వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని పార్టీలు బీ టీంలను సిద్దం చేసుకుంటున్నాయి. కొన్ని చిన్న పార్టీలు వేరే పెద్ద పార్టీలకు మేలు చేసేందుకే ఎన్నికల బరిలో దిగి కొద్ది పాటి ఓట్లు చీలుస్తారని రాజకీయ పండితులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉన్నా ఇపుడీ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చాలా రాష్ట్రాల్లో బీ టీంలు ఉన్నాయి. బిజెపికి బద్ధ విరోధిగా చెలామణీ అయ్యే పార్టీలు కూడా అందులో ఉండడం విశేషం. ప్రత్యేకించి ముస్లింల ప్రయోజనాలే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు అయిన మజ్లిస్ పార్టీకి బిజెపి నాయకత్వంతో మంచి అవగాహన ఉందని ప్రచారం జరుగుతోంది. పైకి ఒకరి నొకరు తిట్టుకునే ఈ రెండు పార్టీలూ కూడా తెరచాటు స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని అంటున్నారు. మజ్లిస్ సాయంతోనే కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ముస్లిం ఓట్లను భారీగా చీల్చడం ద్వారా బిజెపి విజయాలు నమోదు చేసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్రలో మజ్లిస్ అండతోనే బిజెపి కాంగ్రెస్ ను చావు దెబ్బ తీయగలిగింది. ఈ క్రమంలోనే ఔరంగాబాద్ లో పాతికేళ్ల తర్వాత మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది.
గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి ఇదే అస్త్రాన్ని ప్రయోగించింది. ముస్లిం ఓటర్లుఎక్కువ సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ బరిలో ఉంది. మజ్లిస్ చీల్చిన ఓట్ల కారణంగానే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కొద్దిలో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. మజ్లిస్ అడ్డు లేకుండా ఉంటే తేజస్వి యాదవ్ కు సరిపడ మెజారిటీ వచ్చేది. మజ్లిస్ కు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో లాంతరు పార్టీ ఓటమి చెందడమే దానికి నిదర్శనం. అంతే కాదు రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడి పార్టీని కూడా బరిలో దింపింది బిజెపియే. ఆయన కూడా ఆర్జేడీ ఓట్లకు గండి కొట్టారు అది తేజస్వికి నష్టం చేకూర్చింది. సో మజ్లిస్ ఒక బీ టీం అయితే పాశ్వాన్ పార్టీ మరో బీ టీం అన్నమాట. ఇదే వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్ లోనూ అమలు చేసింది బిజెపి నాయకత్వం. అయితే బెంగాల్ ముస్లింలు ఈ ట్రాప్ లో పడలేదు వారు మజ్లిస్ పార్టీని ఔట్ రైట్ గా తిరస్కరించారు. తమకి ఏళ్ల తరబడి అండగా ఉంటోన్న మమతా బెనర్జీకే వారు ఓటు వేశారు. అందుకే బెంగాల్ లో బిజెపి ప్లాన్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని బెంగాల్ లో తనకి తిరుగులేదని చాటుకుంది. మజ్లిస్ అస్త్రాన్ని వచ్చే తెలంగాణా ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. పార్టీ కూడా ఉపయోగించుకోవాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము 50 స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మజ్లిస్ పార్టీ ఏడుగురు ఎమ్మెల్యేల పార్టీ అని బి.ఆర్.ఎస్. చేసిన వ్యాఖ్యకు కౌంటర్ గా అక్బరుద్దీన్ ఈ ప్రకటన చేశారు. అయితే అది కేవలం కౌంటర్ కోసమే అన్నారా లేక నిజంగానే మజ్లిస్ ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అన్నది చర్చనీయాంశమవుతోంది. నిజానికి మజ్లిస్-బి.ఆర్.ఎస్. ల మధ్య ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. రెండూ మిత్రపక్షాలుగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మజ్లిస్ ను బరిలో దించాలన్నది కేసీయార్ చాణక్యంగా చెబుతున్నారు. బిజెపికి తమని బీటీం అనడంపై మజ్లిస్ పార్టీ మండి పడుతోంది. తాము ఎవరికీ బీ టీం కాదని దేశ వ్యాప్తంగా తమ పార్టీని విస్తరించుకుంటున్నామని బలోపేతం అవుతున్నామని అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు.
ఇక తెలంగాణా ఎన్నికలకోసం బిజెపి బి.ఆర్.ఎస్. లు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణాలో కొత్తగా అవతరించిన వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ కూడా ఎవరో ఒకరి వ్యూహంలోంచే పుట్టిందని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్. షర్మిల ఈ పార్టీని స్థాపించారు. తెలంగాణాలో వై.ఎస్.ఆర్.కు పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. దాన్ని బ్రేక్ చేయడం కోసమే షర్మిల చేత పార్టీ పెట్టించి ఉంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే అజెండాగా షర్మిల పార్టీ పెట్టారని వారంటున్నారు. మీకూ మీ అన్నకూ తగాదాలు ఉంటే పోయి ఏపీలో చూసుకోవాలి కానీ తెలంగాణాలో పార్టీ ఎందుకు పెట్టారని వారు నిలదీస్తున్నారు. అయితే తాను పుట్టింది పెరిగింది తెలంగాణాలోనే అని షర్మిల వివరణ ఇచ్చారు. తాను పెళ్లి చేసుకుంది కూడా తెలంగాణా వాసినే అని ఆమె అంటున్నారు. అందుకే తెలంగాణా ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయ పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. తన తండ్రి తెలంగాణాకు చాలా చేశారని ఆయన అడుగు జాడల్లో తాను కూడా మంచి పనులు చేద్దామనే వచ్చానని షర్మిల అంటున్నారు. ఆమె చీటికీ మాటికీ ముఖ్యమంత్రి కేసీయార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతకీ షర్మిల పార్టీ ఎవరికి బీ టీం బి.ఆర్.ఎస్. కా లేక బిజెపికా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణా తెలుగుదేశం పార్టీ కూడా ఏదో ఒక వ్యూహంతోనే హడావిడి పెంచిందని అంటున్నారు. టిడిపికి కూడా తెలంగాణాలో కొంతమేరకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. టిడిపి బరిలో లేకపోతే ఆ ఓట్లు ఏదో ఒక పార్టీకి పడతాయి. అదే టిడిపి రంగంలో ఉంటే వారు టిడిపికే వేస్తారు. సీట్లు గెలవకపోయినా ఓట్లు చీల్చడానికి మాత్రం టిడిపి పనికొస్తుంది. కాకపోతే టిడిపి చీల్చే ఓట్లు ఎవరికి మేలు చేస్తాయన్నదే ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఇపుడు గాఢంగా కోరుకుంటున్నది ఒకటే. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన లక్ష్యం. దానికి బిజెపి నో చెప్పడంతో ఆయన దిగాలు పడ్డారు అయితే తన ప్రయత్నాలను మాత్రం ఆయన ఆపలేదు. ఇపుడు తెలంగాణాలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోన్న బిజెపికి తాను పరోక్షంగా సహకరిస్తే ఏపీలో తమతో పొత్తుకు బిజెపి ఒప్పుకుంటుందన్నది టిడిపి వ్యూహం. అందుకే కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణాపై దృష్టి సారించారన్నది రాజకీయ పండితుల అంచనా. ఇక తెలంగాణాలో కాపు సామాజికవర్గం ఓట్లు కూడా చాలానే ఉన్నాయి. వాటిని చీల్చేందుకే జనసేనను రంగంలోకి దింపాలని బిజెపి భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చే తెలంగాణా ఎన్నికల్లో సత్తా చాటుతామని ప్రకటించారు.
అంటే పెద్ద సంఖ్యలో జనసైనికులను బరిలోకి దింపడానికి సిద్ధమయ్యారనే అనుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో టిడిపి వ్యతిరేక ఓట్లు చీల్చడంతో పాటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు నాయుడు రకరకాల వ్యూహాలు అమలు చేశారు. చంద్రబాబు సూచనతోనే గత ఎన్నికల్లో జనసేన బిఎస్పీతో జట్టు కట్టింది. బి.ఎస్.పి. రంగంలో ఉంది కనక దళిత ఓటు బ్యాంకుకు భారీగా గండికొట్టచ్చని చంద్రబాబు నాయుడు భావించారు. అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కు పడే క్రైస్తవ ఓట్లను చీల్చేందుకు కె.ఏ. పాల్ ప్రజాశాంతి పార్టీకి వెనకనుండి చంద్రబాబు దన్నుగా నిలిచారని ప్రచారం జరిగింది. కానీ ఆ వ్యూహం బెడిసి కొట్టింది. దళితులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. అందుకే వైసీపీ ఘన విజయం సాధించగలిగింది. ఇపుడు రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకే జనసేన బిజెపిలతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఇలా చిన్న రాజకీయ పార్టీలను బీ టీంగా వాడుకోవడంలో జాతీయ పార్టీలదే అగ్రస్థానం. అవసరాలు కూడా వాటికే ఉంటాయి. అయితే ఓటర్లు తెలివిగా ఉంటే ఈ అస్త్రాలు ఎందుకూ కొరగావని రాజకీయ పండితులు అంటున్నారు.