కన్నడ నాట అడ్వాంటేజ్ కాంగ్రెస్ – భస్మాసుర బీజేపీ

By KTV Telugu On 31 March, 2023
image

దేశంలో పాన్ ఇండియా పార్టీ బీజేపీ అని ప్రధాని మోదీ ప్రకటించుకున్నారు. కానీ దక్షిణాదిలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రమే. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం బీజేపీ. అంతో ఇంతో బలంగా ఉన్న రాష్ట్రం కూడా అదే. ఇప్పుడు ఆ ఒక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాదిలో ఎదగాలనుకుంటున్న బీజేపీకి పరిస్థితులు కలసి రావడం లేదు బీజేపీ కర్ణాటకలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అదీ కూడా ప్రజల నుంచి వచ్చిన తీర్పుతో తిరుగు ఉండకపోవచ్చు. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మైనస్ అవుతుంది. కానీ వచ్చే ఎన్నికల తర్వాత అలాంటి చాయిస్ కూడా ఉండదేమో అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. అక్కడి రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

కర్ణాటకలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ జరుగుతుంది. స్థిరమైన ఓటు బ్యాంక్‌తో జేడీఎస్ కనీసం పాతిక ఎమ్మెల్యే సీట్లు గెల్చుకోవడం ఖాయం ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ బీజేపీనా అనే చాయిస్ ఎంచుకుంటే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. కర్ణాటకలోని నియోజకవర్గాలను సెంట్రల్ కర్ణాటక కోస్టల్ కర్ణాటక గ్రేటర్ బెంగళూరు హైదరాబాద్ కర్ణాటక ముంబయి కర్ణాటక ఓల్డ్ మైసూర్‌గా విభజించి చూస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38% ఓట్లు దక్కాయి. బీజేపకి గత ఎన్నికల్లో 36% ఓట్లువచ్చాయి. ఇక మరో కీలక పార్టీ JDSకి గత ఎన్నికల్లో 18% ఓట్లు సాధించింది. సీట్ల పరంగా చూస్తే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చాన్సిచ్చారు. కానీ కుమారస్వామికి సీఎం సీటు ఆఫర్ చేసి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దాంతో వెంటనే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ తర్వాత బీజేపీ ఆపరేషన్ కమల్ ను నిర్వహించి జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చింది. అదే బీజేపీకి పెద్ద మైనస్‌గా మారింది.

ఆపరేషన్ కమల్ ద్వారా ప్రజలు ఇవ్వని అధికారాన్ని కర్ణాటకలో లాక్కున్న బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు అధికార వ్యతిరేకత పెద్ద సమస్యగా మారింది. ఫార్టీ పర్సంట్ ప్రభుత్వంగా ప్రజల్లో పేరు పడిపోయింది. అవినీతి నిరుద్యోగం ప్రజల్ని అసహనానికి గురి చేస్తున్నాయి. విద్యుత్ నీళ్లు రహదారులతో పాటు శాంతి భద్రతల అంశంకూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతోంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తీసుకు వచ్చిన హిజాబ్ అంశం సహా మత విద్వేషాలు ఆందోళనలు కూడా బీజేపీకి మైనస్‌గా మారుతాయన్న అంచనాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వ పనితీరు నాసిరకంగా ఉందన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది. చాలా చోట్ల ముఖ్యమంత్రులను మార్చి బీజేపీ విజయాలను అందుకుంది. కానీ కర్ణాటకలో మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ అవడం చాలా కష్టం. యడ్యూరప్పపై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఆయనను మార్చి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ని కూర్చోబెట్టారు. ఆయన పని తీరు కూడా అంతే దాంతో ఆయననూ మార్చాలనుకున్నారు కానీ వెనక్కి తగ్గారు. మొత్తంగా గత ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించినా అధికారం దక్కలేదని చెప్పుకుని ఈ సారి ప్రజల నుంచి భారీ మద్దతు కూడగట్టుకునే అవకాశాన్ని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా బీజేపీ పోగొట్టుకుంది. ఇతర పార్టీలకు అవకాశం కల్పించింది.

కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా బీజేపీ కాంగ్రెస్ కు మేలు చేసింది. ఆ ప్రభుత్వమే అధికారం లో ఉండి ఉంటే అధికార వ్యతిరేకత దెబ్బకు కాంగ్రెస్ కూడా చితికిపోయేది. కుమారస్వామి ముఖ్యమంత్రి అయినా ఆ ప్రభావం కాంగ్రెస్ పై ఎక్కువ ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ వచ్చింది. అన్ని రీజియన్లలోనూ కాంగ్రెస్ పార్టీ కాస్త ముందజలో ఉందన్న అభిప్రాయం అన్ని సర్వే సంస్థలూ వెల్లడిస్తున్నాయి. సెంట్రల్ కర్ణాటక కోస్టల్ కర్ణాటక గ్రేటర్ బెంగళూరు తెలుగు వాళ్లు అధికంగా ఉండే హైదరాబాద్ కర్ణాటక ముంబయి కర్ణాటక ఓల్డ్‌ మైసూర్‌లోనూ కాంగ్రెస్‌కే అడ్వాంటేజ్ ఉంది. అయితే బీజేపీ మరీ దారుణంగా ఓడిపోదన్న అభిప్రాయమూ ఉంది. అందుకే బీజేపీ చివరి క్షణంలో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను తొలగించి కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గా ఉన్న వక్కలిగలకు అ రిజర్వేషన్ కల్పిస్తోంది. ఇది ఆ ఎంత మేర ఓటు బ్యాంకును చీల్చినా తాము బయటపడతామని అనుకుంటున్నారు. కానీ ఇది రివర్స్ అవుతుందమో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు ఏకపక్షంగా పడేలా చేస్తుందేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కానీ భారత రాష్ట్ర సమితి అసలు  పట్టించుకోవడం లేదు. ఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలనుకున్న తర్వాత  కేసీఆర్ కు అత్యంత ఆప్తునిగా మారిన నేతలు జేడీఎస్ నేతలు. కుమారస్వామి ఆయన కుమారుడు పిలిచిందే తడవుగా హైదరాబాద్ వచ్చేవారు. కేసీఆర్ కూడా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తాం. కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావాల‌ని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక అని అక్కడ కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే పోటీ చేసే అవకాశం లేదని కేవలం జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ మద్దతు కూడా బీఆర్ఎస్ కోరుకోవడం లేదు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట కేసీఆర్ ప్రచారం కూడా ఉంటుందన్నారు కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మద్దతిస్తామని బీఆర్ఎస్ ఆసక్తి చూపినా కుమారస్వామి ఆసక్తిగా లేరని చెబుతున్నారు. కేసీఆర్ ను చూస్తే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమనేత మాత్రమేనని అలాంటి నేత తమ రాష్ట్రంకోసం పని చేస్తారంటే కన్నడ ప్రజలు నమ్మరని అది పార్టీకి మైనస్ అవుతుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ఆర్థిక సాయం ప్రచారం ఉన్నా కుమారస్వామి మాత్రం బీఆర్ఎస్‌తో వీలైనంత దూరం మెయిన్ టెయిన్ చేస్తున్నారు.  బీఆర్ఎస్ కూడా మహారాష్ట్ర లోకల్ పోల్స్ పై మాట్లాడుతోంది కానీ కర్ణాటక ఎన్నికలపై మాట్లాడటం లేదు.

మొత్తంగా కర్ణాటక ఎన్నికల్లో ఓ క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. బీజేపీ కక్కుర్తి పడటం వల్ల ఇబ్బంది పడుతోంది. బీజేపీ పనుల వల్ల కాంగ్రెస్ లాభపడుతోంది. జేడీఎస్ ఎప్పట్లాగే ఓ వర్గం ఓటర్ల మద్దతు పొందుతోంది. కానీ రాజకీయాలు డైనమిక్‌గా మారిపోతూ ఉంటాయి. ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయం ఉంది. ఈ లోపు ఏమైనా జరగవచ్చు. అంతిమంగా వచ్చే ఫలితాలే ఫైనల్.