ఆంధ్రప్రదేశ్ లో అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి వరుసగా రెండో షాక్ తగిలింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాల్లోనూ గెలుస్తామనుకున్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వ్యూహకర్తల అంచనా తప్పింది. పాలకపక్ష ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో టిడిపి శిబిరంలో సంబరాలు మిన్నంటగా వైసీపీ క్యాంప్ లో ఆందోళన కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కాక మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాల్లోనూ విజయాలు సాధించి తెలుగుదేశం పార్టీ సంచలనం సృష్టించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గాల్లో ఎప్పుడూ పోటీ పెట్టలేదు. బరిలో దిగిన మొదటి సారి పోటీ చేసిన మూడు చోట్లా ఓటమి చెందింది. టిడిపి విజయంలో జనసేన, పిడిఎఫ్ ల పాత్ర కూడా ఉందన్నది వేరే విషయం. ఎన్నికల తర్వాత ఎవరైనా చూసేది గెలిచిందెవరు? అనే తప్ప ఆ గెలుపు ఆ పార్టీ ఒక్కదానిదేనా ఇతరుల అండ ఉందా? అని అడగరు.
ఆ క్రమంలో టిడిపి గ్రాండ్ విక్టరీ నమోదు చేసుకుని మంచి ఊపు మీద ఉంది. 2024 ఎన్నికల్లోనూ తమదే అధికారమని ప్రచారం చేసుకుంటోంది కూడా. దాని తర్వాత తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ పంచుమర్తి అనూరాధను పోటీలో పెట్టింది. గత ఎన్నికల్లో 23 స్థానాలు గెలుచుకుంది టిడిపి. ఆ తర్వాత టిడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరకపోయినా ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు.
ఆ నలుగురు మినహాయిస్తే టిడిపికి ఉన్నది 19 మంది ఎమ్మెల్యేలే. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే కనీసం 22 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.టిడిపికి అంత బలం లేదు కాబట్టి తాము ఏడు స్థానాల్లోనూ గెలుస్తామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. అయితే టిడిపికి నలుగురు ఎమ్మెల్యేలు దూరం అయినట్లే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం అయ్యారు అది కూడా ఈ మధ్యనే. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధరరెడ్డి పాలక పక్షంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి టిడిపికి సన్నిహితంగా అడుగులు వేశారు. ఆ ఇద్దరూ టిడిపికి అనుకూలంగా ఉన్నా కూడా టిడిపి బలం 21 మాత్రమే. సో ఆ ఇద్దరూ టిడిపికి ఓటు వేసినా కూడా టిడిపి గెలిచే పరిస్థితి లేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంది. అయితే ఆ ఇద్దరు కాకుండా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టిడిపికి అండగా నిలవడం వల్లనే పంచుమర్తి అనూరాధ సంచలన విజయం సాధించగలిగారు. టిడిపి వైపు మొగ్గు చూపిన ఆ ఇద్దరు ఎవరన్నది ఇపుడు పాలక పక్షంలో చర్చ జరుగుతోంది.
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుండి క్రాస్ ఓటింగ్ చేసి టిడిపి అభ్యర్ధి విజయానికి సహకరించారని అనుమానిస్తున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరు నేతల పని తీరు పై ఐ ప్యాక్ నిర్వహించిన సర్వేలో నెగెటివ్ మార్కులు వచ్చాయని చెబుతున్నారు. ఇటు ఉండవల్లి శ్రీదేవికి అటు మేకపాటి చంద్రశేఖర రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తే ఇద్దరూ ఓడిపోవడం ఖాయమని సర్వేలో తేలిందట. ఈ విషయాన్ని జిల్లాల ఇన్ ఛార్జులతో వీరికి చెప్పించారట కూడా. పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించినా ఇద్దరూ కూడా తమ తీరు మార్చోకోలేదంటున్నారు. ఇద్దరిలోనూ మేకపాటి చంద్రశేఖర రెడ్డి అయితే అసలు గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నడూ నియోజకవర్గంలో తిరిగిందే లేదంటున్నారు. గడపగడపకూ మనప్రభుత్వం కార్యక్రమంలోనూ మేకపాటి అంతగా పాల్గొనలేదు. ఇక నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యపై ఇంటికి వచ్చినా ఆయన పట్టించుకునే వారు కారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ అనుమానమే అని తేలడంతో పాటు తన సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో కొన్నేళ్లుగా చంద్రశేఖర రెడ్డికి మనస్పర్ధలు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలే వాటికి కారణం. మేకపాటి రాజమోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు కావడంతో ఆయనపై చంద్రశేఖర రెడ్డి ఆగ్రహంగానే ఉన్నారని అంటున్నారు.
ఈ అసంతృప్తిని గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆనం రామనారాయణ రెడ్డి ద్వారా చంద్రశేఖర రెడ్డితో బేరసారాలు నడిపించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ రావడం కష్టం కాబట్టి టిడిపి అభ్యర్ధిగా ఉదయగిరి నుంచి టికెట్ ఇస్తామని టిడిపి నుండి భరోసా రావడంతోనే క్రాస్ ఓటింగ్ కు సిద్ధమయ్యారని భావిస్తున్నారు. అటు ఉండవల్లి శ్రీదేవి కూడా అంతే ఆమె పనితీరుకు మంచి మార్కులు రాకపోవడంతో ఆ మధ్య పార్టీ అధినేత బాగా పనిచేయాలని సూచనలు చేశారట. పనితీరు మారకపోతే టికెట్ కష్టం అవుతుందని చెప్పారట. అది మనసులో పెట్టుకున్న శ్రీదేవి ఇక ఇదే పార్టీలో ఉంటే తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని భావించారట. ఇదే కాదు మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఉండవల్లి శ్రీదేవి ఆశించారు. డాక్టర్ అయిన తనకు వైద్య శాఖ ఇస్తారని కూడా అనుకున్నారు. అయితే అవి జరక్కపోవడంతో ఆమ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ అసంతృప్తిలోనే కొన్ని నెలల క్రితం ఆమె పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో ఆమె అది తన గొంతు కాదని అది మార్ఫింగ్ ఆడియో అని వివరణ ఇచ్చారు. కాకపోతే దాన్ని ఎక్కువ కాలం దాచుకోలేకపోయారు. తాజాగా ఆమె అసంతృప్తిని గమనించిన టిడిపి నాయకత్వం ఆమెకు కూడా గేలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికల్లో తాడికొండ నుంచే టికెట్ ఇస్తామని భరోసా ఇవ్వడంతో ఆమె మరో ఆలోచనే లేకుండా క్రాస్ ఓటింగ్ కు సై అన్నారని అంటున్నారు. రాజకీయాలంటేనే చిత్ర విచిత్రంగా విలువల్లేకుండా ఉంటాయి. ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టిడిపి టికెట్ పై గెలిచిన వారిలో నలుగురు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారిలో ఇద్దరు బాహాటంగానూ ఇద్దరు తెరచాటున టిడిపికి అండగా నిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి విజయాన్ని అందించారు. ఇది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠమే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. పార్టీలో ఇంకా ఎందరు అసంతృప్తితో ఉన్నారో తెలుసుకుని వారిని బుజ్జగించడానికి వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకోడానికి కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఇది ఓ మంచి అవకాశమే అంటున్నారు రాజకీయ పండితులు. అదే సమయంలో మొన్న గ్రాడ్యుయేట్స్ స్థానాల్లోనూ ఇపుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయాలు తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ వంటిదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.