బీజేపీ జాతీయ నాయకులు ఇప్పుడు మెగా ఫ్యామిలీ జపం చేస్తున్నారు. అసెంబ్లీకి పార్లమెంటుకు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనాదరణ ఉన్న సినీ కుటుంబాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా ఆ కుటుంబాన్ని వాడుకోవాలని బీజేపీ డిసైడైనందునే మెగాస్టార్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నారని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ఆ పార్టీకి కొంచెం బలముంది. మరికొంత శక్తిని పెంచుకుంటూ విజయం ఖాయమని అంచనా వేసుకుంటోంది. మరో పక్క ఏపీలో ఆ పార్టీకి అంతగా బలం లేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే పవర్ స్టార్ బెట్టు చేస్తున్నారు. పవన్ టీడీపీ పట్ల చూపినంత ఇంట్రస్ట్ తమపై చూపించడం లేదని బీజేపీకి అర్థమైంది. పైగా రోడ్ మ్యాప్ పేరుతో ఆయన ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో వైపు నుంచి నరుక్కు రావాలని బీజేపీ డిసైడైంది.
మెగాస్టార్ కుటుంబానికి ప్రాధాన్యమిస్తూ సమయం చిక్కినప్పుడల్లా అమిత్ షా వారిని ప్రశంసిస్తున్నారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు మరింత వేగం పెరిగింది. గత ఏడాది చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా గోవాలో జరిగిన వేడుకల్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ చిరంజీవిని ఘనంగా సన్మానించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరకు పలువురు బీజేపీ మంత్రులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత రామ్ చరణ్ ను అమిత్ షా స్వయంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కు చరణ్ హాజరుకాగా అమిత్ షా స్వయంగా చరణ్ వద్దకు వచ్చి కలిశారు. చిరంజీవి చరణ్ తో అమిత్ షా 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు చరణ్ కు శాలువా కప్పి సన్మానించారు. అయితే దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆస్కార్ అవార్డు తెచ్చిన ఆర్ఆర్ఆర్ బృందాన్ని అంతటినీ సన్మానించకుండా ఒక్క చరణ్ ని మాత్రమే అభినందించడం ఏంటని ప్రశ్నలు వచ్చాయి. మరో పక్క ఆ భేటీలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాంచరణ్ మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. వీటన్నింటిలోనూ రాజకీయ లబ్ధిని ఆశించడమే ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి ఏ పార్టీలో లేరు ప్రజారాజ్యాం పార్టీని క్లోజ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. చిరంజీవి తమ సభ్యుడేనని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నప్పటికీ ఆయన మాత్రం దూరంగానే ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి ఒక క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ ఫాలోయింగ్ ఉంది. కాపు కుల మద్దతు కూడా ఉంటుందని విశ్వసిస్తున్నారు. బీజేపీలో ఇప్పుడున్న వాళ్లంతా అంతగా పాపులర్ లీడర్స్ కాదనే చెప్పాలి. బీజేపీని ఎలివేట్ చేసి అధికారానికి దగ్గరగా తీసుకురావాలంటే టానిక్ లా ఉపయోగపడే ఒక క్రేజీ లీడర్ అవసరం. పవన్ కళ్యాణ్ తమ మాట వినేందుకు సిద్ధంగా లేరని బీజేపీ విశ్వసిస్తోంది. అందుకే చిరంజీవి ద్వారా చెప్పిస్తే బావుంటుందన్న ఆలోచన వారిలో కలుగుతోంది. చిరంజీవే స్వయంగా బీజేపీలో చేరితే మరీ మంచిదన్న అభిప్రాయమూ ఉంది. ఆయన కోరిన పదవి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.