పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దాగుడుమూతలాడుతోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజీధోరణి ప్రదర్శిస్తోంది. సమస్యలు వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈపాటికి పూర్తికావాల్సిన ప్రాజెక్ట్ ఇంకా అసంపూర్తిగా ఎందుకుందో ఆరోవంతు పరిహారం పునరావాసం కూడా ఎందుకు పూర్తికాలేదో చెప్పలేకపోతోంది. తాజాగా పార్లమెంట్‌లో పోలవరంపై కేంద్రం ప్రకటనతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు మరింత గందరగోళంలో పడింది. తొలిదశలో పోలవరం 41.15 మీటర్లకే పరిమితమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది.
వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి సమాధానం పోలవరంపై అయోమయాన్ని మరింత పెంచింది. తొలిదశ పరిహారం పునరావాసం ఈఏడాది ఫిబ్రవరికే పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంకా జరగలేదన్నది కేంద్రం వివరణ. ముఖ్యమంత్రి పర్యటనలు విన్నపాలను ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు కేంద్రం. పోలవరం అంచనావ్యయం కేంద్రం ఎంత భరించాలన్నదానిపై ఇప్పటికీ అదే గందరగోళం. చివరికి పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 92 టీఎంసీల నీటినే నిల్వ చేస్తారన్న ఇరిగేషన్ నిపుణులు రైతుల ఆందోళనే నిజమయ్యేలా ఉంది.
92 టీఎంసీలకే పరిమితమైతే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కాకుండా మినీ రిజర్వాయరుగా మిగిలిపోవడం ఖాయం. మిగిలిన నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాసం అందించాలంటే కేంద్రం నిధులివ్వాలి. కానీ కేంద్రం చావుకబురు చల్లగా చెప్పటమే తప్ప రూపాయి తీయడం లేదు. రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడంలేదు. వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ రిపేర్లు పూర్తిచేసి తొలిదశతోనే ఈ ఏడాది డిసెంబరులో ప్రాజెక్ట్ ప్రారంభించేయాలన్నది జగన్ టార్గెట్‌గా కనిపిస్తోంది. కానీ నీటి నిల్వలో రాజీపడితే అది దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రమాదం. చంద్రబాబు ఏం చేశారో చర్చించుకోవడం వల్ల ఫలితంలేదు ఇప్పటికీ స్థిరమైన రాజధానిలేని ఏపీలో పోలవరం కూడా ప్రశ్నార్థకమైతే భావితరాలు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.