ఏపీ పొత్తులు బీజేపీ చేతిలో

By KTV Telugu On 1 April, 2023
image

తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా ఆంధ్రప్రదేశ్ లో తదుపరి అధికారం ఎవరిదన్న ప్రశ్నే తలెత్తుతోంది. జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటాడా చంద్రబాబు మళ్లీ గెలుస్తాడా అన్న చర్చ తారా స్థాయికి చేరుకుంది. గెలవాలంటే ఏం చేయాలన్న మాట కూడా మొదలైంది. జగన్ కు కొట్టాలంటే పొత్తులు తథ్యమన్న వాదన కూడా బలపడుతోంది. దానితో టీడీపీ జనసేన కలుస్తాయా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగానే కొనసాగుతోంది.

నిజానికి క్షేత్ర స్థాయిలో వైరుధ్యాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు. విజయవాకాశాలున్నట్లు రెండు పార్టీలు బలంగా విశ్వసిస్తున్న చోట్ల మాత్రం కలిసి నడిచేందుకు ఇష్ట పడటంలేదు. అదే పొత్తులపై సస్పెన్స్ కొనసాగడానికి కారణమవుతోంది. పైగా ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ బలం బాగా పెరిగింది. గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చి భంగపడిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బలం రెట్టింపు అయిందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి జనసేన ఒంటరిగా పోటీ చేసినా 12 శాతం వరకు ఓట్లు వస్తాయట. అదే 2024 నాటికి ఆ బలం 15 శాతం వరకు పెరగొచ్చు. ఆ బలం మొత్తం వైసీపీ నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యిందని అంటున్నారు.

ఇటు టీడీపీ అటు జనసేన ఒంటరిగా గెలివలేవని భావిస్తున్న తరుణంలో పొత్తులపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో ఒక బలమైన విశ్లేషణ ప్రధాని మోదీ వైపు చూపిస్తోంది. ఏపీ పొత్తులు మోదీ కన్నుసన్నల్లో ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. జగన్ ఇప్పుడు మోదీకి అత్యంత ప్రీతిపాత్రుడైన నమ్మిన బంటు అని అదే విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మోదీ చెప్పినట్లు వింటున్నారని మోదీ ఏం చేయమంటే అది చేస్తారని కొందరు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ఓడించాలని మోదీ అనుకుంటేనే ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమని రాజకీయ పండితులు వ్యూహకర్తల విశ్లేషణగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

చంద్రబాబు పట్ల మోదీకి ప్రస్తుతం అంత వ్యతిరేకత లేదు. కొంత సానుకూలత ఏర్పడినా పూర్తి అభిమానమైతే లేదు. దానితో చంద్రబాబును ప్రోత్సహించాలా జగన్ నే భుజం తట్టాలా అని ఆయన ఇంకా నిర్ణయించుకోలేదు. జగన్ ను వద్దనుకున్న రోజున పవన్ ను పిలిచి చంద్రబాబుతో కలిసి పోవాలని మోదీ ఆదేశిస్తారన్నది ఒక బలమైన వాదన. మోదీ ఆశీస్సులతో పొత్తు పెట్టుకున్న పక్షంలో తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో తను అనుకున్నవి సాధిస్తానని కూడా పవన్ నమ్ముతున్నారు.

ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు కూడా మోదీ పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిచి మోదీ ప్రధాని అయితే తాను సీఎంగా ఉంటూ ఇబ్బంది పడకుండా ముందుకు సాగే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బీజేపీ పట్ల పూర్తి సానుకూల వైఖరిని పాటిస్తున్నారు కేంద్రంతో సఖ్యతగా ఉంటే అమరావతి నిర్మాణం సహా అన్ని పనులు సాధ్యమవుతాయి. అప్పుడే నవ్యాంధ్రతో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత దశాబ్దం కాలంగా పరిస్థితులు చూసిన తర్వాత కేంద్రంతో తగవు అంత మంచిది కాదని చంద్రబాబు లాంటి రాజకీయవేత్తకు బాగానే తెలుసుని చెప్పాల్సి ఉంటుంది. అందుకే మోదీ పిలిచి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ తో పోత్తును ప్రకటించాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

నిజానికి ఏపీలో బీజేపీ చాలా వీక్. గత ఎన్నికలే ప్రామాణికమైతే ఆ పార్టీకి రెండు శాతం ఓట్లు కూడా లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ అభివృద్ధి చెందినది కూడా లేదు. పైగా కన్నా లక్ష్మీ నారాయణ లాంటి బలమైన నాయకుడు పార్టీని వదిలి వెళ్లాడు. అలాంటి పరిస్థితిలో ఏపీలో ఏదో చేసేయ్యాలని తెగ సాధించాలని మోదీ అమిత్ షా ఆలోచించే అవకాశం లేదు. ఏపీలో కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే చాలని మాత్రమే మోదీ ఎదురు చూస్తున్నారు. అదీ పార్లమెంటు ఎన్నికల్లో తమకు కొన్ని సీట్లు తగ్గితే అవి తెలుగు రాష్ట్రాల మిత్ర పక్షాల నుంచి భర్తీ చేసుకోవచ్చని కూడా వారి ఆలోచన. ఆ దిశగా ప్రస్తుతం జగన్ బీజేపీకి సానుకూలంగా ఉన్నారనే చెప్పాలి. రేపు చంద్రబాబు ప్రియమైన స్నేహితుడు అని భావిస్తే జగన్ ను దెబ్బకొట్టి బాబుతో కరచాలనం చేస్తారు. అప్పుడు జనసేనకు కూడా ఉపయోగమే అవుతుంది.