వామ్మో మళ్లీ కరోనానా.. వదలబొమ్మాళిలా వైరస్‌

By KTV Telugu On 27 March, 2023
image

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న సంకేతాలతో కేంద్రప్రభుత్వం అప్రమ్తతమైంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ వేరియంట్‌పై దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఎందుకంటే దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణతో కేంద్రం సర్కార్‌ అలెర్టయింది.
దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ XXB దడ పుట్టిస్తోంది. ఇప్పటిదాకా 216 సార్లు వైరస్‌ మ్యుటేషన్‌ జరిగినట్లు నిపుణులు గుర్తించారు. ఎప్పటికప్పుడు వైరస్‌ వెర్షన్‌ మార్చుకొని కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందుతోంది. ఈ కొత్త వేరియంట్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా గుర్తిస్తూ కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌పై దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌తో పాటు మందులు, ఐసీయూ సదుపాయాలు, పడకలు, వైద్య పరికరాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత వంటి వివరాలపై అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య కేంద్రాలు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొనాలని కేంద్రం, ఐసీఎంఆర్‌ ఉమ్మడిగా అడ్వైజరీ జారీ చేశాయి.
కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. మరణాలు లేవనుకుంటే ఆరుగురు కరోనాతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని, రాష్ట్రాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని కేంద్రం కోరింది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా వైరస్‌ని నియంత్రించేందుకు మాస్కులు ధరించడంతో పాటు అన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముందని కేంద్రం భావిస్తోంది. మొత్తానికి తుమ్మినా, దగ్గినా మళ్లీ మోచేయి అడ్డుపెట్టుకోవాల్సిన రోజులొచ్చేశాయి. ప్రపంచాన్నంతా మనం ఉద్ధరించలేంగానీ మనవరకు మనం జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. వీలైనంతవరకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండటం, బయటికెళ్తే కచ్చితంగా మాస్క్‌ ధరించడం చేస్తే అదే మనకు శ్రీరామరక్ష. కాదంటే మళ్లీ ఏమవుతుందంటే ఓసారి లాక్‌డౌన్‌ రోజుల్ని గుర్తుకు తెచ్చుకోవడమే.