30ఏళ్లు. యువతను రెచ్చగొట్టడంలోనూ బింద్రన్ వాలేనే అనుసరిస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. ఖలిస్తాన్ అన్నది సిక్కుల చిరకాల స్వప్నమే తప్ప అదేమీ ద్రోహమో తప్పో కానే కావంటున్నాడు అమృత్ పాల్ సింగ్. ఖలిస్తాన్ అనేది ఒక సిద్ధాంతం ఒక భావజాలం వాటిని ఎవరూ చంపలేరు అని అమృత్ పాల్ సింగ్ వ్యాఖ్యానించాడు.
ఖలిస్తాన్ కోసం జీవితాంతం పోరాడి తీరతానంటున్నాడు. తమ జోలికి వచ్చినా తమ ఉద్యమాన్ని అణచి వేయాలని చూసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అమృత్ పాల్ హెచ్చరిస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాలను సైతం అమృత్ పాల్ బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమృత్ పాల్ ను విడిచి పెట్టే ప్రసక్తే లేదని పోలీసులు గాలింపు ఉధృతం చేశారు. రాష్ట్రంలో ఇంత హంగామా జరుగుతుంటే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ BMC ఎన్నికలకు ఆప్ తరపున ప్రచారం చేసేందుకు ముంబై వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అంతా ప్రశాంతంగానే ఉందని పోలీసులు అంటున్నారు. అమృత్ పాల్ అతని అనుచరుల ఉద్యమాలతో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లదని వారు భరోసా ఇస్తున్నారు. అశాంతి రేపడానికి పక్కా వ్యూహాంతో దేశంలో అడుగుపెట్టిన అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేటాడుతుండగా విదేశాల్లో ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు.
లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద జాతీయ పతాకాన్ని కిందకు దించేసి అగౌరవపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఖలిస్థాన్ రిఫరెండంపై ఓటింగ్ పెట్టారు. అలాగే లండన్‌లో మార్చి 22న భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ప్రోఖలిస్థానీ గ్రూపులు అనుమతి కోరాయి. ఈ నేపథ్యంలో అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాల్లోని భారత ఎంబసీల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట్లో అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెనకాడారు. అనవసరంగా యువత రెచ్చిపోతుందేమోనని చూసీ చూడనట్లు వదిలేశారు. అదే లోకువగా తీసుకున్న అమృత్ పాల్ సింగ్ ఏకంగా పోలీస్ స్టేషన్ పై దాడులకు తెగబడ్డాడు. అందుకే పోలీసులు వేట మొదలు పెట్టారు. దాంతో అమృత్ పాల్ సింగ్ మెల్లగా జారుకున్నాడు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కెనడా పారిపోయే అవకాశాలున్నట్లు అనుమానాలు ఉండడంతో నేపాల్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు దాటే అవకాశం ఉండటంతో దేశ సరిహద్దుల వద్ద తనిఖీలు భద్రతను పటిష్ఠం చేయాలని BSF SSBలకు ఆదేశాలు జారీచేసింది కేంద్ర హోంశాఖ.