అసెంబ్లీలో వేయడమెందుకు.. చేతికి బేడీలేయక

By KTV Telugu On 25 March, 2023
image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి జీర్ణం కాకముందే ఎమ్మెల్యేల సాక్షిగా మరో అసెంబ్లీలో మరో ఎమ్మెల్సీ సీటు జారిపోయింది. ఇంకేముందీ వైసీపీ పనైపోయిందనీ ఆ పార్టీ పతనానికి ఇవి సంకేతాలన్న ప్రచారం మొదలైంది. చంద్రబాబు అయితే పాతికేళ్ల వయసు తగ్గినంత ఉత్సాహంగా ఉన్నారు. వైసీపీలో పోస్ట్‌మార్టం జరుగుతోంది నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసేదాకా వెళ్లింది అందరి చర్చా ఎమ్మెల్సీ ఎన్నికలమీదే. ఈ సమయంలోనే అసెంబ్లీలో చంద్రబాబు అవినీతిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. అమరావతిలో అసెంబ్లీ సెక్రటేరియట్‌ హైకోర్టు భవన నిర్మాణాల్లో దోపిడీ జరిగిందన్నది ఆ ప్రజంటేషన్‌ సారాంశం. బోగస్‌ కంపెనీలు సృష్టించి కాంట్రాక్టు సంస్థలను బెదిరించి కోట్లు దండుకున్నారని వీడియోలు గ్రాఫిక్స్‌ డేటాతో కళ్లకు కట్టింది ప్రభుత్వం.

అమరావతి స్కామ్‌ని వైసీపీ ప్రభుత్వమేం కొత్తగా కనిపెట్టలేదు. ఐటీ అధికారుల దాడుల్లో ఈ బండారం బయటపడిందంటోంది జగన్‌ ప్రభుత్వం. అందుకే ఐటీ చంద్రబాబుకు నోటీసులిచ్చిందన్నది కన్‌క్లూజన్‌. అందులో అవినీతి జరిగిందో లేదో జరిగితే దోషులెవరో పన్ను ఎగవేత సంగతేంటో ఐటీ చూసుకుంటుంది. షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన స్టేట్మెంట్‌ని పట్టుకుని చంద్రబాబుమీద ఆరోపణలు చేయడంలో వైసీపీ ప్రభుత్వ ఔచిత్యమేమోగానీ టైం రాంగ్‌ అన్నది మాత్రం కరెక్ట్‌. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉక్రోషంతోనే వైసీపీ ప్రభుత్వం ఇదంతా తవ్వుతోందని అంతా భావించే ప్రమాదం ఉంది. షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి ఇంట్లో ఐటీ సోదాలు జరిగి మూడున్నరేళ్లు కావస్తోంది. ఆర్నెల్లలోపే చంద్రబాబు పీఏ ఇంట్లో సోదాలు జరిగాయి. లభించిన ఆధారాలతో అప్రైజల్‌ రిపోర్ట్‌ తయారుచేసిన ఐటీశాఖ ఇప్పుడు నోటీసులు పంపింది.

ఐటీ దాడులు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం కొండని తవ్వి ఎలుకని పట్టినట్లే ఉంటుంది. తెలంగాణలో మంత్రులు గంగుల కమలాకర్‌ మల్లారెడ్డి ఇళ్లు ఆఫీసుల్లో సోదాలతో హడావుడిచేశాక ఇప్పుడు చడీచప్పుడు లేదు. అమరావతి రాజధానే కాదంటోంది వైసీపీ కేవలం శాసనరాజధానికే పరిమితం చేసింది ఇప్పుడక్కడ ఎప్పుడో అవినీతి జరిగిందంటూ పాత లెక్కలు విప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏ లిక్కర్‌ స్కామ్‌లాంటిదో అయితే ఈపాటికి బేడీలేసి ఉండేవాళ్లు. చంద్రబాబునీ రామోజీరావు కొడుకు వియ్యంకుడినీ లాగడం వల్ల వైసీపీ కడుపుమంట కాస్త చల్లారొచ్చేమోగానీ ఇప్పటికిప్పుడు వాళ్లకొచ్చే నష్టమేం ఉండదు. నాలుగేళ్లయినా ఇప్పటిదాకా టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిని నిరూపించి పెద్ద నేతలెవరినీ జైలుకు పంపింది లేదు. ఐటీ అభియోగాలు మోపుతుంది ఆధారాలతో సంతృప్తి పడుతుంటుంది. మధ్యలో తుత్తికొద్దీ మాట్లాడుకోడానికే తప్ప ఇలాంటి అభియోగాలు కోర్టు బోనులదాకా రావన్న సంగతి చంచలగూడ అనుభవం ఉన్న జగన్‌కి తెలియకుండా ఉండదు.