బులాయా..ఖిలాయా..బాద్‌మే బాప్‌రే!

By KTV Telugu On 1 October, 2022
image

ఆటోవాలేకే పీఛే కౌన్‌ హై?
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు!

రాజకీయాలు అంతేమరి. సిగపట్లు, వెన్నుపోట్లే కాదు షేక్‌ అయిపోయేలా షాక్‌లు కూడా ఇస్తుంటారు. దర్యాప్తు సంస్థల దాడులే కాదు.. మన ప్రతి కదలిక వెనుక కొందరి దాగుడుమూతలు కూడా జరిగిపోతుంటాయి. ఢిల్లీలో పాగావేసి పంజాబ్‌లో భల్లే భల్లే అనిపించి గుజరాత్‌లో కూడా తొడగొడుతున్న కేజ్రీవాల్‌కి జస్ట్‌ శాంపిల్‌ అంటూ ఓ ఝలక్‌ ఇచ్చారు రైవల్స్‌.
అసలే ఆమ్‌ఆద్మీపార్టీ. అంటే సామాన్యుడి గొంతుకన్నమాట. అందుకే ఢిల్లీకి సీఎం అయినా సింపుల్‌గానే ఉంటారు కేజ్రీవాల్‌ కూడా. అందరితో పాటే వాకింగ్‌ చేస్తారు. పాపం అందరికీ అందుబాటులో ఉండబట్టే అప్పుడప్పుడూ చెంపదెబ్బలు కూడా తింటుంటారు. గుజరాత్‌పై కన్నేసిన ఆమ్‌ఆద్మీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడంలేదు. గుజరాత్‌ ప్రచారంలో ఓ ఆటోవాలా మా ఇంటికి రావాలని ఆహ్వానించడమే ఆలస్యం.. రాత్రి డిన్నర్‌కి వెళ్లి అందరితో సహపంక్తి భోజనం చేశారు క్రేజీవాల్‌ (అక్షరదోషం కాదు ఆయన నిజంగా క్రేజీనే). తన సింప్లిసిటీతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ విషయం సోషల్‌మీడియాలో కూడా బాగానే చర్చనీయాంశమైంది.
సీన్‌ కట్‌ చేస్తే.. ఇంటికి పిలిచి కొసరికొసరి వడ్డించిన ఆటోవాలా ప్రధాని మోడీ గుజరాత్‌ ర్యాలీలో ప్రత్యక్షమయ్యాడు. మెడలో కాషాయకండువాతో ఆ ఆటోడ్రైవర్‌ వీడియో కాస్తా వైరల్‌ అయిపోయింది. ఆటోరిక్షా యూనియన్‌ ఒత్తిడితోనే కేజ్రీవాల్‌ని భోజనానికి పిలవాల్సి వచ్చిందని చెప్పి ఆమ్‌ఆద్మీ పరువు తీసేశాడు. పన్లోపనిగా తాను మోడీకి అరివీర భయంకర అభిమానిననీ, ఇప్పటిదాకా బీజేపీకే ఓటేస్తూ వస్తున్నానని చెప్పాడు.
పిలవగానే వెళ్లి కంచంముందు కూర్చున్నందుకు అది అరగక, కక్కలేక కేజ్రీవాల్‌ కిందామీదా పడాల్సి వచ్చింది. బీజేపీవాళ్లే పనిగట్టుకుని ఈ ట్రాప్‌ చేశారని ఆమ్‌ఆద్మీనేతలు అంటున్నా జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. గుజరాత్‌ ఎన్నికల్లోపు ఇలాంటి ఆటోవాలాలు, చాయ్‌వాలాలు ఇంకెంతమంది తగులుతారో ఏమో! ఎందుకన్నా మంచిది లీడర్లు ఓ ఇంటికైనా వెళ్లినప్పుడు దండెమీద ఏదన్నా పార్టీ కండువా కనిపిస్తుందేమో, గోడమీద మనమంటే గిట్టని మొహం ఏదన్నా వేలాడుతుందేమో ఓసారి చూసుకోవాలి. గుజరాత్‌ ఆప్‌ ఎన్నికల ఇంచార్జిగా ఉన్న ఎంపీ రాఘవ్‌ చద్దానే బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ అన్న కేజ్రీవాల్‌ భయం చివరికి నిజమవుతుందేమో! శకునాలు చూస్తుంటే అలాగే ఉన్నాయ్‌.