ఎన్నికలకు ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఏపీలో రాజకీయం రేపోమాపో ఎన్నికలన్నంతగా వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ ఓటువేసింది. ఇక తోకజాడించే నేతలను ఉపేక్షించేది లేదన్న సంకేతాలిచ్చింది. వైసీపీనుంచి ఔట్ అయిన నలుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వీరిలో ఆనం కోటంరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ముందే వైసీపీతో విభేదించారు. వెంకటగిరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకూడా చేసేసుకుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం చాలాకాలంగా ఉంది. ఆనం రామనారాయనరెడ్డి అయితే తనతోపాటు కూతురికి కూడా టికెట్ అడుగుతున్నారన్న ప్రచారం జరిగింది. ఇక ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ్ముడు అధికారికంగా టీడీపీలో చేరటంతో అన్నకో తమ్ముడికో టీడీపీ టిక్కెట్ కన్ఫం అయినట్లే.
నలుగురు ఎమ్మెల్యేలనీ వైసీపీ క్రాస్ ఓటింగ్ ఖాతాలో వేసినా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తాడికొండ ఎమ్మెల్లే ఉండవల్లి శ్రీదేవిల ముసుగు తొలగింది మాత్రం ఎమ్మెల్సీ ఫలితాలతోనే. నిలబెట్టిన ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోయి టీడీపీ అభ్యర్థి గెలవటంతో సీరియస్‌గా పోస్ట్‌మార్టం చేసింది వైసీపీ నాయకత్వం. తనకున్న మెథడ్‌తో చివరికి మేకపాటి శ్రీదేవి క్రాస్ ఓటింగ్‌కి పాల్పడినట్లు నిర్ధారించుకుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేమని పార్టీ నాయకత్వం చెప్పేసిన ఎమ్మెల్యేల్లో ఈ ఇద్దరూ ఉన్నారు. అలాంటిదేమీ లేదని వాళ్లిద్దరూ బుకాయిస్తున్నా వైసీపీకి అయితే వాళ్ల విషయంలో మరో ఆలోచనేమీ లేదు. ఆనం కోటంరెడ్డితో పాటు ఉదయగిరి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా టీడీపీ పార్టీలో చేర్చుకుంటుందా లేదంటే ఎన్నికల ముందు నేరుగా టిక్కెట్లు ఇస్తుందా అన్నదే అర్ధంకావడంలేదు.
సస్పెన్షన్ తర్వాత శ్రీదేవి వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. తన మైండ్‌బ్లాంక్ అయ్యిందంటూనే పార్టీకి రిటన్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు. అటు మేకపాటి కూడా వైసీపీ నిర్ణయంతో రిలాక్స్‌గా ఉన్నానంటున్నారు. సస్పెండ్ అయిన నలుగురిలో శ్రీదేవి తప్ప మిగిలిన ముగ్గురూ రాజకీయాల్లో తలపండిన నేతలే. అయినా ఇదివరకటిలా వారు నియోజకవర్గాల్లో తిరగ్గలరా ప్రజలతో మమేకమై నియోజకవర్గాల్లో రాణించగలరా అన్నదే ప్రశ్న.
ఎందుకంటే దాదాపు అన్నిచోట్లా సిట్టింగ్‌లపై పార్టీ శ్రేణులు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. వైసీపీ అగ్రనాయకత్వం సూచనతో పార్టీ కేడర్ వారిని టార్గెట్ చేసుకుంటోంది. మళ్లీ ఉదయగిరినుంచే గెలుస్తానన్నది మేకపాటి ధీమా. టీడీపీకి అక్కడ పెద్ద కాంపిటీషన్ లేకపోవటంతో అంగ అర్ధబలం ఉన్న మేకపాటినే ముందుపెట్టే అవకాశం ఉంది. తాడికొండలో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రూపంలో గట్టి లీడర్ ఉన్నారు. ఆయన్ని కాదని అనుభవంలేని శ్రీదేవిని ఆ పార్టీ నిలబెట్టే సాహసం చేయకపోవచ్చు. మరోచోట పోటీచేసేందుకు ఆమె చరిష్మా సరిపోకపోవచ్చు. ఎందుకంటే వైసీపీలో ఉండగానే ఎమ్మెల్యేగా శ్రీదేవి ఎదురీదాల్సి వచ్చింది. పార్టీ నేతలనుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. ఇప్పుడామె సస్పెన్షన్‌తో వాళ్లంతా ఆమెపై నిప్పులు తొక్కుతున్నారు. మిగిలిన ముగ్గురిలా శ్రీదేవి మిగిలిన ఏడాదికాలం నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఓటేసి తమ అభ్యర్థిని గెలిపించినందుకు కృతజ్ఞతగా అధికారంలోకొస్తే ఏదన్నా పదవి ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వొచ్చు. అంతేగానీ పార్టీ కండువాకప్పి తాడికొండలో ఆమెనే అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితి లేదన్నది తమ్ముళ్ల మాట.