వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఎప్పుడో ధిక్కారస్వరం వినిపించారు. జగన్‌పై పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డిబేట్లలో గంటల తరబడి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ విచిత్రంగా ఆయనింకా ఆ పార్టీ ఎంపీగానే ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ సీటు చేజారటంతో నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసింది వైసీపీ. వారిలో ఇద్దరు ఆ ఎన్నికకు ముందే ధిక్కారస్వరం వినిపించారు. వారి నియోజకవర్గాల్లో పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంది. మిగిలిన ఇద్దరిపై మాత్రం కేవలం క్రాస్ ఓటింగ్ కారణంతో వేటుపడింది. మొత్తం నలుగురిపై చర్యకు అదే కారణం చూపించింది వైసీపీ. పదిహేను నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి ఈ సమయంలో వేటుపడటంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు బంధనాలు తెంచుకున్నట్లు ఫీలవుతున్నారు. ఒక్క తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన రియాక్షన్ బయటపెట్టలేదుగానీ మిగతా ముగ్గురూ హమ్మయ్య అన్నంత రిలీఫ్ అయ్యారు. వైసీపీ వేటు వేయటంతో వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ వ్యూహంపై ఓ నిర్ణయం తీసుకోవడానికి వాళ్లకు కావాల్సినంత టైం దొరికింది.
ఆనం రామనారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇద్దరూ ఇప్పటికే టీడీపీనుంచి పోటీకి ఫిక్సయ్యారు. ఈ సస్పెన్షన్ తతంగం జరుగుతున్నప్పుడే కోటంరెడ్డి సోదరుడు మందీమార్బలంతో వెళ్లి టీడీపీలో చేరిపోయారు. వైసీపీ వేటువేసిన నలుగురిలో ముగ్గురు నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలే ముగ్గురిదీ రెడ్డి సామాజికవర్గమే. వారిలో ఆనం మేకపాటి రాజకీయంగా బలమైన కుటుంబాలకు చెందినవారు. ఇక కోటంరెడ్డి ఆనం కుటుంబంతో తలపడుతూ రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్నవారే. శ్రీదేవి ఒక్కరే తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా పార్టీలోనే అసమ్మతితో ఆమె కూడా రాటుదేలారు అందుకే వైసీపీ వేటు వేసినా ఎవరూ దిగులుపడటం లేదు మేం కోరుకుంది కూడా అదే అన్నట్లు ఉన్నారు. మేకపాటి అయితే జగన్‌కి మర్యాద తెలీదన్నట్లు మాట్లాడారు. ఈరోజునుంచి హాయిగా నా పని నేను చేసుకుంటానంటూ రిలాక్స్ అయిపోయారు. కోటంరెడ్డి ఆనం పసుపు కండువా కప్పుకోడానికి ఇప్పుడిక ముహూర్తం చూసుకునేలా ఉన్నారు. మొన్నటిదాకా వైసీపీకోసం అమరావతి ప్రాంత రైతులతో అంటీముట్టనట్లు ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు గొంతు మార్చేశారు టీడీపీ వాయిస్ ఎత్తుకున్నారు. సుడి అంటే టీడీపీదే ఎమ్మెల్సీ సీటుకు తోడు తమతో గొంతు కలపడానికి మరో నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ బోనస్‌గా ఇచ్చినట్లయింది. నైంటీన్ ప్లస్ ఫోర్ 2019లో గెలిచిన సంఖ్యలో ఎమ్మెల్యేలున్నట్లే.