కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అసలైన అగ్ని పరీక్ష కర్నాటక ఎన్నికలే. తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఖర్గేపైనే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ ఎన్నికల్లో కూడా కర్నాటకలో కాంగ్రెస్ గెలవలేకపోతే మాత్రం ఆయన విమర్శల పాలు కాక తప్పదు. అదే సమయంలో కాంగ్రెస్ భవిష్యత్ పైనా ఆందోళనలు పెరగడం ఖాయం. సోనియా రాహుల్ గాంధీలు పార్టీ అధ్యక్ష పదవికి విముఖత వ్యక్తం చేయడంతో పార్టీ అధ్యక్ష పదవికి ముందుగా అశోక్ గెహ్లాట్ ను అనుకున్నారు సోనియా గాంధీ. అయితే పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి కూడా కావాలని పట్టుబట్టారు గెహ్లాట్. ఒక వ్యక్తికి రెండు పదవులు కుదరవని తేల్చి చెప్పడంతో రాజస్థాన్ లో తన స్థానంలో తాను చెప్పిన వ్యక్తినే సిఎంని చేయాలన్నారు. ప్రత్యేకించి సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిని చేయడానికి వీల్లేదంటూ పేచీ పెట్టారు. తన అనుచరలచేత హంగామా చేయించారు. దీంతో గాంధీలకు మండుకొచ్చంది గెహ్లాట్ మనకి తగిన వాడు కాడు అని నిశ్చయించుకున్నారు. తమ కుటుంబానికి విధేయుడైన మల్లికార్నున ఖర్గేని తెరపైకి తెచ్చారు. దళితుడు కావడం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండడం సోనియా గాంధీకీ వీర విధేయుడు కావడం మల్లిఖార్జున ఖర్గేని ఎంపిక చేయడానికి కారణాలుగా చెబుతారు రాజకీయ పండితులు.
మల్లిఖార్జున ఖర్గే అధ్యక్ష పదవిని స్వీకరించిన వెంటనే ఇంకా సరిగ్గా కుర్చీలో కుదురుకోకుండానే గుజరాత్ హిమాచల ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు వచ్చాయి. 182 నియోజకవర్గాలున్న గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అధ్యక్షుడిగా ఖర్గేకి ఇదు చేదు అనుభవమే కావచ్చు కానీ ఓటమికి ఖర్గేని బాధ్యుణ్ని చేయలేం. కానీ ఇపుడు కర్నాటకలో జరగనున్న ఎన్నికలు మాత్రం ఖర్గే నాయకత్వ పటిమకు పరీక్షే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు జరగబోయేది ఎక్కడో కాదు సాక్షాత్తూ ఖర్గే సొంత రాష్ట్రంలో. ఖర్గేకి ఓ సానుకూల అంశం కూడా ఉంది అయిదేళ్ల బిజెపి పాలనపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అయితే దాన్ని అధిగమించి మరోసారి అధికారంలోకి రావడానికి మోదీ అమిత్ షాలు మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంటున్నారు. కర్నాటకలో రెండు సార్లు మాత్రమే బిజెపి 100 సీట్ల మార్క్ ను టచ్ చేసింది. ఈ సారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావాలని బిజెపి పట్టుదలగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనపడుతోంది. కర్నాటకలో ప్రాంతాలు సామాజికవర్గాల గురించి ఖర్గేకి పూర్తిగా తెలుసు. అందుకే అభ్యర్ధుల ఎంపికలో అందరికన్నా ముందుగా కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. 124 మందితో మొదటి జాబితాను ప్రకటించి దూకుడు ప్రదర్శించింది కాంగ్రెస్. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే బిజెపిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు రాజకీయ పండితులు. అందులోనూ మోదీ షా కాంబో మామూలుది కాదు. అసాధ్యాలను సుసాధ్యాలు చేయడంలో ఈ కాంబోకు తిరుగే లేదంటారు. బిజెపి ఎన్నికల ప్రచారాన్ని మోదీ అమిత్ షాలే ముందుకు నడిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం లో సోనియా రాహుల్ గాంధీలు ఎంత సమయం కేటాయిస్తారో చూడాలి. గుజరాత్ ఎన్నికల సమయంలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ఇంచుమించు పట్టించుకోలేదు. పార్టీ ఘోర పరాజయానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే వాళ్లు కానీ ప్రజలను ఆకట్టుకునే నేతలు కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో లేరు. దానికి భిన్నంగా బిజెపి ఎన్నికల ప్రచారంలో మోదీ షా నడ్డాలు సుడిగాలి పర్యటలను చేశారు. అమిత్ షా అయితే గుజరాత్ లోనే మకాం వేశారు. ఇపుడు కర్నాటకలో గాంధీ కుటుంబీకులు ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. మల్లిఖార్జున ఖర్గేకి అపార రాజకీయ అనుభవం అయితే ఉంది కానీ జనాకర్షక నాయకుడు కారు. ఆకట్టుకునే ప్రసంగాలూ చేయలేరు. పైగా ఎనిమిది పదులు దాటిన ఖర్గే చురుగ్గా పర్యటనలు చేయడమూ కష్టమే. ఈ అంశమే ఖర్గేకు ప్రధాన లోపంగా కనిపిస్తోంది.
ఖర్గే మాదిరిగానే సోనియా గాంధీ కూడా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అసలు అధ్యక్ష పదవి నుండి ఆమె తప్పుకున్నదే దానికోసం. అంచేత ఎన్నికల ప్రచారంలో సోనియా నుండి ఎక్కువ ఆశించడం పొరపాటే అవుతుంది. ఇక దృష్టి సారించాల్సింది రాహుల్ గాంధీ ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీలే. ఈ ఇద్దరూ కర్నాటక ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తే కాంగ్రెస్ కు కచ్చితంగా లబ్ధి చేకూరుతుందంటున్నారు. వీరి ప్రచారానికి ప్లాన్ చేయాల్సింది కూడా పార్టీ అధ్యక్షుడైన ఖర్గేనే. ఇద్దరిలోనూ ప్రియాంక గాంధీ అచ్చం వాళ్ల నానమ్మ ఇందిరా గాంధీ పోలికలతో ఉండడం ఒక అడ్వాంటేజ్ కావచ్చునంటున్నారు. రాహుల్ గాంధీ కొంత కాలంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి మోదీల ఇంటి పేరును అవమానించారన్న కేసులో జైలు శిక్ష పడి లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడ్డ తర్వాత రాహుల్ గాంధీ దూకుడు మరింతగా పెరిగింది. ఒక పక్క ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ అమాంతం పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ ఎండగడుతోన్న తీరు కూడా ఆయన గ్లామర్ ను పెంచింది. గతంతో పోలిస్తే రాహుల్ గాంధీ రాజకీయ పరిణతితో వ్యవహరిస్తున్నారన్న పేరూ వచ్చింది. ఇవన్నీ కూడా మల్లిఖార్జున ఖర్గేకు సానుకూల అంశాలు.
రాజకీయ వ్యూహాలు పన్నడంలోనూ వాటిని పకడ్బందీగా అమలు చేయడంలోనూ ఖర్గే ఛాంపియనే అంటారు కన్నడ కాంగ్రెస్ నేతలు. కర్నాటకలో కాంగ్రెస్ వైభవం వెలిగిన రోజుల్లో మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లే వచ్చి ఖర్గేకి దూరంగా జరిగిపోయింది ఆ బాధ ఖర్గేలో ఉంది కూడా. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖర్గే నుండి ఆశించేది ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నడ సీమలో కాంగ్రెస్ రాజ్యాన్ని ఆవిష్కరించడమే. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే దాని ప్రభావం ఈ ఏడాది వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పై కచ్చితంగా ఉంటుంది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. అది 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. కర్నాటకతో పాటు ఆ తర్వాత మధ్య ప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తే ఖర్గే కీర్తి అమాంతం ఆకాశాన్ని అంటుతుంది. 2024లో పార్టీని సొంతంగా అధికారంలోకి తీసుకురాలేకపోయినా యూపీయే 3 ప్రభుత్వం ఏర్పడేలా ఖర్గే పార్టీని నడిపితే యూపీయే 3లో ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అందుకే ఈ ఎన్నికలను ఖర్గే చాలా సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను నిజం చేస్తూ ముందుగా కర్నాటకలో కాంగ్రెస్ ను గెలిపించడం ఖర్గే ముందున్న తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత జైత్ర యాత్ర చేయాలి. అపుడే ఆయన ప్రధాని పీఠంపై మెరిసే అవకాశం దక్కుతుంది.