మహారాష్ట్ర నుంచే గులాబీ బాస్ జైత్రయాత్ర

By KTV Telugu On 31 March, 2023
image

గులాబీ బాస్ జాతీయ జైత్రయాత్ర మహారాష్ట్ర నుంచే మొదలయ్యే అవకాశాలున్నాయి. రైతు జనాభా ఎక్కువగా ఉండే మహారాష్ట్రలో జనం ఇప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ కేసీఆర్ వైపు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వారి ఆలోచనలు ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లే వ్యూహాలు రచిస్తున్నారు. మహారాష్ట్ర వనరులు వాటిని ఉపయోగించుకోలేని పాలకుల అసమర్థతలను ఎండగడితే జనాన్ని తమ వైపుకు తిప్పుకునే వీలుంటుందని కేసీఆర్ విశ్వసిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పరంగా తమకు ప్రయోజనం కలగడమే కాకుండా మహారాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేసిన నేతగా తాను చిరస్థాయిగా నిలిచిపోతానని కేసీఆర్ విశ్వసిస్తున్నారు.

మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉండే పర్భణి లాతూర్ నాందేడ్ లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కేసీఆర్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. కాకపోతే అంతకుమించి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే లక్ష్యం అందులో కనిపిస్తుంది. ఫిబ్రవరి 5న తొలి సారి కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లి అక్కడ నాదేండ్ బహిరంగ సభలో మాట్లాడారు. మార్చి 26న మరోసారి ఆయన నాందేడ్ దగ్గరి కంధార్‌ లోహాలో బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ రెచ్చిపోయి ప్రసంగించినట్లు అనిపించినా కేసీఆర్ ప్రతీ మాటలో సహేతుకత కనిపించింది. తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఇన్ని రోజులు మహారాష్ట్రలో ఎందుకు లేదని ఆయన నిలదీస్తేగానీ అసలు కార్మిక కర్షక లోకానికి అర్థం కాలేదు. ఆడామగా పిల్లాజెల్లా ముసలీముతకా తేడాలేకుండా వచ్చిన పల్లె జనంలో కేసీఆర్ ను చూసిన తర్వాత కొత్త ఆశలు చిగురించాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌ను చూసి తెలంగాణ ప్రజల్లో కనిపించిన సంరంభం ఉద్వేగం ఇప్పుడు మరాఠ్వాడా గడ్డపై స్పష్టంగా కనిపించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ పథకాలపై జోరుగా చర్చ సాగుతుండగా తెలంగాణలో అమలవుతున్న దళితబంధు మహారాష్ట్రలో ఎందుకు అమలు కాదని కేసీఆర్ ప్రశ్నిస్తే సామాన్య జనానికి కూడా అవును అమలు చేయాల్సిందేనన్న అభిప్రాయం కలిగింది. అంబేద్కర్ పుట్టిన నేలపై దళిత బంధు లేకపోవడమేంటని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ మహారాష్ట్ర పథకాల అమలు తీరు ఇప్పుడక్కడ వాడవాడలా చర్చనీయాంశమవుతోంది.

అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ కేసీఆర్ లేననెత్తిన నినాదం ఒక సంబురంలా జనంలోకి దూసుకెళ్లిందనే చెప్పాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీలు కాకుండా రైతులు గెలువాలని కేసీఆర్ ఆకాంక్షించారు. నదుల నీరు సముద్రంలో కాకుండా సాగు భూములకు పారాలని గోదావరి పూర్ణ వార్ధా పెన్‌గంగ మంజీరా ప్రాణాహిత నదులను వినియోగించుకోవాలని కేసీఆర్‌ చెప్పిన మాటలు మహారాష్ట్రవాసులను ఆకట్టుకున్నాయి. గోదావరి కృష్ణా నదులకు పుట్టినిల్లయినా మహారాష్ట్రలో సాగు తాగు నీటి ఎద్దడి ఎవరి పాపమని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మోడల్‌గా మహారాష్ట్రలోని ప్రతి రైతుకు 10 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ను చూస్తూ మరాఠా రైతులు శరద్ అనంతరావ్ జోషిని గుర్తు చేసుకుంటున్నారు. పార్లమెంటు మాజీ సభ్యుడైన ఆయన స్కేత్కారీ సంఘటన్ ఏర్పాటు చేసి రైతులకు కొత్త టెక్నాలజీలు, మార్కెట్ వసతుల కోసం పోరాడారు. రైతులకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ ఆలోచన కూడా అదేనని వేరే చెప్పాల్సిన పనిలేదు.

కేసీఆర్ చెప్పిన ప్రతీ మాట మహారాష్ట్ర రైతాంగం తలకెక్కించుకుంది. వారికి ఇప్పుడాయన ఒక హీరో కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందేనన్న కేసీఆర్ వాదన జనానికి బాగానే నచ్చింది. ఎందుకంటే రెండు పార్టీల పాలనతో వాళ్లు విసిగిపోయారు. త్వరలోనే మహారాష్ట్రకు రాజకీయ తుపాను రావడం ఖాయమని కేసీఆర్ అంటుంటే జనం సంతోష పడ్డారు. ఎందుకుంటే వాళ్లు మార్పును కోరుకుంటున్నారు. బహిరంగ సభల కంటే ముందే నాందేడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. తెలంగాణలో అమలవుతున్న పథకాల వివరాలను డిజిటల్ పచార రథాల ద్వారా గ్రామాలకు చేర్చింది. ఆసరా పింఛన్లు రైతు బంధు రైతు బీమా ఉచిత విద్యుత్ కల్యాణలక్ష్మి కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతలను మరాఠీలో వివరిస్తూ డిజిటల్ ప్రచారం చేశారు.

రాజకీయ ఆకాంక్షలను కూడా కేసీఆర్ ఓపెన్ గానే వెల్లడించారు. మహారాష్ట్ర పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. నిజానికి తెలంగాణకు వెలుపల బీఆర్ఎస్ కు అది తొలి పరీక్ష అవుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగబోతున్నాయి. అందులో బీఆర్ఎస్ తీరు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. కాకపోతే కర్ణాటక కంటే కూడా మహారాష్ట్రపైనే గులాబీ దళపతి ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు భావించాల్సి ఉంటుంది.

మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కేసీఆర్ ప్రస్తుతం మరాఠ్వాటా ప్రాంతంలోని కొన్ని జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు. ఇంకా ఆయన పడమటి వైపుకు వెళ్లలేదు. అక్కడి ప్రజలు ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోలేదు. కాకపోతే కేసీఆర్ కు ఒక విషయం మాత్రం బాగానే అర్థమై ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికలను చూస్తే ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. అదే సీన్ రిపీటై వచ్చే ఎన్నికల్లో కూడా హంగ్ ఏర్పడితే తాను కింగును కాకపోయినా కింగ్ మేకర్ అవుతానని కేసీఆర్ కు తెలుసు. అందుకే పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన తొలుత ఒక ప్రాంతంపైనే దృష్టి పెట్టారని చెప్పుకోవాలి. ఇప్పటికే కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మానిక్ రావు కదం ఎన్సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే శంకరన్న మాజీ ఎమ్మెల్యే మనోహర్ పట్వారీ ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దగ్ధా పవార్ సహా పలువురు పేరున్న నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.