కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వేరే పార్టీల్లో చేరి స్లీపర్ సెల్స్ మాదిరిగా అక్కడ ఏం జరుగుతోందో సైలెంట్ గా గమనిస్తూ ఉంటారు. ఇంకొందరైతే భవిష్యత్ బాగుంటుందన్న ఆశతో పార్టీలు మారతారు కానీ అక్కడ చేయడానికి ఏమీ లేక నిశ్శబ్ధంగా ఉండిపోవలసి వస్తుంది. ఈ రెండు రకాల నేతలూ రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి శాఖల్లోనే ఉండడం విశేషం. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని ధీమాతో ఉన్న బిజెపి కొంత కాలం క్రితం వరకు దూకుడుమీదే ఉండింది. ఆ దూకుడు చూసి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్-బి.ఆర్.ఎస్. పార్టీల నుండి నేతలు బిజెపిలో చేరిపోయారు. చేరడం అయితే చేరారు కానీ ఆ తర్వాత కొత్త పార్టీలోని ఆధిపత్య రాజకీయాలు తట్టుకోలేక చేయడానికి పనేమీ లేక చాలా ఇబ్బందిగా రోజులు నెట్టుకొస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించి జి.హెచ్.ఎం.సీ. ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చాలా మంది నమ్మారు. అలా నమ్మిన వారు తమ తమ పార్టీలకు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిపోయారు. కొద్ది రోజులు బానే ఉన్నట్లు అనిపించినా ఆ తర్వాత నుంచి ఉక్కపోత మొదలైంది.
మునుగోడు ఉప ఎన్నికకు దారి తీసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల ముందు బిజెపిలో చేరారు. బిజెపి టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లో ఉండగా నిత్యం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ వార్తల్లో మెరిసిన రాజగోపాల రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంచుమించు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి బిజెపి గోడ దూకేశారు. అందులో అడుగు పెట్టిన తర్వాత ఏం చేయాలో బోధపడ్డం లేదు. దశాబ్ధాల పాటు కాంగ్రెస్ లో ఊపిరి పీల్చుకున్న శశిధర్ రెడ్డి ఏం ఆశించి బిజెపిలో చేరారో కానీ అక్కడ మాత్రం ఆయన హ్యాపీగా లేరని అంటున్నారు. అంతకు ముందు హుజూరాబాద్ కు చెందిన బి.ఆర్.ఎస్. మంత్రి ఈటల రాజేందర్ బి.ఆర్.ఎస్.కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపి గుర్తుపై హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఈటలకు తగ్గ ప్రాధాన్యత రావడం లేదన్న అసంతృప్తి ఆయనలోనూ ఆయన అనుచరుల్లోనూ కూడా ఉందంటున్నారు.
ఈటల తిరిగి బి.ఆర్.ఎస్.లో చేరతారన్న ప్రచారమూ జరుగుతోంది. బి.ఆర్.ఎస్. కు వెళ్లకపోతే ఆయన కాంగ్రెస్ లో కూడా చేరచ్చంటున్నారు. బిజెపిలో పాత నాయకుల వ్యవహారాలు ఈటలకు నచ్చడం లేదంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ తర్వాత బి.ఆర్.ఎస్. లో కొంతకాలం కాలక్షేపం చేశారు. అక్కడ తనకు తగిన గౌరవం ప్రాధాన్యత దక్కడం లేదని భావించి బిజెపి వాళ్లు తనని చూసి నవ్వగానే మరో ఆలోచన లేకుండా కమలనాథులకు కన్నుగీటారు. అలా బిజెపిలో చేరిపోయారు కానీ ఆ తర్వాత ఆయన పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. పార్టీ తరపున ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. ఇపుడసలు ఆయన బిజెపిలోనే ఉన్నారా లేరా అన్నది కూడా సస్పెన్స్ గానే ఉంది. ఎన్నికలు వచ్చే వరకు సైలెంట్ గానే ఉంటారా లేక మధ్యలో మళ్లీ పార్టీ మారతారా అన్నది చెప్పలేం అంటున్నారు ఆయన అనుచరులు. ఈ నేతలంతా కూడా బిజెపిలో చేరితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వంలో మంచి పదవులు దక్కించుకోవచ్చునన్న ఆశతోనే పార్టీ మారారు.
అయితే పార్టీలో బయటి నుంచి వచ్చిన వలస నేతలను ఒకలా చూస్తున్నారు. మొదట్నుంచీ పార్టీతోనే ఉన్నవారికి ఇంకో రకమైన మర్యాదలు ఉంటున్నాయి. బిజెపిలోకి వచ్చి తప్పు చేశామా అని ఇపుడు వలసనేతలు తమలో తామే తర్జన భర్జనలు అవుతున్నారు. తెలంగాణాలో పరిస్థితి ఇలా ఉంటే ఏపీ బిజెపిలో ఇంకో రకం సమస్య. 2019 ఎన్నికల్లో ఏపీలో టిడిపి ఘోర పరాజయం మూటకట్టుకుంది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపిని ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఏపీ ఎన్నికలకు ముందు 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కూడా పెట్టుకున్నారు చంద్రబాబు. అయితే అది అట్టర్ ఫ్లాప్ అయ్యి బి.ఆర్.ఎస్. ఘన విజయం సాధించింది. కేంద్రంలో అయినా కాంగ్రెస్ వస్తుందని చంద్రబాబు ఆశిస్తే అక్కడ తిరుగులేని మెజారిటీతో నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అయ్యారు. ఈ పరిణామాలను అస్సలు ఊహించలేకపోయిన చంద్రబాబు నాయుడిలో కంగారు మొదలైంది. కేంద్రంలో మళ్లీ బిజెపి రావడంతో బిజెపి ఓటమికి ప్రయత్నించిన తన అవినీతి కేసులపై దర్యాప్తులు మొదలవుతాయని చంద్రబాబు భయపడ్డారు.
అందుకే బిజెపిని ప్రసన్నం చేసుకోడానికి బిజెపి అగ్రనేతలతో టచ్ లోకి వెళ్లారు. అప్పట్లో రాజ్యసభలో బిజెపికి అంతగా బలం లేదు. అందుకే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను అత్తారింటికి సాగనంపినట్లు లాంఛనాలిచ్చి మరీ పంపారు చంద్రబాబు. అలా బిజెపిలో చేరిన చంద్రబాబు విధేయులు సుజనా చౌదరి సి.ఎం.రమేష్, టి.జి.వెంకటేష్ గరికపాటి మోహన్ రావు లు బిజెపి కండువాలు కప్పుకున్నారు. వీరితో పాటు రాయలసీమకు చెందిన ఆదినారాయణ రెడ్డిని కూడా బిజెపిలోకి పంపారు చంద్రబాబు. కాషాయం కొత్త కావడంతో అక్కడ ఏం చేయాలో తెలీదు. ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు నాయుడి వాణినే వినిపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఈ నలుగురు ఎంపీలు. ప్రత్యేకించి సుజనా రమేష్ లు అయితే టిడిపి నేతల్లానే వ్యవహరిస్తున్నారు. చాలా కాలంగా ఈ ఎంపీలు మౌనంగానే ఉన్నారు. ఏం చేయాలో పాలుపోక గోళ్లు గిల్లుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన-బిజెపిలతో కలిసి జట్టు కట్టాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే బిజెపి దానికి ససేమిరా అనేసింది. ఇక బిజెపితో పొత్తు సాధ్యం కాదని తేలడంతో ఇపుడు చంద్రబాబు నాయుడు తన వ్యూహానికి పదును పెడుతున్నట్లు సమాచారం.
తాను పంపిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఆదినారాయణ రెడ్డి బిజెపికి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావులను టిడిపిలో చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి బిజెపిలో అంతో ఇంతో జనాకర్షణ శక్తి ఉన్న నేతలందరినీ ప్రలోభాలతోనైనా సరే టిడిపిలోకి చేర్చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యూహాన్ని బిజెపి ఎలా తిప్పికొడుతుందన్నది ఆసక్తిగా మారింది. చంద్రబాబు మాత్రం ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వాటికి అనుగుణంగా అభిప్రాయాలు సిద్దాంతాలు కూడా మార్చేసుకుంటారు. చంద్రబాబు పిలుపుకు స్పందించే నేతలు బిజెపిలో ఎందరున్నారన్నదే ఇపుడు అక్కడ పెద్ద ప్రశ్న. తెలంగాణా బిజెపిలో చేరిన వివిధ పార్టీల నేతలు ఒకందుకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏపీ బిజెపిలో చంద్రబాబు ఆదేశాల మేరకు చేరిన టిడిపి నేతలు ఇపుడు బిజెపికి ఎలా వెన్నుపోటు పొడవాలా అని ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపిలో చేరిన ఇతర పార్టీల నేతలు బిజెపికి గుదిబండల్లానే ఉన్నారని బిజెపి నాయకత్వం కూడా భావిస్తోంది.