అమరావతి ఎప్పుడో.. కోర్టు కేసు తేలితేనే ఏదైనా సాధ్యం

By KTV Telugu On 29 March, 2023
image

 

నవ్యాంధ్ర రాజధానిపై రాష్ట్రప్రజలు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతున్నాయి. ఎన్నిరోజులు నిరీక్షించినా ప్రజల ఆలోచనలు ఆశయాలు ఆకాంక్షల నెరవేరే అవకాశాలు సమీప భవిష్యత్తులో కష్టమన్న భావన కలుగుతోంది. అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వంలో చలనం చాలేదు. తాము చేసిన చట్టాన్ని ఉపసంహరించుకోవడం మినహా వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. హైకోర్టు తీర్పుపై అప్పీలు వెళ్లేందుకు కూడా జగన్ చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నారు. హైకోర్టు తీర్పును కొట్టివేయాలన్న జగన్ కోరిక వెంటనే తీరకపోయినా అమరావతిపై సుప్రీం కోర్టు తీర్పు అంతత్వరగా వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

సుప్రీం కోర్టులో త్వరగా విచారణ జరిపించాలన్న జగన్ ఆశ నెరవేరలేదు. నిజానికి అమరావతిని కోరుకునే వారి ఆశయం కూడా అదే త్వరగా విచారణ పూర్తయి అమరావతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని వారు ఆశిస్తున్నారు. జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరిచడంతో అమరావతి వాదులకు ప్రాణవాయువు అందించినట్లవుతుంది. అయితే కేసు విచారణ ఏకంగా జూలై 11కు వాయిదా పడటంతో ఇక విచారణ ఎప్పుడు తీర్పు ఎప్పడన్న భయం బాధితుల్లో నెలకొంది. అమరావతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. హైదరాబాద్ కంటే పెద్దదిగా అమరావతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ క్రియేట్ అయ్యిందని కేటీఆర్ గుర్తు చేశారు. అక్కడ ఇప్పుడేం పనులు జరగడం లేదని కేటీఆర్ చెప్పడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని కొందరు వాపోతున్నారు.

నిజానికి అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందనుకున్నారు. సిస్టమేటిక్ గా కట్టిన నగరాల్లో ప్రథమ స్థానాన్ని పొందుతుందనుకున్నారు. నివాసాలకు పరిశ్రమలకు పరిపాలనకు కేంద్రబిందువు అవుతుందనుకున్నారు. అమరావతి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారిపోతుందనుకున్నారు. కానీ జగన్ ప్రకటించిన మూడు రాజధానులతో అమరావతి అటకెక్కే పరిస్థితి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ విశాఖను అభివృద్ధి చేసే క్రమంలో జగన్ అమరావతిని పూర్తిగా వదిలేశారు. పైగా అక్కడ మట్టి కంకర కూడా దోచుకెళ్తున్న వైసీపీ బ్యాచ్ ను ప్రభుత్వం నిలువరించడం లేదు.

ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీ కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందరినీ సంప్రదించి గుంటూరు విజయవాడ మధ్య ఉన్న ప్రాంతాన్ని అమరావతిగా నిర్మించాలనుకున్నారు. సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు 29 గ్రామాల ప్రజలు ముందుకు వచ్చారు. అమరావతి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా సమర్థించారు. అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చారు. మరి ఇప్పుడా రైతుల పరిస్థితి ఏమటి వారిని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. భూమిలిచ్చిన నిలివుదోపిడీ అయినట్లుగా నిలబడిపోయిన అన్నదాతల ఆక్రందనలను వినేవారు ఎవరూ. అందరూ మాటసాయం చేస్తామనేవారే కానీ కార్యాచరణతో కలిసి వస్తామనేవాళ్లు లేరనే చెప్పాలి. అమరావతి రైతులు వరుస ఉద్యమాలు నిర్వహించి అలిసిపోయారు. దిక్కుతోచక నలుదిక్కులు చూస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజా సంఘాల మద్దతు లేకపోతే వారి పరిస్థితి మరింత అధోగతిగా ఉండేది.

అమరావతిలో పరిశ్రమలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని వచ్చిన వాళ్లంతా ఒక్కరొక్కరుగా వెనక్కి వెళ్లిపోయారు. జగన్ సర్కారు బలవంతంగా కొందరిని వెనక్కి పంపేసింది. అమరావతి ఇప్పుడో శశ్మానం. దాన్ని బాగు చేయాలంటే రాష్ట్ర ప్రజల సమిష్టి అవసరం. భేషజాలను పక్కన పెట్టి గత ప్రకటనలను గుర్తుచేసుకోకుండా అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగితేనే అమరావతి నిర్మాణం సాధ్యం. అంతకు ముందు కోర్టు కేసు కూడా తేలాలి ఎట్టి పరిస్థితుల్లో కోర్టు కేసును జగన్ ఉపసంహరించుకునే అవకాశం లేదు. జూలైలో విచారణకు వచ్చినప్పుడు వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని అభ్యర్థించడం ఒక్కటే అమరావతి మద్దతుదారుల ముందున్న ఏకైక మార్గం. అప్పుడే ఎన్నికల నాటికి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. అమరావతిపై అందరూ పాజిటివ్ గా ఆలోచించాల్సిన తరుణమిది. ఎందుకంటే ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు చులకనై పోయాం. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే రాజధాని కూడా నిర్మించుకోలేని ఆంధ్రులుగా చరిత్ర హీనులమవుతాం.