ఎంతవారలైనా కాంతాదాసులే అందులో నోడౌట్. ట్రంప్ కూడా ఉప్పూకారమే తింటున్నాడుగా ఆయన వీక్‌నెస్ ఆయనకుంది. కాకపోతే అయ్యగారు ఏదీ తిన్నగా చేయడుగా అమెరికన్ ప్రెసిడెంట్ కాకముందే ఆయన బిజినెస్‌మ్యాన్. ప్రతీదీ లెక్కాపత్రం జమాఖర్చు అన్నీ కనిపిస్తుండాలి. ఈ కక్కుర్తి వ్యవహారమే సారువాడి కొంపముంచింది. మాజీ పోర్న్‌స్టార్‌తో అగ్రరాజ్య మాజీ అధిపతికి సంబంధాలున్నాయి. అయితే ఆరిలేషన్ బయటపడకుండా చూసుకునేందుకు డబ్బిచ్చి ఆమెతో అనధికారిక ఒప్పందం చేసుకున్నాడట శ్రీమాన్ డొనాల్డ్ ట్రంప్. అదిప్పుడు ఆయన పీకలకు చుట్టుకుంది.
పోర్న్‌స్టార్‌తో అనైతిక ఒప్పంద వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు దాదాపు రుజువైనట్లే. అరెస్ట్‌కు కోర్టు ఆదేశాలు ఇవ్వడానికి ముందే స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోవాలనుకుంటున్నాడట మిస్టర్ ట్రంప్. సారుకి బేడీలేయకుండా ఆయన లీగల్ టీమ్ అన్ని లొసుగులూ వెతుకుతోంది. ట్రంప్‌కి ఈ మొత్తం కంపు వ్యవహారంలో ఊరటనిచ్చే విషయమేంటంటే సెక్స్ స్కాండల్‌లో దోషిగా తేలినా ఆయన నిక్షేపంగా 2024 అధ్యక్ష ఎన్నికలకు పోటీపడొచ్చు. ఎందుకంటే 2022 నవంబరులోనే ట్రంప్ తన అభ్యర్థిత్వ పత్రాలను దాఖలు చేశారు. పోటీ అయితే చేయొచ్చుగానీ నైతికంగా ఆయన నిలబడటం కష్టమే.
లైంగిక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు స్టార్మీ డేనియల్స్ అలియాస్ స్టెఫానీ క్లిఫార్డ్ అనే పోర్న్ స్టార్‌తో ట్రంప్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు తన లాయర్ ద్వారా ఆమెకు లక్షా 30 వేల డాలర్లని ట్రంప్ ముట్టజెప్పాడు. నాలుగ్గోడల మధ్య జరిగింది మూడోకంటికి తెలియదనుకుంటే రెండేళ్లతర్వాత మీడియా ముందుకొచ్చింది ఆ పోర్న్ స్టార్. ట్రంప్‌తో తనకు జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్‌ఏంజెల్స్ కోర్టులో దావా వేసింది. ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జరిగిందీ సంచలనం. అప్పుడు రహస్యంగా విచారించినా ఇప్పుడు మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు నిరూపణ కావటంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లే. అయితే ఇంత దూరం వచ్చాక కూడా ఇది రాజకీయ కుట్రేనంటున్నారు ట్రంప్. దీన్ని ఎలా ఫేస్ చేయాలో తనకు తెలుసంటూ సోషల్‌మీడియాలో సవాళ్లు విసురుతున్నారు. పరువు పోయాక ఎంత బుకాయించినా ఏం లాభం!