ఎస్టీల్లోకి బోయ వాల్మీకులు. ఆ నిర్ణయంతో ఏజెన్సీలోని గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలకు నిద్రపట్టటంలేదు. తమ రాజకీయ భవిష్యత్తుపై వారిలో కలవరం మొదలైంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానంచేసిందో గిరిజనులు ఆదివాసీలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు ఏజెన్సీ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ చివరి రోజున వైసీపీ సర్కారు చేసిన తీర్మానం ఏజెన్సీలో వైసీపీ ప్రజాప్రతినిధులకు సవాలుగా మారింది. బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానించి దాన్ని కేంద్రానికి పంపుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షలమంది బోయ వాల్మీకులు ఉన్నారు. సీమలో వారు బీసీలుగా ఇప్పటిదాకా చెలామణి అవుతున్నారు. వారిని ఎస్టీలుగా గుర్తిస్తామని ఎన్నికల హామీ ఇచ్చినా దాన్ని ఎన్నికలకు ఏడాది ముందు కదపటం రాజకీయ వ్యూహంలో భాగమే. ఎందుకంటే ఏదో ఒక న్యాయపరమైన చిక్కులు ఎలాగూ తప్పవు. తమ ప్రయత్నం తాముచేసినా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలన్న ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ తేనెతుట్టెని కదిపింది.
అసెంబ్లీలో బోయ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలన్న తీర్మానం చేయగానే గిరిజనుల్లో అలజడి మొదలైంది. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి. మైదాన ప్రాంతాల్లో ఉండే బీసీ బోయ వాల్మీకులు ఇప్పటికే అన్ని రంగాల్లో బలంగా ఉన్నారని వారిని ఎస్టీలుగా చేర్చాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎస్టీ ప్రయోజనాలతో వారు మరింత ఎదిగితే అసలు గిరిజనులు మరింత వెనుకబడతారన్న చర్చ జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి గిరిజన సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయం దుస్సాహసమేనన్న అభిప్రాయంతో గిరిజన వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. గిరిజనులకు పదవుల్లో పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయంతో వారి వ్యతిరేకతను కొనితెచ్చుకుందన్న మాట పార్టీనేతల నోట వినిపిస్తోంది.
కొంత నష్టానికి సిద్ధపడే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రాయలసీమలోని అనంతపురం చిత్తూరు కర్నూలు జిల్లాల్లో దాదాపు 40లక్షలమంది బోయ వాల్మీకులున్నారు. దాదాపు పాతిక నియోజకవర్గాల్లో గెలుపోటములను వారు ప్రభావితం చేయగలరు. ఎస్టీల్లో చేర్చాలంటూ ఆ వర్గం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఈ సమయంలో వారి విన్నపాన్ని మన్నిస్తే సీమలోని ఆ మూడు జిల్లాల్లో తిరుగుండదని వైసీపీ భావిస్తోంది. ఇప్పుడు కొన్ని నిరసనలు ఎదురైనా న్యాయపరమైన చిక్కులొచ్చినా ఎన్నికలనాటికి అంతా సుఖాంతం అవుతుందన్న అంచనాతో వైసీపీ ఉంది. అయితే గిరిజనులు నిరసనలకు దిగడం మావోయిస్టులు కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గొంతు విప్పటంతో సమస్య జటిలమయ్యేలా ఉంది.