జగన్ తీసేసిన తహసీల్దారులే గతా

By KTV Telugu On 29 March, 2023
image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలవడంతో  వచ్చే ఎన్నికల్లో ఇక విజయం తమదేనని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్న టిడిపి మరో నలభై మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అంటోంది. రానున్న కాలంలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని వైసీపీ నుండి టిడిపిలోకి పెద్ద ఎత్తున వలసలు వస్తాయని టిడిపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించింది తెలుగుదేశం. మూడు చోట్ల ఎన్నికలు జరిగితే మూడింటికి మూడూ టిడిపి గెలుచుకుంది. ఆవిజయంలో జనసేన పిడిఎఫ్ లకు వాటా ఉన్నప్పటికీ అంతిమ విజయం మాత్రం టిడిపిదిగానే చెలామణీ అవుతోంది. అందుకే మూడు స్థానాల్లో విజయాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి.

ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 స్థానాలు గెలుచుకున్నప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలు చాలా కాలంగా టిడిపికి దూరంగా ఉంటున్నారు. వారు స్వతంత్రంగా ఉంటూ వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఆ నలుగురు పోను టిడిపి సభ్యుల సంఖ్య కేవలం 19 మాత్రమే. అంటే ఎమ్మెల్సీ స్థానం గెలవడాని ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఇక్కడే హార్స్ ట్రేడింగ్ జరిగింది. కొద్ది రోజుల క్రితం వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర రెడ్డి ఎలాగూ టిడిపితో టచ్ లోనే ఉన్నారు ఇంకో ఓటు కావాలి. ఈ క్రమంలోనే ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర రెడ్డిలకు టిడిపి గేలం వేసింది. మొత్తం మీద ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాథ విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరో తెలుసుకోవడం చాలా తేలిక కాబట్టి ఎవరైతే పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా టిడిపికి ఓటు వేశారో ఆ నలుగురినీ గుర్తించిన వైసీపీ నాయకత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది ఆ నలుగురికీ కూడా అదే కావాలి అటు టిడిపికి కూడా అదే అవసరం. ఆ నలుగురు ఇక టిడిపి నేతలుగానే చెప్పుకోవచ్చు. ఈ నలుగురే కాదు మరో నలభై మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని త్వరలోనే వారంతా కూడా టిడిపిలో చేరతారని టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు.

అందులో నిజం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసలు ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడానికి కూడా బలమైన కారణం ఒకటుంది. 2024 ఎన్నికల్లో ఈ నలుగురికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడో స్పష్టం చేశారట. దానికి కారణం ఏంటంటే గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించే సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది జనం ఏమనుకుంటున్నారు అన్న అంశాలపై పార్టీ నాయకత్వం సర్వే చేయించింది. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ బృందాలే ఈ సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో ఈ నలుగురు ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలిందట. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇస్తే ఓటమి ఖాయమని కూడా హెచ్చరించిందట నివేదిక. దానికి అనుగుణంగానే ఈ నలుగురికీ టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయితే వీరి సేవలను మరోలా వాడుకుని వేరే పదవులు కట్టబెట్టాలని కూడా జగన్ మోహన్ రెడ్డి భావించారట. అయితే అసెంబ్లీ ఎన్నికల బరిలోనే దిగాలని కృత నిశ్చయంతో ఉన్న ఈ నలుగురూ కూడా పార్టీకి గుడ్ బై చెప్పడానికి అదను కోసం ఎదురు చూస్తోన్న తరుణంలోనే ఎమ్మెల్సీఎన్నికలు వచ్చాయి. ఇదే టిడిపికి కూడా ఓ అవకాశాన్నిచ్చింది. వెంటనే నలుగురినీ తమవైపు లాగేసుకున్నారు చంద్రబాబు.

ఐ ప్యాక్ సర్వేలో ఈ నలుగురే కాదు ఇటువంటి వారు మరో ముప్పైమందికి పైనే ఉంటారని అంచనా. వారికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. అయితే వారిని పార్టీలోనే ఉంచుకుని ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే నామినేటెడ్ పదవులు వద్దు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడమే ముద్దు అనుకునే నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరెవరు ఉన్నారా అని చంద్రబాబు నాయుడు నిఘా పెట్టారట. ఆ నేతలను గుర్తించి టిడిపి వైపు ఆకర్షించాలన్నది ఆలోచన. ఎందుకంటే టిడిపికి వచ్చే ఎన్నికలకు చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులే లేరు. అంచేత వైసీపీలో టికెట్లు రాని బలమైన నేతలను తమ వైపు తెచ్చుకుంటే లబ్ధి పొందచ్చని ఆయన భావిస్తున్నారట. ఈ నలుగురి విషయంలో అవలంభించిన వ్యూహాన్నే వైసీపీ నాయకత్వం మిగతా ఎమ్మెల్యేల విషయంలోనూ అనుసరించబోతోందంటున్నారు. టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని నిజాయితీగా ఎమ్మెల్యేలకు చెబుతోన్న నాయకత్వం పార్టీని వీడాలని నిశ్చయించుకున్న వారిని మాత్రం ఆపకూడదనే అనుకుంటోంది. ఒక విధంగా టిడిపి తమ పార్టీలో టికెట్లు రాని నేతలను తీసేసుకుంటే అది తమ నెత్తిన పాలు పోసినట్లే అని వైసీపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఎందుకంటే ఎన్నికల సమయంలో నలభై మందికి మీకు టికెట్లు ఇవ్వలేమని చెప్పాల్సి వస్తే దానికి బదులుగా మీకు ఎమ్మెల్సీనో మరో నామినేటెడ్ పదవో ఇస్తామని భరోసా ఇవ్వాల్సి వస్తుంది. అదే ఎన్నికలకు ముందే ఆ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోతే ఎవ్వరికీ ఎలాంటి భరోసాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు సరికదా ఆ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలైన కొత్త నేతలను తెరపైకి తీసుకు రావచ్చు. ఇది వైసీపీకి రాజకీయంగా బాగా కలిసొస్తుందని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.

2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇంచుమించు ఇలాంటి సీనే కనిపించింది. ఎన్నికలకు ముందు ఏకంగా 34 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీని వీడి బిజెపిలో చేరిపోయారు. అంతే ఇంకేముంది తృణమూల్ కాంగ్రెస్ పని అయిపోయింది రాబోయేది బిజెపి ప్రభుత్వమే అని ప్రచారం చేసుకున్నారు కమలనాథులు. టి.ఎం.సి. నుండి బిజెపిలో చేరిన 34 మంది పనితీరుపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థే సర్వే నిర్వహించింది. వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలడంతోనే వారు బిజెపిలో చేరుతోంటే మమతా బెనర్జీ చాలా కూల్ గా ఉండిపోయారు. బిజెపిలో చేరిన 34 మందిలో కేవలం 13 మందికే బిజెపి టికెట్లు ఇచ్చింది. వారిలో కేవలం నలుగురే గెలిచారు. మిగతా అంతా ఓడిపోయారు. అటు టి.ఎం.సి.కి మాత్రం 34 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటం బాగా కలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడమే కాదు అంతకు ముందు ఎన్నికల్లో వచ్చిన స్థానాల కన్నా కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇపుడు ఏపీలోనే అదే విధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆపార్టీ నాయకత్వం అంచనాలు వేసుకుంటోంది. తమ పార్టీలో ప్రజాగ్రహాన్ని చవి చూస్తోన్న నేతలను టిడిపిలో చేర్చుకోవడం ద్వారా వైసీపీ కార్యాలయంలోని చెత్తని టిడిపి నాయకత్వమే మంచి చీపురుతో తుడిచి శుభ్రం చేసినట్లు అవుతుందని వైసీపీ సీనియర్లు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ నుండి 40 మంది దాకా తమ పార్టీలోకి వస్తారంటోన్న టిడిపి మరి వారిలో ఎంతమందికి టికెట్లు ఇస్తుందనేది ప్రశ్న. ఈ నేతలు టిడిపిలో చేరితే  వీరి నియోజకవర్గాల్లోని టిడిపి నేతల్లో అసంతృప్తి రాజుకోవడం ఖాయమని రాజకీయ పండితులు అంటున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయం అంటున్నారు. జనసేనకు సీట్లు కేటాయించాల్సి వస్తే ఆ స్థానాల్లోని టిడిపి నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వస్తే ఒరిజినల్ టిడిపి నేతల భవిష్యత్ ఏంటనేది ఆసక్తికరంగా మారుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి 2024 ఎన్నికల సమయానికి ఏపీలో సమీకరణలు ఇంకెంతగా మారతాయో చూడాలి.