బీఆర్‌ఎస్‌కి డౌట్ కొడ్తోంది. కాంగ్రెస్ పార్టీ ముందే ఆత్మరక్షణలో పడింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు బీజేపీ కాచుకుని కూర్చుంది. అందుకే కలిసి ఉంటే కలదు సుఖమన్న అభిప్రాయంతో ఉన్నాయి బీఆర్‌ఎస్-కాంగ్రెస్. కాంగ్రెస్ కోరుకుంటున్నదే కేసీఆర్ పార్టీ మనసులో కూడా ఉన్నట్లుంది. జాతీయరాజకీయాల్లోకి ప్రవేశించాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్‌ని పక్కనపెట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన. అందుకే బీజేపీ-కాంగ్రెస్సేతర పక్షాలను కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అయితే వర్కవుట్ కాకపోవటం బీజేపీ సెగ తన గడపదాకా తగలటంతో కేసీఆర్ కూడా కాంగ్రెస్‌మీద సానుకూలతతోనే ఉన్నారు.
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ (ఒకప్పటి టీఆర్‌ఎస్) ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో సభలు సమావేశాలు పెట్టి నాయకులను చేర్చుకుంటున్నారు. ఇంతకాలం కాంగ్రెసేతర బీజేపీయేతర పార్టీలను కలిసి కూటమిగా కోసం ప్రయత్నించారు. తాజాగా అదానీ అంశం రాహుల్ అనర్హతతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ కూడా విపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ బలపడేలా ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలున్నా బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీచేస్తేనే రాజకీయంగా లాభం జరుగుతుందన్న అభిప్రాయాంతో జానారెడ్డిలాంటి నేతలున్నారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామంటున్నారు జానారెడ్డి. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారన్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు విషయంలో జానారెడ్డి మాటలు తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీలో తన వ్యాఖ్యలు కలకలం రేపటంతో జానారెడ్డి వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పొత్తుల విషయం అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అంటూ మాటమార్చారు. ఈమధ్యే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందంటూనే ఆ పరిస్థితి వస్తే కాంగ్రెస్ బీఆర్‌ఎస్ పొత్తు అనివార్యం అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తెలంగాణలో భారత్ జోడో యాత్రలో పొత్తులపై రాహుల్‌గాంధీ స్పష్టత ఇచ్చినా పార్టీలోనైతే ఆ చర్చ ఆగడంలేదు. విడివిడిగా పోటీచేసి మూడోపార్టీకి మేలు చేసేకంటే కలిసి పోటీచేయడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు.