వడ్డీ రేట్ల పెంపుతోనే అమెరికా బ్యాంకుల దివాలా.. మన బ్యాంకుల పరిస్థితేమిటి

By KTV Telugu On 29 March, 2023
image

 

అమెరికాలో బ్యాంకులు వరుసగా దివాలా తీస్తూండటం సంచలనంగా మారింది. నిన్నామొన్నటిదాకా బాగున్న బ్యాంకులు ఒక్క సారిగా ఎందుకు ఇలా ఐపీ పెట్టేస్తున్నాయంటే ప్రధానంగా కనిపిస్తున్న కారణం వడ్డీ రేట్లు. ఇటీవల ద్రవ్యోల్బణం పేరుతో అమెరికా ఫెడ్ రిజర్వ్ వరుసగా వడ్డీరేట్లు పెంచుతూ పోతోంది. దీని వల్ల బాండ్ల విలువ పడితోంది. బ్యాంకులు చేసే ప్రధాన వ్యాపారంలో బాండ్లు కీలకం. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ల విలువలు పడిపోతాయి. బ్యాంకుల ఆస్తుల విలువలు వాటి అప్పుల విలువలతో పోల్చినప్పుడు తగ్గిపోతాయి. దీని వలన మార్కెట్‌లో ఆ బ్యాంక్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. అప్పుడు బ్యాంకులు తమ వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితులు వస్తాయి. అదే పరిస్థితి ఇప్పుడు అమెరికన్ బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి.

అమెరికా లోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సిగ్నేచర్‌ బ్యాంక్‌లు కుప్ప కూలడం వెనక ఉన్న కారణాలు బహిరంగమే. ఈ బ్యాంకుల పతనం కావడం కేవలం ఆ బ్యాంక్‌కి మాత్రమే సంబంధించిన అంతర్గత విషయం కాదు. ఈ రెండు బ్యాంకులూ పతనం చెందడం వెనుక మనకు కనిపించే కారణం వడ్డీ రేట్లు పెరగడం. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ల ధరలు వాటంతట అవే తగ్గుతాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగితే కరెన్సీ నిజవిలువ తగ్గుతుంది గనుక బాండ్ల మార్కెట్‌ విలువ తగ్గిపోతుంది. అప్పుడు బ్యాంకు వద్ద తనఖా కింద ఉన్న బాండ్లకు విలువ తగ్గిపోతుంది. అంటే బ్యాంకు దగ్గర ఉన్న ఆస్తుల విలువ తగ్గుతుంది. ఆ మేరకు అప్పుల భారం పెరుగుతుంది. దాని వలన బ్యాంకులు ఒత్తిడికి లోనవుతాయి. అమెరికా బ్యాంకులు ఇప్పుడు అదే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండు చిన్న బ్యాంకులు బయటపడ్డాయి కానీ ఇంకా చాలా బ్యాంకులు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్ లు చాలా సున్నితమైన పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా కస్టమర్లు తమ నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటారు. అలా చేసుకుంటే బ్యాంక్ కుప్పకూలిపోతుంది. అంటే ఒకసారి బ్యాంకు ఒత్తిడికి లోనయితే ఆ పైన దాని నుండి బైటపడడానికి అది ఏమి చేసినా అది పతనానికే దారి తీస్తుందని ఇప్పటికే అనే బ్యాంకులకు ఎదురైన అనుభవాలు నిరూపిస్తున్నాయి.

అమెరికాలో వడ్డీ రేట్లను అక్కడి ఫెడరల్‌ రిజర్వు గణనీయంగా పెంచింది. 2022 ఫిబ్రవరిలో 0.25 శాతం ఉన్న వడ్డీ రేటు ఫిబ్రవరి 2023 వచ్చేసరికి అమాంతం 4.75 కి పెరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ స్థాయిలో వడ్డీ రేటును పెంచడం అసాధారణం. అందుకే బ్యాంకులు తమ బ్యాలెన్స్‌ షీట్లను సర్దుబాటు చేసుకోవడం వాటికి అసాధ్యమే అయింది. అమెరికా ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. జిడిపితో పోల్చినప్పుడు ద్రవ్యలోటు పెరిగిపోవడంతో వడ్డీ రేట్లు పెంచక తప్పలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోడానికి వడ్డీ రేట్లు తగ్గించడం ఒక్కటే ప్రభుత్వానికి మిగిలిన దారి. 2008లో సబ్ ప్రైమ్ సంక్షోభం తర్వాత అమెరికాలో వడ్డీ రేట్లు 0.25 శాతంకు తగ్గించారు. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నిజానికి వడ్డీ రేట్లు తగ్గిపోయి దానివలన బాండ్ల విలువలు పెరిగిపోతే దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోవడం జరిగినా జరగకున్నా బ్యాంకింగ్‌ వ్యవస్థకు మాత్రం దానివలన ఎటువంటి ముప్పూ ఉండదు. కాని వడ్డీ రేట్లు పెరిగి బాండ్ల విలువలు పడిపోతే బ్యాంకుల ఆస్తుల విలువలు వాటి అప్పుల విలువలతో పోల్చినప్పుడు పడిపోతాయి. ఇదే జరిగింది.

వడ్డీ రేట్ల పెంపు అనేది ఒక్క అమెరికాలోనే కాదు ఇండియాలోనూ భారీగా ఉంది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ ఐదారు సార్లు వడ్డీ రేట్లను సవరించింది. మరోసారి పెంచుతామన్న సంకేతాలు ఇస్తోంది. మరి దీని వల్ల భారత బ్యాంకులు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. స్టాక్ మార్కెట్లలో ఆయా బ్యాంకుల షేర్ ధర పడిపోతోంది. కానీ ఆమెరికా బ్యాంకులపై ఉన్నంత ఒత్తిడి ఉండదని భావిస్తున్నారు. ఎందుకంటే భారత్‌లో సంప్రదాయంగా బ్యాంకుల వ్యాపారం భిన్నంగా ఉంటుంది. అయితే ఇక్కడ బ్యాంకులు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఉండటానికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న బోర్డులు ఉండవచ్చు కానీ వారెవరూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించలేరు. అందుకే పెద్ద ఎత్తున కార్పొరేట్లకు రుణాలు ఇస్తూంటారు. సామాన్యుల దగ్గర ఫీజులు వసూలు చేస్తూంటారు. ప్రస్తుతానికి భారత బ్యాంకింగ్ వ్యవస్థ అప్పులు, ఆస్తుల నిర్వహణలో బలంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ బ్యాంకులు స్థానిక డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతుండడమే ఇందుకు కారణమని అనుకోవచ్చు. డిపాజిట్ల ద్వారా సేకరించిన నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే మదుపు చేస్తున్నారు. దీని వల్ల వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ఉండదని అంటున్నారు.

బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. వాటిపై ప్రజలు నమ్మకం కోల్పోతే ఇక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. కారణం ఏదైనా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై కొంత నమ్మకం సడలుతోంది. బ్యాంకుల్లో దాచుకోవడం కన్నా ఇతర మార్గాలపై ఆలోచనలు చేసేవాళ్లు పెరుగుతున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకుల సంక్షోభం ఓ సవాల్‌గా మారింది. ఇది భారత్‌ను తాకదని ఆశిద్దాం !