విశాఖకు రాజధాని తరలింపునకు అమరావతిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అడ్డంకిగా ఉంది. అందుకే ఆ తీర్పుపై స్టేకోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ అనుకూల నిర్ణయం వస్తే వీలైనంత త్వరగా విశాఖకు మకాం మార్చాలనుకుంటోంది వైసీపీ సర్కారు కానీ ఏపీ రాజధానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సుప్రీంని ఆశ్రయించారు ఆ ప్రాంత రైతులు. మరోవైపు అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేకోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకి వెళ్లింది. ఈ రెండు పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం స్టేకు నిరాకరించటంతో ఏపీ సర్కారు స్పీడ్‌కి బ్రేకేసింది.
అమరావతి పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి రైతులు రాష్ట్రప్రభుత్వ పిటిషన్లపై విచారణను జులై 11కి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున దాఖలైన పిటిషన్‌ని ఆ రోజు తొలి కేసుగా విచారణకు రానుంది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు తీర్పు నిలబడదంటూ ఏపీ ప్రభుత్వం తరపున కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అయితే జూన్ 16న జస్టిస్ జోసెఫ్ రిటైర్ అవుతుండటంతో కేసు విచారణని సుప్రీం ధర్మాసనం వాయిదావేసింది. తను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పు ఇచ్చే సమయం లేదన్నారు సుప్రీం జస్టిస్ కేఎం జోసెఫ్.
విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పడిందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల విషయం తమ దృష్టిలో లేదని చెప్పేసింది. వాస్తవానికి జనవరి 31నే సుప్రీంకోర్టు ఈ పిటిషన్లని విచారించాల్సి ఉంది. చివరికి కేసు కోర్టుముందుకు రావటంతో ఎలాంటి నిర్ణయం వస్తుందోనని అంతా ఉత్కంఠగా చూశారు. అయితే సుప్రీం జస్టిస్ రిటైర్మెంట్ వ్యవహారంతో మళ్లీ వాయిదా పడటంతో ఆలోపే పాలన విశాఖకు తరలుతుందా లేదంటే సుప్రీం విచారణ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.