రాహుల్‌ను ఎదుర్కోలేకనే అనర్హత.. ఈ ప్రశ్నలకు బీజేపీ దగ్గగర ఆన్సర్ ఉందా

By KTV Telugu On 27 March, 2023
image

ప్రత్యర్థుల్ని ఎదుర్కోలేని రాజకీయ నాయకుడు ముఖ్యంగా అధికారంలో ఉన్న వ్యక్తి వారిని ఎలిమినేట్ చేయడాన్నే నియంతృత్వం అంటారు. అది ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం కావొచ్చు భౌతికంగా అంతమొందించడం కావొచ్చు. ప్రస్తుత భారత ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలిమినేట్ చేయడం వరకు వచ్చిందని అనుకోవచ్చు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు విషయంలో అది నిజమైంది. పైగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీ ఒక్కరే కాదని చాల మంది అనర్హతా వేటుకు గురయ్యారని చెబుతున్నారు. కానీ అసలు రాహుల్ చేసిన నేరం అంత పెద్దదా అని ఆలోచిస్తేనే బీజేపీ కుట్ర బుద్ది బయటపడిపోతుందని అర్థం చేసుకోవచ్చు.

కొద్ది రోజుల కిందట విక్రం సింగ్ సైనీ అనే బీజేపీ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు పడింది ఆయన యూపీకి చెందిన వారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై వేటు వేశాం అని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సైనీ చేసిన నేరం. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో దోషిగా తేలాడు. ఆ నేరానికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఆ కారణంగా ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయింది మరి రాహుల్ చేసిన నేరం ఏమిటి రాజకీయ విమర్శలు. అల్లర్లకు పాల్పడటం రాజకీయ విమర్శలు చేయడం ఒకటేనా సాంకేతికంగా ఎవరికి శిక్ష పడినా చట్టసభల సభ్యత్వానికి అనర్హులే అందులో ఎలాంటి చర్చ అక్కరలేదు. కానీ నైతికంగా వీరిద్దరినీ ఒకే గాడిన కట్టేయవచ్చా దేశం కోసమో రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థ లోని లోపాల వలనో శిక్ష పడిన వారిని దొంగతనం చేసో మానభంగాలు చేసో శిక్ష పడినవారిని ఒకే గాడిన కట్టేయవచ్చా ఈ అంశం ప్రజలే నిర్ణయించాల్సి ఉంది.

అసలు రాహుల్‌పై అనర్హతా వేటు ఎందుకు పడిందంటే చాలా మంది మొదటగా అదానీని గుర్తు చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ కూడా అదే చెబుతున్నారు. అదానీ గురించి మాట్లాడుతున్నందుకే అనర్హతా వేటు వేశారని అంటున్నారు. దేశ ప్రజలు కూడా ఎక్కువగా దీన్ని నమ్ముతున్నారు. దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. హిండెన్ బర్గ్ మొదట రిపోర్టు వచ్చింది జనవరి ఇరవై నాలుగో తేదీన. అప్పటి నుంచి రాహుల్ గాంధి ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ నిలదీస్తున్నారు. దేశవ్యాప్తంగా అదానీ అంశం హైలెట్ అవుతోంది.

గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ వేసిన కేసులో మొదట విచారణ జడ్జి పేరు A.N. దవే. ఈ కేసులో రాహుల్ గాంధీ 2021 జూన్ 24వ తేదీన తన స్టేట్మెంట్ ని కోర్టుకు సమర్పించారు. 2022 లో రాహుల్ ని మరోసారి వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపించమని పూర్ణేష్ మోడీ జడ్జి దవేను అభ్యర్ధించారు. జడ్జి అనుమతిని ఇవ్వలేదు ఆ తర్వాత సూరత్ కోర్టులో కేసు విచారణను ఆపే ఆదేశాలు ఇవ్వమని పూర్ణేష్ మోడీ హైకోర్టుకు 2022 మార్చి ఏడో తేదీన పిటిషన్ వేశారు. సూరత్ కోర్టులో విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎవరయితే కేసు వేశారో ఆయనే విచారణ నిలిపివేయాలని అడిగారు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే 2023 ప్రారంభంలో ఈ కేసును విచారిస్తున్న జడ్జి దవే ను బదిలీ చేసిన తర్వాత మళ్లీ విచారణపై స్టే ఎత్తి వేయాలని పూర్ణేష్ మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది తేదీలను.

హిండేన్ బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ అదానీ మోదీ బంధాన్ని టార్గెట్ చేసిన తర్వాతనే వ్యూహాత్మకంగా జడ్జిని బదిలీ చేసిన తర్వాత మళ్లీ విచారణ కొనసాగించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. హిండెన్ బర్గ్ ఆదానీ రచ్చ ప్రారంభమయ్యాక రాహుల్ కేసు విచారణ పునఃప్రారంభించారు. సూరత్ కోర్టులో జడ్జి దవే స్థానంలో H.H. వర్మ అనే జడ్జిని నియమించారు. ఈ నియామకం కూడా హిండెన్ బర్గ్ ఆదానీ రాహుల్ రచ్చ మొదలయ్యాకనే. కొత్త జడ్జి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద విచారణ జరిపి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఇదంతా హిండెన్ బర్గ్ రిపోర్టుకు ఆదానీకి రాహుల్ రచ్చకు రాహుల్ తీర్పుకు రాహుల్ లోకసభ సభ్యత్వం రద్దుకు లింకు ఉందని సులువుగా అర్థమయ్యేలా చేస్తుంది. దీన్ని బీజేపీ నేతలు ఎలా కాదనగలరు.

రాహుల్ కుటుంబాన్ని అంత కంటే ఎక్కువగా అవమానించిన విషయం కళ్ల ముందే ఉంది. ప్రధాన మంత్రి మోడీయే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో నెహ్రూ పేరును ఉపయోగించుకోవడానికి గాంధీ కుటుంబీకులు ఎందుకు అవమానంగా భావిస్తున్నారంటూ ప్రశ్నించారు. అదే రీతిలో రాహుల్‌గాంధీ నీరవ్ మోడీ లలిత్ మోడీ లతో మోడీని పోల్చుతూ మోడీ అని ఇంటి పేరు ఎందుకు ఉంటుందోనని వ్యాఖ్యానించారు. నెహ్రూ పేరును ఇదే మాదిరిగా గడిచి న ఆరున్నర దశాబ్దాలుగా ప్రతిపక్షాలు ఎద్దేవా చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. ఏదో పాసింగ్‌ రిమార్క్‌ గా రాహుల్‌ మోడీ ఇంటి పేరును ఉపయోగించి ఉండవచ్చు. ఇక్క గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ నరేంద్ర మోడీ కేసు వేయలేదు. రాహుల్‌గాంధీ వ్యక్తిగత జీవితంపై బీజేపీ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారు ఇప్పటికీ చేస్తున్నారు. అన్నింటికీ పరువునష్టం దావాలు వేసుకుంటూ పోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అయినప్పటికీ దిగువ కోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీలు చేసుకునే అవకాశం ప్రజాస్వా మ్యం మనకు కల్పించింది. ఆ హక్కును రాహుల్‌ని విని యోగించుకోనివ్వకుండా లోకసభ సచివాలయం తొందర పడిందేమోనన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. రాహుల్‌కు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.