బీజేపీ ప్రభుత్వ అతి పెద్ద స్కాం ఇదేనా

By KTV Telugu On 28 March, 2023
image

కరెంట్ చార్జీలు ఇటీవలి కాలంలో తరచూ చర్చల్లోకి వస్తున్నాయి. దీనికి కారణం చిత్ర విచిత్ర పేర్లతో చార్జీలను పెంచే ప్రయత్నం చేయడమే దీనికి కారణం. ఇవన్నీ కేంద్రం ప్రతిపాదిస్తున్నవే. కొత్తగా పీక్ అవర్స్ చార్జీలను ప్రవేశ పెట్టాలనే యోచన చేస్తున్నారు. ఇప్పటికే సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు తెస్తున్నారు ప్రీ పెయిడ్ చేయించుకునేలా వ్యవస్థను మార్చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెట్టడానికి జరుగుతున్న తతంగంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి మూలం కొత్త విద్యుత్ చట్టం. పైకి అంతా విద్యుత్ రంగాన్ని కాపాడటానికి అనే పేరు ఉన్నా లోపల మాత్రం అసలు లక్యంగా వినియోగదారుల దోపిడీ అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం చట్టంలో లోటుపాట్లు తెలుసుకుంటే ఇంత ఉందా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.

విద్యుత్ పంపిణీ రంగంలో తీసుకురావడానికి ఉద్దేశించిందే విద్యుత్ (సవరణ) బిల్లు-2022. విద్యుత్ రంగంలో పోటీ పెంచడం నియంత్రణ సంస్థలను మరింత బలోపేతం చేయడం డబ్బులు చెల్లింపు వ్యవస్థను గాడిలో పెట్టడం వంటి వాటిని పేర్కొన్నారు. ఈ బిల్లు అమలైతే విద్యుత్ పంపిణీకి ఎవరికీ లైసెన్స్ అవసరం లేదు అంటే ఎవరైనా విద్యుత్ పంపిణీ చేయవచ్చు. డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీకి బదులుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా మారొచ్చు. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ ప్రాంత పరిధిలో ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చు. అంటే ఏరియాల వారీగా కావాల్సిన వారికి విద్యుత్ అమ్ముకునే అవకాశం స్తారు. మినిమం టారిఫ్‌ను నిర్ణయిస్తారు అలాగే వినియోగదారులకు నష్టం కలగకుండా గరిష్ట టారిఫ్ మీద సీలింగ్ పెడతారు. విద్యుత్ పంపిణీ సంస్థలు తప్పకుండా కనీసం కొంత మొత్తం పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలనే నిబంధన ఉంటుంది. అలాగే ఒప్పందాల ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు డబ్బులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా చేయరు. అంటే లైసెన్స్ అవసరం లేదని చెప్పడం వల్ల ప్రైవేటు కంపెనీలు కూడా విద్యుత్ పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టొచ్చు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు మార్కెట్‌లో ఉంటాయి.

కొత్త బిల్లును స్థూలంగా పరిశీలిస్తే వినియోగదారులు తమకు కావాల్సిన వారి దగ్గర కరెంట్ కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే కంపెనీల మధ్య పోటీ పెరిగి ధరలు తగ్గుతాయని అనుకోవచ్చు. కానీ అసలు ఈ బిల్లులో అంతర్గతంగా ఉన్నది కార్పొరేట్ సంస్థల లక్షల కోట్ల లాభాల ఆశ మాత్రమే. ఈ చట్టంలో రెన్యూవబుల్ పవర్ పర్‌చేజ్ ఆబ్లిగేషన్స్ కింద విద్యుత్ పంపిణీ సంస్థలు తప్పనిసరిగా కొంత మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. అలా చేయకపోతే భారీ పెనాల్టీలు విధిస్తారు. దేశంలో ప్రస్తుతం పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు భారీ స్థాయిలో సోలార్ పవర్ ప్లాంట్స్ నడుపుతున్నాయి. వీటికి మేలు చేకూర్చడానికే ఈ నిబంధన తీసుకొచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో అదానీ కంపెనీ దేశవ్యాప్తంగా ఇష్టారీతిన ఇలాంటి పునరుత్పాదక ఇంధన కంపెనీలు ఏర్పాటు చేస్తోంది. వేల కోట్ల పెట్టుబడులు ప్రకటిస్తోంది. అలాగే రిలయన్స్ సహా అనేక కంపెనీలు ఈ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులుప్రకటిస్తున్నాయి. అంటే తప్పనిసరిగా వీరు ఉత్పత్తి చేసే విద్యుత్ ను కొని తీరాల్సిందేనన్నమాట.

ఇప్పటి వరకూ డిస్కంలు తమ సొంత వ్యవస్థ ద్వారా వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు మాత్రమే వీలుంది. అంటే డిస్కంలు విద్యుత్‌ స్తంభాలు లైన్లు ట్రాన్స్‌ఫార్మర్లు సబ్‌స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్‌ ఇస్తారు. కొత్త చట్టంతో ఆ అవసరం ఉండబోదు. సొంత వ్యవస్థ ఉండాలనే నిబంధనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా కోసం ఎక్కువ సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్‌ యాక్సెస్‌ సదుపాయం కల్పించే దిశగా కొత్త నిబంధనను తీసుకువస్తోంది. ఈ లెక్కన కొత్తగా వచ్చే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వాడుకునేలా ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు అనుమతి ఇవ్వాల్సి రానుంది. దీనికి బదులుగా ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ డిస్కంలకు వీలింగ్‌ చార్జీలను చెల్లిస్తాయి. కొత్త డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీకి లైసెన్స్‌ల జారీలో రాష్ట్రాల ఈఆర్సీలు విఫలమైనా దరఖాస్తును తిరస్కరించినా ఆయా సందర్భాల్లో లైసెన్స్‌ జారీ చేసినట్టే పరిగణించేలా కేంద్రం నిబంధన తెస్తుండటం గమనార్హం.

దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోయినా ప్రైవేటు కంపెనీలకు లైసెన్స్‌ జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ప్రజా సంపదతో నిర్మించిన ఈ ఆస్తులపై సర్వాధికారం ప్రైవేటు సంస్థలకు దక్కుతుంది. వీటిపై ప్రైవేటు కంపెనీలు పెట్టుబడి పెట్టనక్కర్లేదు కొత్త లైన్లు వేయనక్కర్లేదు ఆ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే చూసుకోవాలి. అంటే ప్రభుత్వ పంపిణీ సంస్థలు తమ ఖర్చుతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ప్రైవేటు కంపెనీలు వాటిని వాడుకొని లాభాలు ఆర్జిస్తాయి. అవి రూపాయి కూడా పెట్టుబడి పెట్టవు. విద్యుత్‌ మౌలిక వసతుల కల్పనకు ఆయా రాష్ట్రాలు రూ.లక్షల కోట్లు ఖర్చు చేశాయి. ఇదంతా కూడా ప్రజల డబ్బుతో ఏర్పాటైంది. మౌలిక వసతులు ప్రయివేటు కంపెనీలు వాడుకోవటమేంటి మెల్లమెల్లగా అదంతా కూడా ప్రయివేటు పరం కాదన్న నమ్మక మేంది కొత్త చట్టం ప్రకారం ప్రీపెయిడ్‌ చేస్తేనే సరఫరా ఉంటుంది. కార్పొరేట్లు అమ్ముతున్న సోలార్‌ విద్యుత్‌ను రాష్ట్రాలు కచ్చితంగా కొనుగోలు చేయాల్సి వుంటుంది. రాష్ట్రాల్లో విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్స్‌ కనుమరుగు అవుతాయి.

పోటీ ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గుతాయని బిల్లు ద్వారా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇది వినడానికి బాగుంటుంది. కానీ అమల్లో మాత్రం నిజం కాదు. ఇప్పటికే ముంబయి సబర్బన్‌ ప్రాంతంలో టాటా అదానీ కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌లు ఇచ్చారు. ప్రయివేటుకు అవకాశమిచ్చాం నాణ్యమైన విద్యుత్‌ తక్కువ రేటుకు అందుబాటులోకి తీసుకొచ్చామని మొదట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక టారీఫ్‌తో కూడిన విద్యుత్‌ను టాటా అదానీ కంపెనీలు వినియోగ దారులకు అమ్ముతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో లాభపడింది బడా కార్పొరేట్లు. మోసపోయింది సామాన్య ప్రజలు. విద్యుత్‌ సవరణ బిల్లు-2022 చట్టరూపం దాల్చితే దేశమంతా అదే జరుగుతుంది. ఇప్పటికే పొటీ ఉంటుందని విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయని సంస్కరణల మద్దతుదారులు చేసిన వాదనలు డొల్ల అని కూడా రుజువయ్యింది కూడా. ఇప్పటికే రాష్ట్రాలకు విద్యుత్ ఎక్స్ చేంజ్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. అక్కడ కంపెనీలు అమ్మకాలు సాగిస్తూ ఉంటాయి. విద్యుత్‌ వ్యాపారులు పోటీపడి తక్కువ ధరకు విద్యుత్‌ను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. విద్యుత్‌ వ్యాపారులంతా రింగ్‌గా ఏర్పడి కొనుగోలు దారులైన డిస్కంలు ఎంత ఎక్కువ రేటు ఇవ్వడానికి అంగీకరిస్తే వాటికి విద్యుత్‌ సరాఫరా చేసే విధానం అమలు జరుగుతున్నది. ఆ విధంగా విద్యుత్‌ ఎక్స్చేంజ్‌లు చట్టబద్ధ నల్లబజారు వ్యాపారానికి అడ్డాలుగా మారడానికి కొరత పరిస్థితుల సాకుతో ధరలను విపరీతంగా పెంచడానికి కారణం అయింది. మార్కెట్లో ఆ విధంగా యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.20కి మించి పెరిగింది.

ఎలా చూసినా కొత్త విద్యుత్ చట్టం ఇప్పటిదాకా పబ్లిక్ రంగంలో ఉన్న కరెంట్ వ్యవస్థను ప్రైవేటు రంగంలోకి నెట్టేస్తుంది. అలా చేయడం అంటే లక్షల కోట్ల విలువైన విద్యుత్ మార్కెట్ ను కార్పొరేట్ చేతుల్లో పెట్టడమే. దేశంలో ప్రభుత్వం ఇలా ప్రజల నిత్యావసరాలు తీర్చాల్సిన బాధ్యత ను కూడా తప్పించుకుని ప్రైవేటు చేతుల్లో ప్రజలను పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీని వల్ల లక్షల కోట్ల రూపాయలు గోల్ మాల్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్ని లక్షల కోట్లనేది నిపుణులే అంచనా వేయలేకపోతున్నారు. కానీ అతి పెద్ద గోల్ మాల్‌కు మాత్రం పునాది పడిందని అంటున్నారు. ఈ స్కాం గురించి ముందుముందు మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.