భారతీయులు పుట్టుకతోనే కులాన్ని పెనవేసుకుంటారు. చాలామందికి పేరులోనే కులం తెలిసిపోతుంది. పెళ్లయినా పండుగయినా కులమే ప్రాతిపదికగా జరగాల్సిందేననడంలో సందేహం లేదు. రాజకీయాలైనా అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలుగా మన నేతలు ఎంతో లాఘవంగా కుల రాజకీయాలు చేస్తూ అధికార పీఠాన్ని పదిల పరుచుకుంటున్నారు. ఎక్కువ కాలం అధికారంలో ఉన్నదీ రెడ్డీ కమ్మ కులాలే అయినా బీసీ ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతూ వారిని ఆకట్టుకోగలుతున్నారు. కులాల భావోద్వేగాలను తమ రాజకీయ అస్త్రాలుగా మలుచుకుని పదవుల్లో ఉండగలుగుతున్నారు. కుల సమీకరణాలు కుల పోలరైజేషన్ లేనిదే రాజకీయాల్లో మనుగడ సాధించలేమని నేతలు ఎప్పుడో గుర్తించారు. ఆ పరిస్థితి తెచ్చినది కూడా వాళ్లే కదా. వ్యక్తిగత ఛరిస్మా పార్టీ విధానాలతో అధికారినికి వచ్చినా అందుకు మార్గం మాత్రం కులంతోనే ఉందని నేతలు విశ్వసిస్తున్నారు. కోనసీమను అంబేద్కర్ జిల్లాగా మార్చాలన్న సంకల్పంలోనూ దళిత కుల సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశం ఉందని ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకున్న అంశం. కుల దావానలంలో కొందరు దహించుకుపోతే మరికొందరు హాయిగా చలి కాచుకుంటూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కులాన్ని రెచ్చగొట్టడంలో జగన్ చంద్రబాబు ఇద్దరూ సమానమేనన్న చర్చ చాలా రోజులుగా ఉంది. టీడీపీ మొదటి నుంచి బీసీల పార్టీయేనని చంద్రబాబు చెప్పుకుంటుంటే బీసీలకు ఎక్కువ స్థానాలు ఎస్సీ-ఎస్టీలకు సముచిత స్థానం ఇచ్చిందీ తామేనని జగన్ పార్టీ బాకా ఊదుకుంటోంది. చంద్రబాబు సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలను అధికారులను అడ్డదిడ్డంగా దూషించడానికి జగన్ వెనుకాడటం లేదు. చంద్రబాబు మాత్రం కుల దూషణకు దిగిన దాఖలాలు లేవు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని దేశం అధినేత చెప్పుకుంటారు. ఎన్టీఆర్ పుట్టడానికి కమ్మ అయినప్పటికీ ఒకరకంగా ఆయన బడుగుజన బాంధవుడు. అప్పట్లో రెడ్ల పెత్తనం ఎక్కు వగా ఉండటం ముఖ్యంగా సీమాంధ్రాలో కరణీకరణం వల్ల తెలంగాణాలో పటేల్-పట్వారీ వ్యవస్థల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారు బిసిలే. ఎన్టీఆర్ బీసీలకు ఎక్కువగా టికెట్లు ఇవ్వడంతో బీసీలు తెలుగుదేశాన్ని సొంతం అనుకున్నారు. తెలుగుదేశంలో అప్పటి పునాదుల వల్లే ఎన్ని సంక్షోభాలు వచ్చినా చెక్కుచెదరకుండా ఉంది. సామూహికంగా ఉన్నత స్ధానాలకు ఎదిగిన ఎంతో మంది ఆ పార్టీలో ఉన్నారు. ఎర్రన్నాయుడు యనమల రామకృష్ణుడు కెఇ కృష్ణమూర్తి కళావెంకట్రావు దేవేందర్‌గౌడ్ అల్లాడి రాజ్‌కుమార్ శ్రీనివాసయాదవ్ దాడి వీరభద్రరావు తమ్మినేని సీతారాం లాంటి ఎందరికో రాజకీయ జన్మ ఇచ్చిన ఇస్తున్నందువల్లే తెలుగుదేశం బిసిల పార్టీగా పుట్టి పెరిగి బలపడింది. ఇక ఇప్పుడు మూడో ఆటగాడు క్రీడామైదానంలోకి దిగి చాలా రోజులైంది. తాను కాపు కులస్థుడినే అయినా అన్ని కులాలు ఆదరిస్తేనే రాజకీయాల్లో రాణించగలనని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. కాకపోతే కాపులు ఎక్కువగా పవర్ స్టార్ ను ఓన్ చేసుకోవడం బహిరంగ రహస్యమేనని చెప్పాలి. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత చాలా మంది కాపులు ఆయన వైపు వెళ్లారు. ప్రధాన పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న ఇతర కులాల వాళ్లు కూడా ఆయన వైపు మొగ్గుచూపారు. ఎన్నికల్లో 18 స్థానాలు మాత్రమే గెలిచిన ప్రజారాజ్యం క్రమంగా అంతర్థానమైంది. ప్రజారాజ్యంలో యువరాజ్యం నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ తర్వాత ఆలోచించి జనసేనను స్థాపించారు.
నిజానికి రాష్ట్రంలో బీసీలకంటూ ఒక పార్టీ లేకుండా పోయింది. ఏదోక పార్టీలో ఉంటూ బీసీ నాయకులు తమ సామాజిక వర్గాల ప్రయోజనానికి పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో పార్టీ ప్రయోజనాలకు సామాజిక వర్గాల ఆకాంక్షలకు మధ్య జరిగిన సంఘర్షణలో బీసీ వర్గాల నాయకులు మౌన ప్రేక్షకులయ్యారు. ఎస్సీ ఎస్టీ నాయకుల పరిస్థితి కూడా దాదాపుగా అదేనని చెప్పాలి. జనాభా దామాషాకు సంబంధం లేకుండా వారికిచ్చిన ఒకటి రెండు పదవులతో సరిపెట్టుకుని దళిత గిరిజన నాయకులు పెద్ద పార్టీల్లో సర్దుకుపోయారు. సొంతంగా పార్టీలు పెట్టిన దళిత నాయుకులు ప్రజాదరణ లేక పత్తాలేకుండా పోయారు. మాజీ న్యాయాధికారి జడ శ్రవణ్ ఇప్పుడో దళిత పార్టీ ప్రారంభించారు. ఆయన బలమెంతో నిరూపితం కావాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే. 2024 ఎన్నికల్లో కులం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అధికార పీఠంపై కూర్చునేందుకు రెడ్డి వర్సెస్ కమ్మగా కులం లెక్క చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప చంద్రబాబు లేదా జగన్ మాత్రమే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశాలు ఉన్నాయి. ఈసారి తనకు సీఎం అయ్యే అవకాశాలు లేవని పవన్ కళ్యాణ్ స్వయంగా అంగీకరించారు. ఎన్నికల్లో రెండు రాజ్యాధికార కులాలు పోటీ పడినట్లే కనిపించినా వారిని గెలిపించేది మాత్రం కుల సమీకరణాలేనని చెప్పుకోకతప్పదు. కాపులు బలిజలు తెలగలు తూర్పు కాపులు యాదవులు పద్మశాలీలు గంగపుత్రులు రజక నాయీ బ్రాహ్మణ వడ్డెర వాల్మీకి బోయ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కాళింగ దళిత సామాజిక వర్గాల వారు ఆయా ప్రాంతాలను బట్టి గెలుపోటములను నిర్దేశిస్తుంటారు.
ఉత్తరాంధ్రలో తూర్పు కాపు కాళింగ లాంటి బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు తూర్పు కాపులదే డామినేషన్. సంఖ్యా పరంగా వాళ్లు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ రాజ్యాధికారంలోనూ పదవుల్లోనూ మాత్రం బాగా వెనుకబడిపోయారనే చెప్పాలి. ప్రస్తుతం జనసేనను తూర్పు కాపులు తమ పార్టీగా లెక్కగడుతున్నారు. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తూర్పు కాపులు టీడీపీకి ఓటేసి జనసేనకు పరోక్షంగా ఊతమిచ్చారు. ఇక కాళింగ కులస్థులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. కాళింగ కింతలి కాళింగ బోరగాన కాళింగ ఇలా చెప్పుకుంటూ పోతే ఉపకులాలన్నీ కలిపి రెండు లక్షల ఓట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీల జనాభా ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ కోనసీమ ప్రాంతంలో వారు సంఖ్యాపరంగా డామినేట్ చేస్తున్నారు. అందుకే జగన్ వారిని బుట్టలో వేసుకునేందుకు అమలాపురం కేంద్రంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక్క చోటే ఎస్సీల జనాభా ఐదు లక్షలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతీ చోట 10 నుంచి 15 శాతం ఎస్సీ జనాభా ఉంటుంది. గ్రామీణ జనాభాలో ఎస్సీలే ఎక్కువగా ఉంటారు. వారందరినీ ఏకమొత్తంగా తనవైపుకు తిప్పుకునేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. క్యాస్ట్ పోలరైజేషన్‌లో ఎస్సీ ఓటర్లు తమవైపున ఉంటే ప్రతీ నియోజకవర్గంలోనూ విజయావకాశాలుు పెరుగుతాయని జగన్ ఆశపడుతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల జనాభా చాలా ఎక్కువ. జయాపజయాలను నిర్ణయించే సంఖ్య ఉన్నప్పటికీ కాపుల్లో ఐక్యత లేక వాళ్లు రాజ్యాధికారానికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు ఒకరిద్దరూ మంత్రులుగా కూడా సేవలందిస్తున్నారు. గోదావరి జిల్లాల కాపులు సంపన్న కుటుంబాలుగా కనిపించినా అధికపక్షం జనాభా దిగువ మధ్య తరగతిలోనే మగ్గుతున్నారు. అందుకే కాపులను బీసీలుగా ప్రకటించాలన్న డిమాండ్ తో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకసారి ఓబీసీల జాబితాలో చేర్చినా ఆ నిర్ణయం వాయిదా పడింది ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కూడా కాపుల సంఖ్య బాగానే ఉందని చెప్పాలి. ఏపీలో కాపుల జనాభా 15 శాతం వరకు ఉంటుంది. వారితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజులు ఎక్కువ వారు జనాభా పరంగా కంటే సంపద పరంగా డామినేట్ చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కమ్మ కులస్థులు ఎక్కువగా కనిపిస్తారు. జనాభా పరంగా మాత్రమే కాకుండా సంపద పరంగానూ వారిదే డామినేషన్ అని చెప్పాలి. రాష్ట్రంలో ఐదు శాతం వరకు వారి జనాభా ఉన్నప్పటికీ ప్రధాన సామాజికవర్గంగా వాళ్లు కనిపిస్తారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారి ప్రాబల్యం బాగా పెరిగింది. నెల్లూరు చిత్తూరు జిల్లాల్లోనూ కమ్మ సామాజికవర్గం వాళ్లు అక్కడక్కడా కనిపిస్తారు. గుంటూరు ప్రకాశం జిల్లాలోనే తెలగ సామాజికవర్గం వారూ అక్కడక్కడా ఉంటారు. వారిని కాపులు బలిజలతో సమానంగా పరిగణిస్తారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా రెడ్డి సామాజికవర్గం వాళ్లు కనిపించినా నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు. రెడ్లు మోతుబర్లు సంపన్నులు వ్యాపార రాజకీయ రంగాల్లో రాణించిన వాళ్లు. అందుకే సింహపురిలో వారిని నెల్లూరు పెద్దారెడ్లు అని కూడా పిలుస్తారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారిలో రెడ్డి సామాజికవర్గం వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి సామాజిక వర్గం జనాభా ఆరు నుంచి ఏడు శాతం వరకు ఉంటుంది. బలిజ శెట్టి బలిజ సామాజికవర్గాల వాళ్లు ఇప్పుడు నెల్లూరు చిత్తూరు ఇతర రాయలసీమ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తారు. వారు కూడా రాజకీయంగా ఎదుగుదలకు నోచుకోలేదు. కాపులతో సమానమైన సామాజికవర్గంగా వాళ్లు రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలిజ సామాజికవర్గం క్రమంగా జనసేన వైపుకు కదులుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ కులస్థులు కోరుకుంటున్నారు. బలిజ శెట్టి బలిజ కలిసి నాలుగు శాతం వరకు జనాభా ఉంటుంది.
బ్రాహ్మణ సామాజికవర్గం వారు మూడు శాతం వరకు ఉండగా వైశ్య కులస్థులు కూడా అంతే స్థాయిలో ఉంటారు. వెలమల పరిస్థితి కూడా అంతేనని చెప్పాలి. కాకపోతే ఈ మూడు కులాలు ఎక్కడా డామినేషన్ లేదు. స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మూడు సామాజిక వర్గాలు పట్టణ ప్రాంత కులాలుగా స్థిరపడిపోయాయి. జయాపజయాలను ప్రభావితం చేయలేకపోతున్నాయి. ఈసారి మాత్రం ఏ పార్టీ గెలవాలన్నా మాయావతి స్టైల్ లో సోషల్ ఇంజినీరింగ్ చేయక తప్పదనిపిస్తోంది. ఒక డామినెంట్ సామాజికవర్గం మరో రెండు మూడు చిన్న కులాలకు తగిన ప్రాధాన్యమిస్తూ సీట్ల బట్వాడా చేయగలిగితే ఇతర పార్టీలను వెనక్కి నెట్టి విజయం సాధించడం ఖాయమని చెప్పక తప్పదు. అందులో ఒకటైనా అగ్రకులమై ఉండాల్సిందే. మరి పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయో లేదో తేలీదు.