పులివెందుల‌లో ఫైరింగ్‌.. వేట‌కొడ‌వ‌ళ్లుపోయి తుపాకులొచ్చేశాయా

By KTV Telugu On 29 March, 2023
image

వైఎస్ వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ‌తోనే పులివెందుల హాట్‌హాట్‌గా ఉంది. సీఎం సొంత‌నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు తుపాకీ కాల్పులు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. వివేకా హ‌త్య‌కేసులో అనుమానితుడిగా పోలీసులు ప్ర‌శ్నించిన వ్య‌క్తి చేతిలోని తుపాకీ ఒక‌రి ప్రాణం తీసింది మ‌రొక‌రిని ఆసుప‌త్రి పాలుచేసింది. కాల్పులు జ‌రిపిన భ‌ర‌త్‌యాద‌వ్ చుట్టూ కొత్త రాజ‌కీయం మొద‌లైంది. పులివెందుల‌లో కాల్పుల‌కు ఆర్థిక‌వివాదాలే కార‌ణమంటున్నా పోలీసులు ముందే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న ప్ర‌శ్న టీడీపీనుంచి వ‌స్తోంది.

దిలీప్‌తో పాటు మ‌స్తాన్ అన్న వ్య‌క్తిపై భరత్‌ యాదవ్ కాల్పులు జ‌రిపాడు. దిలీప్‌తో అత‌నికి ఆర్థిక వివాదాలున్నాయి. పంచాయితీకి పెద్ద‌లు ప్ర‌య‌త్నించినా కొలిక్కిరాక‌పోవ‌టంతో చివ‌రికి మ్యాట‌ర్ మ‌ర్డ‌ర్‌దాకా వ‌చ్చింది. రెండు వారాల క్రితం విశ్వనాథ్‌ అనే వ్యక్తిని భరత్ గ‌న్‌తో బెదిరించాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఆ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఉంటే కాల్పుల‌దాకా వ‌చ్చేది కాదంటున్నారు టీడీపీ నేత‌లు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ భ‌ర‌త్‌యాద‌వ్‌ నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనంచేసుకోలేద‌న్న‌ది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఆరోప‌ణ‌.

పులివెందుల వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర జరిగిన ఘర్షణ చివ‌రికి కాల్పుల‌కు దారితీసింది. గొడ‌వ‌ప‌డ్డాక ఎవ‌రిదారిన వారు వెళ్లిపోయినా ఇంటినుంచి తుపాకీ తీసుకొచ్చిన దిలీప్ ఇంటికి వెళ్లి కాల్పులు జ‌రిపాడు భ‌ర‌త్‌యాద‌వ్‌. ప‌క్క‌నే ఉన్న మ‌స్తాన్‌కి కూడా తూటాలు త‌గిలాయి. తీవ్ర‌గాయాలైన దిలీప్ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చ‌నిపోయాడు. పులివెందులలో భ‌ర‌త్ యాద‌వ్‌కి రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉంది. వైఎస్ వివేకా హ‌త్య‌కేసులో సీబీఐ అధికారులు అత‌న్ని గ‌తంలో ప్రశ్నించారు. హ‌త్య‌కేసులే ఏ2గా ఉన్న సునీల్‌ యాదవ్‌ని వివేకానందరెడ్డికి పరిచయం చేసింది భరత్‌ యాదవేనని సమాచారం.

వివేకా హ‌త్య‌కేసులో కీల‌క‌మైన సునీల్‌ యాదవ్‌కు భరత్ ద‌గ్గ‌రి బంధువు. వివేకా హత్యకు వివాహేతర సంబంధాలు సెటిల్మెంట్లే కారణమని భరత్‌ యాదవ్ త‌ర‌చూ చెబుతున్నాడు. సునీత భర్త నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని ఆరోపించాడు. సీబీఐకి అప్రూవర్‌గా మారిన దస్తగిరిపైనా భ‌ర‌త్ సీబీఐకి ఫిర్యాదుచేశాడు. కీల‌క నేత హ‌త్య‌కేసులో సీబీఐ ప్ర‌శ్నించిన వ్య‌క్తి తుపాకీతో చెల‌రేగిపోతుంటే పోలీసులు ఏంచేస్తున్నార‌న్న‌దే ప్ర‌శ్న‌. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఈమాఫియా పోక‌డ‌తో ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు.