దేశంలో రాజకీయ నేతలు చేసిన నిజమైన నేరాలకు శిక్షలు పడటం అరుదు. విపక్ష నేతలకు అయితేనే శిక్షలు పడుతున్నాయి. అధికారపక్ష నేతల వైపు కనీసం దర్యాప్తు సంస్థలు కూడా దృష్టి సారించవు. ఇప్పుడు మరో విచిత్రమైన పరిస్థితి వస్తోంది. ఆషామాషీ నేరాలకు కూడా విపక్ష నేతలకు అనర్హతా వేటు వేసేంత శిక్షలు పడుతున్నాయి. వాళ్లకీ వీళ్లకీ ఎందుకు అనుకున్నారేమో నేరుగా రాహుల్ కే శిక్ష పడిపోయింది అదీ కూడా అనర్హతా వేటు వేసేంత. రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీని విమర్శించినందుకు దాఖలైన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.
2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ నిరవ్ మోదీ లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి మోదీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనని విమర్శించారు ఇది బీజేపీ నేతలకు కోపం తెప్పించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ రాహుల్ గాందీపై కేసు పెట్టారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీసిందని ఆయన కోర్టుకు వెళ్లారు దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. మోదీ ఇంటిపేరు ఉన్న వారందర్నీ రాహుల్ కించపర్చలేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. మోదీ ఇంటి పేర్లు ఉండి పరారీలో ఉన్న నిరవ్ మోదీ లలిత్ మోదీల గురించే ప్రస్తావించారని ప్రధాని మోదీపై రాజకీయ విమర్శలు చేశారని చెబుతున్నారు అయితే కోర్టు మాత్రం అలా అనుకోలేదు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఆయనపై అనర్హతా వేటు వేస్తామని బెదిరంపులుకూడా షురూ అయ్యాయి. అప్పీల్ చేసుకోవడానికి నెల రోజులు సమయం ఇచ్చారు. కానీ ఇలాంటి శిక్ష మాత్రం ఎవరూ ఉహించనిది.
రాజకీయం అన్న తర్వాత నేతలు అనేక మాటలు అనుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే బూతులు తిట్టుకుంటూ ఉంటారు అసందర్భ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఏం జరిగినా ప్రత్యర్థులకు అంటించడమే రాజకీయం అనేలా మారిపోయింది. చాలా మంది పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు విచారణలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి కానీ కానీ ఇంత వరకూ ఎవరికీ శిక్షలు పడలేదు. నిజానికి పరువు నష్టం కేసుల్లో ఇంత కఠినమైన శిక్షలు వేస్తారని ఎవరూ అనుకోరు. కానీ సూరత్ కోర్టు రాహుల్ గాంధీని ఇలాగే వదిలేస్తే అంతకు మించిన మాటలంటారని ఊహించింది. మొత్తానికి రాహుల్ గాంధీపై విధించిన శిక్ష మాత్రం దేశ రాజకీయ పరిస్థితులపై భిన్నమైన వాతావరణాన్ని కల్పించింది ఈ మాటలకే రెండేళ్ల జైలు శిక్ష వేస్తే రాజకీయ నాయకులందరికీ శిక్షలు పడాల్సిందేనని సెటైర్లు వినిపిస్తున్నాయి.
రాహుల్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సమయంలో మేజిస్ట్రేట్ హెచ్.హెచ్. వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. ఆయన ప్రధానంగా మూడు వ్యాఖ్యలు చేశారు ఒకటి: సుప్రీంకోర్టు హితవు చెప్పినప్పటికీ రాహుల్ ప్రవర్తనలో మార్పు లేదు. రెండు: నిందితుడు పార్లమెంటు సభ్యుడు కనక ఆయన ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆ హోదాలోనే మాట్లాడతారు కనక ఆ ప్రభావం ప్రజల మీద ఉంటుంది. అందువల్ల ఆయన ఇతరులను అవమానించేలా మాట్లాడితే ఆ ప్రభావం నిశ్చితంగా ఉంటుంది. మూడు: ఇలాంటి పలుకుబడి గల వ్యక్తులకు తక్కువ మోతాదు శిక్ష విధిస్తే సమాజానికి తప్పుడు సందేశం అందుతుంది అన్నారు. ఈ కేసులో కోర్టు కేవలం 20 నిమిషాలలోనే విచారణ పూర్తి చేసి రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధించేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. సత్వర న్యాయం అంటే ఇదే కాబోలు కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది ఇది పరువునష్టం కేసు. ఇలాంటి కేసుల్లో అత్యధికంగా రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించవచ్చు. విచారణ జరిపిన న్యాయమూర్తి అత్యధిక శిక్ష విధించారు అంతకన్నా ఎక్కువ శిక్ష విధించడానికి ఆయనకు అవకాశం లేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుతానికి తప్పు పట్టలేం ఆ తీర్పులోని ఉచితానుచితాలపై పైకోర్టులో మాత్రమే తేలాల్సి ఉంది.
రాహుల్‌కు కోర్టు శిక్ష విధించిన అంశంపై శుక్రవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్‌గాంధీకి ఆప్‌తోపాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. పరువు నష్టం దావా అంటే బీజేపీయేతర పార్టీలు నేతలు ఉండకూడదన్న కుట్రలో భాగమేనని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మాకు కాంగ్రెస్‌తో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇలా రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం సరికాదు. ప్రశ్నించడం ప్రజలు ప్రతిపక్షాల హక్కు కోర్టును గౌరవిస్తాం కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అని ట్వీట్ చేశారు. జార్ఖండ్ తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా రాహుల్‌కు సంఘీభావం తెలిపారు. మొత్తంగా రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో విధించిన శిక్ష ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణం అవుతోంది.