రష్యా చమురు ఎటెళ్తోంది.. ఇండియాలో ధరలెందుకు తగ్గట్లేదు

By KTV Telugu On 31 March, 2023
image

2013లో బ్యార‌ల్ ధ‌ర 110 డాల‌ర్లు ఉండ‌గా అప్ప‌టి పెట్రోల్ లీట‌ర్ ధ‌ర రూ.76 మాత్ర‌మే ఇప్ప‌డు బ్యార‌ల్ పెట్రోల్ 60 డాల‌ర్లు ఉండ‌గా లీట‌ర్ పెట్రోల్ ధ‌ర మాత్రం రూ.110 అయింది. రూ 50కి అమ్మాల్సిన పెట్రోల్ ను రూ. 110కి ఎందుకు అమ్ముతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్ రాసిన లేఖలో ప్రధాన ప్రశ్న ఇది. ఇది కేటీఆర్‌కు అడుగుతున్న ప్రశ్న కాదు దేశ ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న. ఓ వైపు మార్కెట్ ధర కన్నా తక్కువగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నారు. మరో వైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గిపోతున్నాయి. అయినా ఆ ప్రయోజనం ప్రజలకు ఎందుకు దక్కడం లేదు మధ్యలో ఏం జరుగుతోంది.

కొంత కాలంగా ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తూండటంతో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా పడిపోయింది. నిజానికి మన దేశంలో పెట్రోల్ డీజిల్ విషయంలో డైనమిక్ ప్రైసింగ్ అమలు చేస్తున్నారు. అంటే అంతర్జాతీయంగా పెరిగితే పెంచాలి తగ్గితే తగ్గించాలి కానీ పెంచితే పెంచుతున్నారు కానీ తగ్గితే మాత్రం తగ్గించడం లేదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న చివరి రోజుల్ోల అంటే 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉంది. దీనికి కారణం మోదీ సర్కార్ ఏర్పాటైన తర్వాత బాదిన పన్నులే. కనీసం పది సార్లు ఎక్సయిజ్ టాక్స్ పెంచారు. దీనికి కారణం క్రూడాయిల్ ధరల దగ్గుదల. ఆ తగ్గడం వల్ల వచ్చిన లాభాన్ని వినియోగదారులకు అందించకుండా ప్రభుత్వ ఖాతాలో వేసుకోవడం. కానీ అంతర్జాతీయ మార్గెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ధరలు పెంచకుండా ఉండాలి కానీ ప్రభుత్వం పెంచుకుంటూనే పోతోంది. యూపీఏ హయాంలో ఉన్నప్పుడు పన్నులు ఉంచితే చాలు పెట్రోల్ రేటు సగానికి తగ్గిపోతుంది

రష్యా ఉక్రెయిన్ యుద్ధం దేశానికి కొత్త సమస్య సృష్టించిందనుకున్నారు కానీ కొత్త అవకాశాలు కల్పించింది. రష్యా చమురు అతి తక్కువకు ఇండియా కొనుగోలు చేయడం ప్రారంభించింది. గతంలో మన దేశానికి రష్యా చమురు దిగుమతుల వాటా కేవలం 1 శాతంగా మాత్రమే ఉండేది ప్రస్తుతం ఇది 35 శాతానికి చేరింది. ఉక్రెయిన్‌ పై దాడితో అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి దీంతో రష్యా రాయితీ ధరలకే చమురును సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ కన్నా తక్కువ రేటుకే వస్తోంది మరి ధరలు మాత్రం తగ్గడం లేదు. మరి ఆ చమురు అంతా ఏమవుతోంది చౌక ధరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ రిటైల్‌ ధరలు మాత్రం తగ్గడంలేదు. ఇందుకు ప్రధాన కారణం ఆ చమురు ప్రజలకు చేరడం లేదు కార్పొరేట్ కంపెనీలకు చేరుతున్నాయి. మన దేశానికి వస్తున్న చమురులో 45 శాతం వరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నయారా ఎనర్జీలకే వెళ్తోంది. చౌక చమురు మూలంగా ప్రైవేట్‌ రంగ చమురు కంపెనీలు అత్యధికంగా లాభపడుతున్నాయి. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ దేశాలు యూరోపియన్‌ దేశాలతో పాటు పశ్చిమాసియా దేశాలకు చమురు ఎగుమతి చేస్తున్నాయి. రష్యా ఇస్తున్న రాయితీ మూలంగా ప్రైవేట్‌ చమురు కంపెనీలు అత్యధికంగా లాభపడ్డాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత ప్రైవేట్‌ కంపెనీలు వేగంగా నిర్ణయం తీసుకుని రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు చేసుకోవడం ప్రారంభించాయి. 2023 ఫిబ్రవరిలో రికార్డ్‌ స్థాయిలోరోజుకు 16 లక్షల పీపాలకు పైగా చమురు దిగుమతి అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. రష్యా నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు భారీగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తే దాని ఫలితాలను వినియోగదారులకు లభించేవి కానీ ప్రైవేటు కంపెనీలకు చాన్సిచ్చారు. ఇలా ఎందుకిచ్చిరానేది అందరికీ వస్తున్న డౌట్.

పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల వాటి ధర మాత్రమే పెరగదు. పేద మధ్యతరగతి ప్రజలపై నేరుగా భారం పడుతుంది. రవాణా చార్జీలు పెరిగితే అన్నింటి ధర పెరుగుతుంది. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచుకి చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత 45 ఏళ్లలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్బణం దేశాన్ని పట్టిపీడిస్తోంది. అయితే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా పన్నులు ఆర్జించే అతి పెద్ద సాధనం చమురు ఉత్పత్తులు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు రూ.8 లక్షల కోట్లు ఆర్జించాయి గత ఆరు సంవత్సరాల్లో పెట్రోలు & డీజిల్‌పై పన్నుల రూపంలో ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం 36.66 లక్షల కోట్లు ఇందులో కేంద్రం వాటానే ఎక్కువ. సెస్సుల పేరుతో లీటర్‌పై పది రూపాయలకుపైగానే వసూలు చేస్తోంది ఇదంతా ప్రజల సొమ్ము. ఒక్క ఏడాదే ఎనిమిది లక్షల వరకూ పెట్రోల్ మీద ప న్నుల రూపంలో ప్రజల్ని దోపిడీ చేస్తూంటే ఇక ప్రజలు ఆర్థికంగా ఎలా ఎదుగుతారు ఈ పాపంలో కేంద్రానికి మెజార్టీ షేర్. రాష్ట్రాలదేం తప్పు లేదని చెప్పలేం.