ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతీదీ రాజకీయమే. రాజకీయ కక్షలు తీర్చుకోడానికి ఏ అంశాన్నైనా తెరపైకి తెచ్చేయచ్చని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలు పెట్టిన రోజు నుంచే ప్రతిపక్ష తెలుగుదేశం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారని ఆరోపించడం మొదలు పెట్టింది. జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో రెండేళ్లకు పైగా కరోనా సంక్షోభం మిగిల్చిన ఆర్ధిక మాంద్యం నమిలేసింది. అంతటి అననుకూల పరిస్థితుల్లోనూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు పేరుతో జగన్ మోహన్ రెడ్డి రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. ఈ పథకాల ముసుగులో పన్నులు చెల్లించే వారి డబ్బును జగన్ మోహన్ రెడ్డి పప్పు బెల్లాల్లా పంచిపెట్టేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ వచ్చారు. ఇలాగేపోతే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగే దివాళా తీయడం ఖాయమని కూడా ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇతర టిడిపి నేతలు చేస్తోన్న ఈ ఆరోపణల్లో పస ఉందా అని ఆరా తీస్తే కళ్లు చెదిరే వాస్తవాలు కనపడతాయి. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్మోహన రెడ్డి పాలనలో అప్పులు విపరీతంగా చేసేశారని ఎనిమిది లక్షలకు పైగా అప్పులు పేరుకుపోయాయని టిడిపి హయాంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వివరణల్లో టిడిపి చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకలే అని తేలింది. అది కూడా టిడిపి ఎంపీలు అడిగిన ప్రశ్నలకే కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాధానాలతో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలను చూస్తే చంద్రబాబు నాయుడి హయాంతో పోలిస్తే జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే తక్కువ అప్పులు చేసినట్లు నిరూపితం అయ్యింది. ఆర్ధిక ప్రగతి రాష్ట్ర జి.ఎస్.డి.పి. వృద్ధి రేటు కూడా బాబు హయాంతో పోలిస్తే అద్భుతంగా ఉందని నీతి అయోగ్ కితాబు నిచ్చింది. ఏపీలో కొత్త పరిశ్రమలు పెట్టుబడుల విషయంలోనూ చంద్రబాబు నాయుడి హయాంతో పోలిస్తే జగన్ మోహన్ రెడ్డి హాయంలోనే రాష్ట్రం ప్రగతి సాధించిందని కేంద్రం నివేదికలే స్పష్టం చేశాయి. అంతే కాదు రాష్ట్రానికి చెందిన కొన్ని లక్షల కోట్ల నిధులు ఎక్కడికి తరలిపోయాయో అర్ధం కావడం లేదంటూ వాటికి లెక్కా పత్రాలు లేవంటూ టిడిపి ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే జవాబు ఇచ్చింది. అలా లక్షల కోట్లు లెక్కా పత్రం కాకుండా మాయం అయ్యింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో టిడిపి ఎంపీ నీళ్లు నమలాల్సి వచ్చింది. కేంద్రం స్పష్టం చేసినా టిడిపి నేతలు తమ విమర్శలు మాత్రం అలానే కొనసాగించడం విశేషం.
ప్రభుత్వ ఖజానా దివాళా తీసిందని సంక్షేమ పథకాలతో ఏపీని నిండా ముంచారని టిడిపి ఓ పక్క విమర్శలు చేస్తూనే మరో పక్క తాము అధికారంలోకి వస్తే ఈ పథకాలను ఎత్తివేస్తామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మద్దని తాము ఇంత కన్నా బాగా ఈ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు అండ్ కో అంటున్నారు. అంటే టిడిపి ఇవే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏపీ శ్రీలంక కాదా అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటూ చంద్రబాబు యనమల రోజు విడిచి రోజు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి గతంలో ఈ ఇద్దరు నేతలు ఏమన్నారో ఓ సారి గుర్తు చేసుకోవాలి. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అన్నారు. విభజన కష్టాల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందన్నారు దీన్నుండి ఏపీ కోలుకోవాలంటే ఎంత లేదన్నా ఆరేళ్లు పడుతుందని కూడా చంద్రబాబు అన్నారు. అంటే 2024 వరకు ఏపీ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉంటుందని ఆయన 2018లోనే చెప్పారు.
చంద్రబాబు నాయుడు అధికారం నుంచి తప్పుకుని జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదికే కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా ప్రపంచ దేశాలన్నింటినీ గడ గడ లాడించింది ఆర్ధిక వ్యవస్థలన్నీ కుప్ప కూలాయి. ఆదాయాలన్నీ పడిపోయాయి ఖర్చులు మాత్రం అలానే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాయే ఆర్ధిక సంక్షోభం నుండి ఎలా బయట పడాలో అర్ధం కాక తల పట్టుకుంది యూరప్ దేశాలు అయితే ఇప్పటికీ కోలుకోలేదు. ఇంతటి సంక్షోభం సహజంగానే భారత దేశాన్ని ఇక్కడ ఏపీని ఇబ్బంది పెట్టింది. దీని గురించి ఏమీ తెలీనట్లు చంద్రబాబు నాయుడు తన హయాంలో ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉన్నట్లు ఇపుడే అది అధ్వాన్నం అయిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2019 ఎన్నికల్లో టిడిపి 23 స్థానాలకు పరిమితం అయ్యింది 151 స్థానాలు గెలుచుకున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సమాయత్తం అవుతున్నారు.
సరిగ్గా ఆ తరుణంలో టిడిపి హయాంలో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన యనమల మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఎలా పాలన చేస్తారో చూస్తామని సవాల్ విసిరారు. ఖజానాలో 100 కోట్లు కూడా లేకుండా ఖర్చు పెట్టేశాం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకవు. ఎందుకంటే ఏపీకి ఎంత వరకు అవకాశం ఉందో అంతమేరకు మేమే అప్పులు చేసేశాం. ఇక జీతాలు ఎలా ఇస్తారో రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారో చూస్తాం అంటూ యనమల వ్యాఖ్యానించారు. దీనర్ధం ఏంటి 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచే పరిస్థితులు లేవని ముందుగానే ఊహించారు కాబట్టే చంద్రబాబు నాయుడి కేబినెట్ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందా తమని ఓడించి అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే అవకాశం ఉన్న మేరకు ఎడాపెడా అప్పులు చేసేసి కొత్త ప్రభుత్వానికి అప్పులు రాకుండా చేయాలని వ్యూహ రచన చేశారా అన్న అనుమానాలు సహజంగానే వస్తాయి. ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు యనమల రామకృష్ణుడు కానీ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం హుందాగా లేకపోవడమే కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ ఇద్దరు నేతలకూ కనీస బాధ్యత కూడా లేదని ఆ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. చంద్రబాబు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏపీ దివాళా తీసేస్తుందని చంద్రబాబు సిఎంగా ఉంటే గుప్తుల స్వర్ణ యుగంలా ఏపీ వెలిగిపోతూ ఉంటుందన్నట్లుగా టిడిపి నేతలు చేసే ప్రచారాలు సమంజసం కావనేది విశ్లేషకులు చెప్పే మాట.