రాజకీయాల్లో కుటుంబపెద్ద బతికున్నన్నాళ్లే ఆ ఫ్యామిలీకి గౌరవం. ఇంటిగుట్టు గడపదాటకుండా ఉంటుంది. అసలు వ్యక్తే లేకుండా పోయాక ఎంత పెద్ద కుటుంబమైనా రోడ్డునపడుతుంది. ఆళ్లగడ్డలో భూమా దంపతుల మరణం తర్వాత ఆ కుటుంబంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు సీమలోని మరో పొలిటికల్ ఫ్యామిలీలో వారసత్వ చిచ్చు టీవీ స్టూడియోలదాకా వచ్చింది. చల్లా రామకృష్ణారెడ్డి బతికున్నంత కాలం ఆయనకు రాజకీయంగా ఎదురెళ్లినవారు లేరు. ఆయనింట్లో ఎవరూ బయటికొచ్చింది లేదు. కానీ చల్లా రామకృష్ణారెడ్డి తర్వాత ఆయన చిన్నకొడుకు మరణంతో ఆ ఇంట్లో వారసత్వ పోరు కొట్టుకునేదాకా వచ్చింది.
ఒకరేమో ఇంటి కోడలు మరొకరు ఆ ఇంటి పెద్ద కొడుకు. వీళ్లిద్దరూ చల్లా కుటుంబ రాజకీయ వారసత్వంపై వీధిపోరాటానికి దిగారు. రాజకీయ వారసత్వం తనదంటే తనదంటూ కొట్లాటల దాకా వెళ్లారు. సీమ గడ్డపై చల్లా రామకృష్ణారెడ్డి పేరు తెలియనివారు ఉండరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పదవిలో ఉండగా కన్నుమూశారు. రామకృష్ణారెడ్డి అకాల మరణంతో ఆయన చిన్న కుమారుడు భగీరథరెడ్డికి వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే అనారోగ్యంతో భగీరథరెడ్డి కూడా మరణించడంతో చల్లా ఫ్యామిలీలో వారసత్వ పోరు మొదలైంది. చల్లా రామకృష్ణారెడ్డి పెద్దకొడుకు విఘ్నేశ్వర్రెడ్డినే వారసుడని కుటుంబీకులు ప్రకటించడంతో అసలు గొడవ మొదలైంది.
భర్త మరణించే సమయానికే జడ్పీటీసీగా ఉన్నారు దివంగత భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి. రాజకీయంగా భర్త స్థానాన్ని భర్తీచేసేందుకు ఆమె ముందుకు రావటంతో ఇంటిపోరు వీధికెక్కింది. శ్రీలక్ష్మి ప్రత్యేకంగా కార్యాలయాన్ని తెరవటం రాజకీయంగా యాక్టివ్ కావటంపై చల్లా కుటుంబం గుర్రుగా ఉంది. మామ భర్తల ఫొటో పెట్టుకున్నాననే అక్కసుతో తనపై దాడిచేశారంటోంది శ్రీలక్ష్మి. ఊళ్లో ఉండొద్దని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదుచేసింది. అదే సమయంలో ఆమెపైనా చల్లా కుటుంబం ఫిర్యాదుచేసింది. తమ కుటుంబ ఆస్తులు శ్రీలక్ష్మి తన పేర రాయించుకుందని చల్లా రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు ఆరోపణలు చేశారు. తన తల్లితో కలిసి మరదలిపై ఫిర్యాదుచేశారు.
చల్లా ఫ్యామిలీ విభేదాలు రోడ్డునపడటమే కాకుండా పోలీస్స్టేషన్దాకా రావటంతో వైసీపీ పెద్దలు స్పందించారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని రంగంలోకి దింపి చల్లా ఫ్యామిలీతో చర్చలు జరిపింది. కుటుంబసభ్యులంతా విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా ముందుకెళ్లాలని పార్టీ పెద్దలు సూచించారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఎవరిదారి వారిదన్నట్లే ఉంది. సీఎం జగన్మోహన్రెడ్డిని కలిశాక స్పీడ్ పెంచారు చల్లా చిన్న కోడలు. మౌనంగా ఉంటే చల్లా రాజకీయ వారసత్వాన్ని ఆమె హైజాక్ చేసుకుంటుందనే భయంతో అత్త బావ మ్యాటర్ని సీరియస్గా తీసుకున్నారు. సీమలో ప్రత్యర్థుల మధ్యే కాదు పంతానికొస్తే ఫ్యామిలీల్లో కూడా ఫ్యాక్షనే.