రాజకీయమంటే బుకాయించడం కాదు దబాయించడం కాదు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపుని ఆర్కే రోజా లాంటి మంత్రి శునకానందంగా తేలిగ్గా తీసుకునుండొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గెలుపుని కూడా అలాగే తీసుకోగలరా ఏడుకు ఏడు సీట్లు గెలిచి వీలైతే టీడీపీ అభ్యర్థికి ఆ 19 ఓట్లు కూడా పడకుండా చేయాలనుకుంది వైసీపీ. కానీ టీడీపీ కొట్టిన దెబ్బకి ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. చంద్రబాబు నేర్పరితనంపై సజ్జల వ్యంగ్యంగా వ్యాఖ్యానించినా సొంతపార్టీలోనే నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిని ఇంకా దాచిపెట్టటం కష్టమే.
నలుగురు ఫిరాయించగా టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలు 19. ఒకవేళ వైసీపీలో తిరుగుబాటు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేసినా టీడీపీ 21 అంకెదగ్గరే ఆగిపోతుందని వైసీపీ అంచనావేసింది. విజయానికి కావాల్సిన 22వ ఓటు ఎట్టి పరిస్థితుల్లో పడదనుకుంది. కానీ 23 ఓట్లతో సంచలన విజయం సాధించి అధికారపార్టీకి పంచుమర్తి అనురాధ షాక్ ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరూ ఎవరన్నదానిపై వైసీపీలో పోస్ట్‌మార్టం మొదలైంది. వాళ్లెవరో తెలిసిపోయిందని వైసీపీనుంచే లీకులొచ్చాయి. ఆ ఇద్దరెవరో టీడీపీకి తెలుసు వైసీపీ ఎమ్మెల్యేల్లోనే కొందరిపై అపనమ్మకంతో పెట్టుకున్న కోడ్‌తో వాళ్లెవరో కనిపెట్టే పనిలో ఉంది వైసీపీ.
వైసీపీ నిలబెట్టిన ఏడుగురిలో ఐదుగురు మొదటి ప్రాధాన్యతలోనే 22 ఓట్లతో గెలిచేశారు. వారికి కేటాయించిన ఎమ్మెల్యేలంతా పార్టీ ఆదేశాల్ని శిరసావహించినట్లే. 21 ఓట్లే వచ్చిన ఇద్దరిలో రెండో ప్రాధాన్యత ఓట్లతో జయమంగళం వెంకటరమణ గెలిచారు. కోలా గురువులు ఓడిపోయారు. ఈ ఇద్దరికీ కేటాయించిన ఎమ్మెల్యేల నుంచే క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ నిర్థారణకు వచ్చింది. వైసీపీలో తుఫాన్ రేపుతున్న నెల్లూరు జిల్లానుంచే మరో ఎమ్మెల్యే తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి క్రాస్ ఓటింగ్‌కి పాల్పడినట్లు పార్టీ అనుమానిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని జగన్ ముందే చెప్పేయటంతో కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు మేకపాటి.
తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినట్లు అనుమానిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే ఆ నియోజకవర్గంలో ఒకరికి ఇద్దరు సమన్వయకర్తలను వైసీపీ అధిష్ఠానం నియమించింది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ అనుమానమేనన్న సంకేతాలు ఉన్నాయి దీంతో శ్రీదేవిని కూడా వైసీపీ అనుమానిస్తోంది. అమ్మతోడు అని ఆ ఎమ్మెల్యే చెబుతున్నా అనుమానంగానే చూస్తోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పైనా పార్టీకి అనుమానాలున్నాయి యాక్షన్ ఉంటుందని పార్టీ సలహాదారు చెబుతున్నా వైసీపీకి ఈ ఓటమి సవాలుగానే ఉంది. సర్వేలు ఫీడ్‌బ్యాక్‌తో ఎమ్మెల్యేలకు మార్కులేస్తున్న జగన్ అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి మందు వెతక్కపోతే ఎన్నికలనాటికి అది అగ్నిపర్వతంలా బద్దలవ్వొచ్చు.