బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరింది. రాహుల్ ప్రస్తావించిన ప్రశ్నల నుంచి దేశం దృష్టిని మళ్లించేందుకు ఆయనపై ఉన్న పరువునష్టం కేసు ఆధారంగా ఆగమేఘాల మీద లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. న్యాయ పరమైన అంశాలు తమ లీగల్ టీమ్ చూసుకుంటుందని ఎంతో హుందాగా ప్రకటించిన రాహుల్ గాంధీ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలని పట్టుబడుతున్నారు. డీఫెన్స్ డీల్స్ లో షెల్ కంపెనీలు అదానీవేనని చెబుతూ అందులోకి ఇరవై వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీస్తున్నారు. అదానీకి మోదికి ఉన్న స్నేహబంధాన్ని పదే పదే ప్రస్తావించిన రాహుల్ అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా కొన్ని ఇచ్చానని ఇంకొన్ని సమర్పిస్తానని చెబుతున్నారు.
రాహుల్ ఇప్పుడు పరిణితి చెందిన నాయకుడు. నాలుగున్నర నెలల పాటు జరిగిన భారత్ జోడో యాత్రతో దేశ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు అర్థం చేసుకున్న నేత. భయమెరుగని నాయకత్వ లక్షణాలు అలవాటు చేసుకున్న ఇందిర మనవడు. అందుకే తాను సోవర్కర్ ను కాదు గాంధీనని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు జనంలోకి వెళితే రాహుల్ కు బ్రహ్మరథం పట్టడం ఖాయం ఎందుకంటే ఆయనకు వేసిన శిక్షలో నెగిటివిటీ ఆయన తీరులో పాజిటివిటీ అందరికీ అర్థమవుతోంది. కేవలం ఒక ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకు గాను ఓ ఎంపీకి రెండేళ్ళ జైలుశిక్ష విధించడం భారతీయ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి. లాలూ కుటుంబం లేదా ఇతర నాయకుల తరహాలో అది అవినీతి కేసు కూడా కాదు కోర్టు తీర్పు ఎలా వున్నప్పటికీ అంతా ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. లోక్‌సభ సచివాలయం రాహుల్ మీద ప్రకటించిన అనర్హత వేటుతోనే ఈ ఘట్టం ముగిసిపోలేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్ళ జైలు శిక్షను అనుభవించిన ప్రజా ప్రతినిధి మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. సూరత్ కోర్టు తీర్పు మీద పైకోర్టులో అప్పీల్ చేయడం వరకే పరిమితమైతే సరిపోదు. మొత్తంగా ఈ కేసును కొట్టివేస్తేనే గానీ వచ్చే ఎన్నికల్లో రాహుల్ పోటీ చేయడానికి వీలు ఉండదు. రాహుల్ మాత్రం ఎక్కడా వెనుకంజవేయలేదు తనపై జీవితకాలం నిషేధం విధించినా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని రాహుల్ చెబుతున్నారు.
రాహుల్ సంధిస్తున్న ప్రశ్నల్లో సహేతుకత ఉంది. ఆయనపై ముప్పేట దాడి చేసి నోరు మూయించాలన్న ప్రయత్నం ఈ సారి ఫలించకపోవచ్చు. పప్పు అని పిలవడం సోషల్ మీడియా గేమ్ తో డామినేట్ చేయాలనుకోవడం లాంటి పప్పులు ఇక ఉడకవు అని బీజేపీ గ్రహించాలి. అదానీవి డొల్ల కంపెనీలని హిండెన్ బర్గ్ నివేదిక ద్వారానే వెల్లడైంది. అదానీ కంపెనీల డైరెక్టర్లు పాల్పడిన మోసాలపై మారుమూల గ్రామాల్లోనూ చర్చ జరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల ఫలితాలపై మోదీ భయపడుతున్నారు. తనకు హ్యాట్రిక్ కొట్టే అవకాశం రాకపోవచ్చన్న అనుమానమూ ఆయనలో ఉంది. ఏదో విధంగా ప్రత్యర్థి పార్టీలను అణగదొక్కితే పోటీ లేకుండా ఉంటుందని మాత్రమే మోదీ బృందం అంచనా వేసుకుంటోంది. రాహుల్ ఇటీవలి కాలంలో అనేక ప్రశ్నలు సంధించారు. వాటిలో ఒక్కదానికి కూడా బీజేపీ సమాధానం చెప్పలేదు. తాజాగా మోదీ అదానీ స్నేహంపై అడిగిన ప్రశ్నకు సైతం పాలకపక్షం నీళ్లు నములుతోంది. దొంగ సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందంటే దేశ ద్రోహిగా ముద్ర వేస్తున్నారు. విదేశాల్లో తిరుగుతూ దేశాన్ని పలుచన చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదు కావాలంటే నిరూపించండి అని రాహుల్ సవాలు చేస్తే సమాధానం లేదు. బీజేపీ నేతలంతా వరుస తిట్ల దండకం అందుకోవడం మినహా చేస్తున్నదేమీ లేదు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ నుంచి పోరాటతత్వాన్ని అలవాటు చేసుకోవాలి. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి. రాహుల్ పై వేసిన అనర్హత వేటును కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. అందుకు రాహుల్ నే స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. బాగా బలహీనమైపోయి కొన్ని చోట్ల ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. పార్టీకి నూతన జవసత్వాలు అందించేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో భవిష్యత్తుపై భరోసా లేక నాయకులు దిశానిర్దేశం చేయక కాంగ్రెస్ కేడర్ కూనారిల్లుతోంది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ జనంలోకి వచ్చినట్లే ఇప్పుడు తనపై పడిన అనర్హత వేటు ద్వారా కూడా ఆయన ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు వెల్లడించాల్సి ఉంటుంది. నాయకుడనేవాడు పార్టీ కేడర్ కు ఒక టానిక్ లా ఉపయోగపడతాడు. కార్యకర్తలపై సమ్మోహనాస్త్రాలు వేస్తేనే వారికది ఉత్సాహమించే అవకాశం ఉంటుంది. నాయుకుడు ముందంటేనే కార్యకర్తలు వెనుక నడుస్తారు. లేని పక్షంలో పార్టీ పరిస్తితి తలలేని మొండెంలా తయారవుతుంది. ఇన్నాళ్లకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సంగతి అర్థం చేసుకున్నదనుకోవాలి. ప్రస్తుత సంకట స్థితిని అవకాశంగా మలుచుకుని నరేంద్ర మోదీ వ్యూహాలను రాహుల్ మంచి కౌంటరే వేయబోతున్నారని ఆశిద్దాం మరింక జనంలోకి వెళితే ఎలా ఉంటుందో చూడాలి.