వందమందికి 70మంది ఓట్లేస్తేనే గొప్పన్నట్లుంది మన ప్రజాస్వామ్యం. పోనీ అందులో 40-50మంది ఓట్లేసిన వారు ప్రజాప్రతినిధులు అవుతున్నారా అంటే మొత్తం ఓట్లలో మూడోవంతు రాని వారు కూడా చట్టసభల్లోకి అడుగుపెడుతున్నారు. సరే ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా గెలుపు గెలుపే దాన్నెవరూ కాదనలేరు అది మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని గొప్పతనం. కానీ అందులోనూ అక్రమాలకు పాల్పడితే దొంగ ఓట్లు వేసేసుకుని చంకలు గుద్దేసుకుంటే అంతకంటే అనైతికత మరోటి ఉండదు. జనసేన నుంచి పోయిన ఎన్నికల్లో ఏపీలో లింగులిటుకుమంటూ గెలిచింది ఒకే ఒక్కడు ఆ ఒక్కడే రాపాక వరప్రసాద్. రాజోలు నుంచి ఆ ఒక్కడైనా గెలిచాడన్న జనసేన ఆనందం మూణ్ణాళ్లముచ్చటే అయింది. ఎందుకంటే ఆయన కూడా గోడదూకేశారు వైసీపీలో చేరిపోయారు. జనసేన ఎమ్మెల్యేగా ఆయనొక్కడే ఒంటరిగా పొడిచేసేదేమీ ఉండదు అందుకే తెలివిగా కాయలున్న చెట్టు ఎక్కేశాడు. అప్పట్లో రాపాక వరప్రసాద్ విజయంపై వైసీపీ విమర్శలు చేసింది దొంగ ఓట్లతో గెలిచాడని ఆ పార్టీనేతలు ఆరోపించారు కానీ చివరికి ఆయన అదే పార్టీలో చేరడం విచిత్రంకాక మరేంటి. సరే బట్టలిప్పేసిన రాజకీయాల్లో పాతివ్రత్యం గురించి మాట్లాడుకోవడం కూడా దండగే.
ఆ వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే విషయానికొస్తే సార్ చానా సిన్సియర్. 10 కోట్లు ఇస్తామన్నా ఎడంచేత్తో ఆఫర్‌ని నెట్టేశారు ఆయనే చెప్పారు ఆ మాట. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు పాల్పడిందన్నది వైసీపీ ఆరోపణ. అనుమానం కాదు అది నిజం అంటూ నోరు విప్పారు రాపాక. తనతో ఓ టీడీపీ ఎమ్మెల్యే బేరసారాలు మాట్లాడారని కానీ నీతి నిజాయితీకి కట్టుబడి తాను ఆ ఆఫర్‌ని తిరస్కరించానన్నది రాపాక మాట. చూశారా చూశారా అంటూ వైసీపీ కూడా ఆయన అనుభవాన్ని ప్రస్తావించింది. అంతవరకు బాగానే ఉన్నా పోయిన ఎన్నికల్లో తన విజయం వెనుక రహస్యమేంటో ఓ ఆత్మీయ సమావేశంలో దాచుకోకుండా చెప్పేశారు రాపాక. కానీ అది సెల్ఫోన్లకు ఎక్కి బయట వైరల్ అవుతుందని ఆయన ఊహించలేదు.
గెలిచి నాలుగేళ్లయిపోయింది. ఇప్పుడిక తనని ఎవరూ పీకలేరనుకున్నారో అప్పట్లో తన ఎచీవ్మెంట్ వెనుక ఉన్న రహస్యాన్ని అందరితో పంచుకోవాలనుకున్నారోగానీ అసలు విషయం బయటపెట్టారు రాపాక. అవును నేను దొంగ ఓట్లతోనే గెలిచానని ఆ దొంగ ఓట్లు పడకపోతే ఓడిపోయేవాడినని గుర్తుచేసుకున్నారు. అన్నట్లు అప్పట్లో రాపాక వైసీపీ మీద కేవలం 814 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తన సొంతూరు చింతలమోరులో పడిన దొంగ ఓట్లతోనే ఎలాగో గట్టెక్కానన్న నిజాన్ని రాపాక తన నోటితోనే బయటపెట్టారు. తన అనుచరులు ఒక్కొక్కరు వచ్చి పదీ పదిహేను ఓట్లు ఎలా వేసేవారో విజయగర్వంతో చెప్పుకున్నారు. ఇంకేముందీ పదికోట్ల ఆఫర్ తిప్పికొట్టానన్న కామెంట్‌తో ఉబ్బిన బెలూన్ కాస్తా ఈ దొంగ ఓట్లతో తుస్సుమంది. పరువుపోతే కష్టమన్న రాపాకకి ఇప్పుడు పరువు పోయినట్టా పెరిగినట్టా.